పనిచేస్తున్న షాపుకే కన్నం వేశాడు ఓ ప్రబుద్ధుడు. 7 కిలోల బంగారాన్ని కొట్టేయాలని చూశాడు. కానీ అతడి దొంగ తెలివితేటలు, పోలీసుల ముందు నిలవలేదు. ఇంటిదొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. కేవలం 3 గంటల వ్యవథిలో ఈ కేసును ఛేదించారు విజయవాడ పోలీసులు.
విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు సమీపంలో సాయిచరణ్ అనే వ్యక్తి జ్యూవెలరీ షాపు నిర్వహిస్తున్నాడు. కరోనా వల్ల వ్యాపారం సరిగ్గా సాగకపోవడంతో 19 కిలోల వెండి, 20 లక్షల డబ్బును షాపులోనే ఉంచాడు. మరో స్నేహితుడికి చెందిన నగల దుకాణంలో ఉన్న 7 కిలోల బంగారం, 22 లక్షల నగదు కూడా షాపులోనే ఉంచాడు.
సరిగ్గా అదను కోసం చూసిన విక్రమ్ కుమార్.. ఎప్పట్నుంచో తన మైండ్ లో ఉన్న ప్లాన్ ను అమలు చేశాడు. కొన్ని రోజులుగా అదే షాపులో పనిచేస్తున్న విక్రమ్ కుమార్.. యజమాని లేని టైమ్ చూసి మొత్తం బంగారం, డబ్బును కాజేసే ప్రయత్నం చేశాడు. అంతా లూటీ చేసి, షాపు కింద ఇంట్లో దాచిపెట్టాడు. షాపులో దొంగలు పడ్డారనే కలరింగ్ ఇచ్చేందుకు తననుతాను గాయపరుచుకున్నాడు. కాళ్లు కట్టేసుకున్నాడు. సీసీటీవీ కెమెరాతో పాటు డిజిటల్ వీడియో రికార్డర్ ను పీకేసి కాలవలో పడేశాడు.
అయితే తన షాపులో సీసీటీవీ కెమెరా పీకేశాడు కానీ ఇతర షాపుల్లో సీసీటీవీ కెమెరాల్ని అతడు ఏం చేయలేకపోయాడు. రంగంలోకి దిగిన పోలీసులు.. పక్కనే ఉన్న షాపుల్లోకి సీసీటీవీ ఫూటేజ్ ను పరిశీలించగా.. ఓ సంచితో విక్రమ్ కుమారే బయటకు వెళ్లి లోపలకు వచ్చినట్టు గుర్తించారు. అంతేకాదు.. షాపులో కూడా చాలాచోట్ల అతడి వేలిముద్రలు తప్ప, ఇతరుల వేలిముద్రలు గుర్తించలేదు.
దీంతో విక్రమ్ కుమార్ ను తమదైన శైలిలో ప్రశ్నించగా.. నేరం అంగీకరించాడు. షాపు కింద ఇంట్లో దాచిన బంగారాన్ని పోలీసులు రికవరీ చేసుకున్నారు.