ఐఏఎస్ అధికారులు ప్రజా సేవకులు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అసలైన వారధులు మూడున్నర దశాబ్దాలకు పైగా వారు తమ విలువైన సేవలు అందిస్తారు. ఉన్నత ఉద్యోగం అందుకున్న వారిలో ప్రజలకు మేలు చేయాలని ఉంటుంది. అయితే వివిధ కారణాల వల్ల చాలా మంది చేయలేకపోతారు.
కొందరు మాత్రం తమకు ఉన్న అవకాశాలకు వెతుక్కుంటూ ప్రజా సేవలో తరించాలని చూసారు. అలాంటి వారిలో విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున ముందు వరసలో ఉన్నారని చెప్పకతప్పదు. విశాఖలో అతి పెద్ద ఆసుపత్రి కేజీహెచ్ లో సమస్యలను కడిగేసి ప్రక్షాళన చేయాలనుకున్నారు. దాని కోసం అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఊరుకోలేదు.
తానే స్వయంగా ఆసుపత్రికి వెళ్ళి స్వయంగా పరిశీలించారు. ఒక రాత్రి అంతా తోటి రోగులతో పాటు గడిపి అక్కడే బెడ్ మీద పడుక్కున్నారు. ఆ దెబ్బతో కేజీహెచ్ లో చాలా మార్పు తీసుకురాగలిగారు. ఆ విధంగా వార్తలలోకి ఎక్కిన కలెక్టర్ ఇపుడు మరో మంచి పని చేసి గొప్పోరు అనిపించేసుకున్నారు.
ఆయన హెచ్ఐవీ ఎయిడ్ వ్యాధిగ్రస్తులకు ప్రతీ నెలా పౌష్టిక ఆహారం అందించేందుకు తన నెల జీతం లక్షా పది వేల రూపాయలను విరాళంగా ఇచ్చి గొప్ప మనసు చాటుకున్నారు. ఎయిడ్స్ రోగులతో కలసి అల్పాహారం తీసుకుని వారితోనే గడిపారు. ఆ కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని చెప్పారు. దాంతో విశాఖ జనమంతా ఎంత మంచివారండీ మా కలెక్టర్ గారు అని అంటున్నారు.
ఇలాంటి అధికారులు ఉంటే ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. ప్రజల సమస్యలూ పరిష్కారం అవుతాయి. కానీ అందరూ అలా ఉంటారా అన్నది ప్రశ్న అయితే అలా ఆశించడం కూడా అత్యాశే అవుతుందిగా.