ఢిల్లీలో కోవిడ్ -19 యాక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఒక దశలో ఏకంగా లక్షకు పైగా కరోనా కేసులతో భయం రేపిన ఢిల్లీ మరి కొన్నాళ్లలో కరోనా రహితంగా నిలిచినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదని పరిస్థితి ఏర్పడుతోంది. రోజు వారీగా ఢిల్లీలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుతూ ఉంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం.. ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య లక్షా ఇరవై ఏడు వేల వరకూ ఉంది. అయితే వీరిలో దాదాపు లక్షా పది వేల మంది ఇప్పటికే కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 3,745 మంది కరోనాతో ఢిల్లీలో మరణించారట. ఇలాంటి నేపథ్యంలో యాక్టివ్ కేసుల సంఖ్య 14,554గా నిలుస్తోంది.
గత 24 గంటల్లో కూడా దాదాపు వెయ్యి కొత్త కేసులు నమోదు కాగా, 1400 మందికిపైగా డిశ్చార్జ్ అయ్యారు. ఇలా యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుతూ ఉంది. ప్రస్తుతం ఉన్న 14 వేల స్థాయి యాక్టివ్ కేసుల్లో కూడా ఆసుపత్రుల్లో ఉన్న వారు నాలుగు వేల మంది మాత్రమేనట. మిగిలిన వారు మైల్డ్ సింప్టమ్స్ తో ఇళ్లలోనే ఉండి చికిత్స పొందుతూ ఉన్నారు. ఆసుపత్రుల్లో ఉన్న వారిని డిశ్చార్జ్ చేయగలిగితే ఢిల్లీ కరోనాపై మంచి విజయం సాధించినట్టే అవుతుంది.
ఒకదశలో కరోనా వ్యాప్తి తీవ్రంగా జరిగిన ఢిల్లీలో.. ప్లాస్మా థెరపీ ప్రయోజనాన్ని ఇచ్చిందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. కరోనా నుంచి కోలుకున్న వారి నుంచి ప్లాస్మా సేకరించి, వైరస్ తో ఇబ్బంది పడుతున్న వారికి వైద్యం చేశారని.. ఈ ప్లాస్మా థెరపీ ఢిల్లీ లో కరోనాకు చెక్ పెట్టగలిగిందని అంటున్నారు. ఢిల్లీలో కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా డొనేషన్ కు ముందుకు రావడం అక్కడ సానుకూల ఫలితాలకు ఒక ముఖ్యకారణమని అంటున్నారు. మరి మిగిలిన రాష్ట్రాల్లో ఈ ప్రయత్నాలు పెద్దగా జరుగుతున్నట్టుగా లేవు.