కేసీఆర్ సర్కార్‌పై బీజేపీ అగ్రనాయకురాలు, సీనియర్ హీరోయిన్ విజయశాంతి తన అక్కసు వెళ్లగక్కారు. లిక్కర్ స్కామ్‌లో కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసు ఇవ్వడంపై ఆమె సీరియస్‌గా స్పందించారు. ఈ సందర్భంగా ఓ చానల్‌తో ఆమె మాట్లాడుతూ టీఆర్ఎస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఎనిమిదేళ్లుగా చేసిన పాపాలు ఇప్పుడు పండుతున్నాయని విజయశాంతి సంతోషం వ్యక్తం చేశారు. ఎవరినీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయాల్సిన అవసరం బీజేపీకి లేదన్నారు. లిక్కర్ స్కామ్‌లో కవిత పాత్రపై దర్యాప్తు సంస్థలు నిగ్గు తేలుస్తాయన్నారు. తప్పు చేయకుంటే భయమెందుకని ఆమె ప్రశ్నించారు.
ఐటీ, ఈడీ, సీబీఐ అధికారులు తమ డ్యూటీ చేస్తున్నారన్నారు. వాళ్ల పని చేయనివ్వాలని విజయశాంతి విజ్ఞప్తి చేశారు. ఎందుకు హంగామా చేస్తున్నారని మండిపడ్డారు. ఐటీ సోదాలు చేసినప్పుడు ప్రశ్నలు అడుగుతారని, వాటికి సమాధానాలు చెప్పాలని ఆమె అన్నారు. సరైన సమాధానాలు చెప్పకుంటే చర్యలు తీసుకుంటారన్నారు.
కేసీఆర్ పాలనలో తీవ్ర అవినీతి జరుగుతోందని, సీరియస్‌గా దృష్టి సారించాలని ఎప్పటి నుంచో తమ ఘోష వినిపిస్తున్నామన్నారు. తమ బాధ దేవుడు విన్నాడని, కాస్త కనికరించినట్టు వున్నాడన్నారు. ఎంతో మంది త్యాగంతో తెలంగాణ వచ్చిందన్నారు. కానీ ఉద్యమకారులకు న్యాయం జరగలేదన్నారు.
తెలంగాణ పాలకులు ఎంతెంత తిన్నారో, ఎంత దోపిడీ చేశారో బయటికి రావాలన్నారు. ఐటీ సోదాలు జరిగినప్పుడు మంత్రులు ఎక్కువగా హంగామా చేయడం, కొట్టడం లాంటి చేష్టల వల్ల తప్పు చేశారనే భావన కలుగుతుందన్నారు. కేవలం ఒకరిద్దరు తెలంగాణ మంత్రులపై కాకుండా యావత్ తెలంగాణ టీఆర్ఎస్ నాయకులందరిపై రైడ్‌లు జరగాలని ఆమె డిమాండ్ చేశారు. వీళ్ల దోపిడీని చూసి.. ఇలాంటి వాళ్లకు ఓట్లు వేశామా? అనే ఆలోచన ప్రజల్లో రావాలన్నారు.
మోడీ వచ్చే ముందు ఈడీ వస్తుందన్న కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలను విజయశాంతి తిప్పి కొట్టారు. మోడీకి పనేం లేదా? అని ప్రశ్నించారు. డబ్బు కట్టలు ఇంట్లోనే దొరికాయా లేక రోడ్డు మీద దొరికాయా? అని విజయశాంతి ప్రశ్నించారు. మంత్రి మల్లారెడ్డి ఇంట్లోనే కదా డబ్బు కట్టలు దొరికింది అని ఆమె అడిగారు. అధికార పార్టీ నేతల తప్పులన్నీ ప్రజలకు తెలుస్తున్నాయన్నారు. కేసీఆర్ సర్కార్‌ను గద్దె దింపడం ఖాయమన్నారు.