“అప్పులు తెస్తున్నారు, రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారు”.. కొన్నిరోజులుగా ఏపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాల ఏడుపు ఇది. ఇప్పుడీ ఏడుపుకి పవన్ కల్యాణ్ కోరస్ కలిపారు.
అసలు అన్ని అప్పులు ఎలా తెస్తారని ప్రశ్నిస్తున్న పవన్ కి, కరోనా కష్టకాలంలో చేపట్టిన సంక్షేమ పథకాలు ఎందుకు గుర్తురాలేదు. ఇటీవల ఓ కేంద్ర సంస్థ ప్రకటించిందంటూ.. అప్పుల చిట్టా ఒకటి పట్టుకుని చదివి వినిపించారు జనసేనాని.
ఆ పార్టీ అధినేత చంద్రబాబు, వారి అనుకూల మీడియా దీన్నే రాద్ధాంతం చేసింది కూడా. అసలు వీరి సమస్య అంతా అప్పులు తెచ్చినందుకు కాదు, అలా తీసుకొచ్చిన డబ్బుని తమలాగా దుర్వినియోగం చేయలేదనేది వీరి బాధ.
రాష్ట్రానికి వచ్చే నిధులన్నిటినీ జగన్ సర్కారు పేదల అభివృద్ధి పథకాలకే కేటాయించింది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే కరోనా కష్టకాలం కమ్ముకున్నా మాట తప్పకుండా, మడమ తిప్పకుండా ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేరుస్తున్నారు. ఇవ్వని వాటిని కూడా పూర్తి చేస్తున్నారు.
జగన్ జమానాలో తమ సమస్య ఇదీ అని ఆయన్ని అడగనివారిదే పాపం. అడిగినవారందరికీ లేదనకుండా ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు.
కరోనా కష్టాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాలను సొంత బిడ్డల్లా, మిగతా రాష్ట్రాల్ని సవతి బిడ్డల్లా చూస్తోంది కేంద్రం. ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తున్నా చంద్రబాబు, పవన్ కల్యాణ్ లాంటివారికి ఎందుకో నోరు పెగలదు.
బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్, మరోసారి పొత్తు కోసం అర్రులు చాస్తున్న బాబు… కేంద్ర వైఫల్యాలను వదిలేసి రాష్ట్రంపై పడుతున్నారు.
విభజిత రాష్ట్రానికివ్వాల్సిన సాయాన్ని మరిచి, కరోనా కష్టకాలంలోనూ కనికరించలేదు కాబట్టే ఏపీకి అప్పులెక్కవయ్యాయి. అంతెందుకు రాష్ట్ర విభజన సమయంలో 90వేల కోట్లగా ఉన్న నవ్యాంధ్ర అప్పులు టీడీపీ హయాంలో 3.62లక్షల కోట్లకు చేరింది వాస్తవం కాదా. పోనీ ఆ తెచ్చిన డబ్బుతో చంద్రబాబు ఒక్క పర్మినెంట్ బిల్డింగ్ అయినా కట్టాడని నిరూపించగలరా.
కనీసం ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశారా, పోనీ రైతులకైనా పూర్తిస్థాయిలో రుణమాఫీ అందిందా. ఏమీ చేయకుండా చంద్రబాబు అప్పులు చేసినప్పుడు పవన్ కల్యాణ్ కి కోపం రాలేదు కానీ.. సంక్షేమ పథకాల కోసం రుణాలు తీసుకుంటే మాత్రం జగన్ పై పవన్ కు ఊరికే కోపం వస్తోంది.
ప్రతిపక్షాల విమర్శలన్నీ.. జగన్ రుణాలు తెచ్చినందుకు కాదు, వాటిని సక్రమంగా ఖర్చు చేస్తున్నందుకు, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే పథకాలను ఆపకుండా కొనసాగిస్తున్నందుకు.
ఏడాది పాలనతోనే జగన్ ప్రభ వెలిగిపోవడం, మరో నాలుగేళ్లలో తమకు నామరూపాలు లేకుండా చేస్తారనే నమ్మకం కుదరడంతోనే ప్రతిపక్షాలతో కలిసి పవన్ ఇలా రగిలిపోతున్నారు.