తెలంగాణలో వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఎవరికీ చిక్కడం లేదు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆమెకు స్వయాన అన్న కావడంతో, ఆ బంధాన్ని గుర్తు చేస్తూ ఆమెను రాజకీయంగా ఇరకాటంలో పెట్టేందుకు ఒక వర్గం మీడియా, అలాగే ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారు. అయితే వారి వ్యూహాలు షర్మిల తెలివితేటల ముందు పని చేయడం లేదు.
వైఎస్ జగన్ అవినీతి అంశంపై మీడియా ప్రతినిధులు షర్మిలను ప్రశ్నించగా, ఆమె షాకింగ్ కామెంట్స్ చేశారు. అవేంటో తెలుసుకుందాం. తెలంగాణ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి షర్మిల నివాళులర్పించారు. ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అమరుల కుటుంబాలను సీఎం కేసీఆర్ పట్టించుకోలేదని విమర్శించారు. తెలంగాణ సాధనలో 1200 మంది బలిదానం చేసుకుంటే కేవలం 500 కుటుంబాలకు మాత్రమే కేసీఆర్ సర్కార్ నామమాత్రంగా సాయం చేసిందని విమర్శించారు.
శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ఎన్నికల్లో ఓడిపోతుందని తెలిసి కూడా బరిలో నిలిపారని విమర్శించారు. అసలు ఆమెను ఓడిపోయే చోట నిలబెట్టాల్సిన అవసరం ఏంటని షర్మిల నిలదీశారు. కేసీఆర్ కుమార్తె కవిత ఎన్నికల్లో ఓడిపోతే ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారన్నారు. మరి శ్రీకాంతాచారి తల్లికి ఎమ్మెల్సీ పదవి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. అమరుడి తల్లికి ఏ ఒక్క నామినేటెడ్ పదవి అయినా ఎందుకు ఇవ్వలేదని ఆమె నిలదీశారు. కొడుకు ల్యాండ్ బ్యాంక్, కూతురు లిక్కర్ బ్యాంక్, కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో దోచుకున్నారని షర్మిల తీవ్ర ఆరోపణలు చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖరరెడ్డి కొడుకుగా జగన్‌మోహన్‌రెడ్డి బాగా సంపాదించుకున్నాడని, అలాగే ప్రభుత్వ ఉద్యో గులు జైలు పాలయ్యారని టీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్న విషయాన్ని షర్మిల ఎదుట మీడియా ప్రతినిధులు పెట్టారు. షర్మిలారెడ్డి సంపాదించుకోలేదని తన గురించి ఆమె వివరణ ఇచ్చారు. అలాగే తెలంగాణలో తాను రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించిన మొట్ట మొదటి రోజే సంబంధం లేదని వైసీపీ పెద్దలు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. మొన్న కూడా సంబంధం లేదని చెప్పారని, అలాంటప్పుడు సంబంధం లేదని విషయాల గురించి తాను మాట్లాడ్డం అవసరమా? అని షర్మిల ఎదురు ప్రశ్న వేశారు.
ఇటీవల షర్మిలను అరెస్ట్ చేసిన సందర్భంలో ఆమె రాజకీయాలతో సంబంధం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. దాన్ని దృష్టిలో పెట్టుకుని షర్మిల కూడా అదే రీతిలో తనకు అన్న పార్టీతో సంబంధం లేదని షాకింగ్ కామెంట్స్ చేయడం చర్చనీయాంశమైంది.