తెలంగాణలో షర్మిల అన్ని రాజకీయ పార్టీలకు కంటగింపుగా తయారయ్యారు. తెలంగాణతో షర్మిలకు ఏం సంబంధం అంటూ ప్రత్యర్థులు నిలదీస్తున్నారు. ఇంతకాలం షర్మిల రాజకీయ ఉనికిని గుర్తించడానికే నిరాకరిస్తూ వచ్చిన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు… ఇప్పుడు ఆమె గురించి పాజిటివ్, నెగెటివ్ కోణంలో మాట్లాడ్డం ఆసక్తికర పరిణామం. గత కొన్ని రోజులుగా తన చుట్టూ తెలంగాణ రాజకీయాలు నడుస్తుండడాన్ని షర్మిల అవకాశంగా తీసుకుని బలపడే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో షర్మిలపై రాజకీయ కమెడియన్‌గా పేరొందిన ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ అక్కసు వెళ్లగక్కారు. షర్మిల గుర్తింపును ఆయన ఎంతగా ఓర్వలేకున్నారంటే… అసలు ఆమెకు మీడియా కవరేజ్ ఇవ్వకూడదనే డిమాండ్ చేసే వరకూ. ఇది ఒకింత ఆశ్చర్యం కలిగించే అంశమే. ఎందుకంటే తెలుగు సమాజంలో కేఏ పాల్ రాజకీయ పాత్ర ఏంటో అందరికీ తెలుసు. అలాంటి నాయకుడు కూడా మరో పార్టీ నాయకురాలికి ప్రచారం ఇవ్వొద్దని కోరుకోవడం అంటే… మనిషి స్వార్థం, నిరంకుశత్వం ఏ స్థాయిలో వుంటుందో కేఏ పాల్ మాటలే నిదర్శనం.
కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డికి తెలంగాణతో సంబంధం లేదన్నారు. అందుకే షర్మిల తీసుకొస్తానంటున్న రాజన్న రాజ్యం తెలంగాణకు అవసరం లేదని ఆయన అన్నారు. షర్మిల అన్న వైఎస్ జగన్ ఆంధ్రాలో పాదయాత్ర చేసి నిరంకుశ రాజ్యం తీసుకొచ్చారని విమర్శించారు.
సోదరుడి బాటలోనే షర్మిల నడుస్తున్నారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణ నుంచి బరిలో దిగుతానన్నారు. అయితే ఎక్కడి నుంచి అనేది ఇంకా తేల్చుకోలేదనడం గమనార్హం. ఒకే ఒక్క చాన్స్ ఇవ్వాలని ఆయన కోరడం విశేషం.