జ‌గ‌న్‌కి తెలియాల్సింది, తెలుసుకోవాల్సింది ఏంటంటే!

సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు మ‌రో రెండేళ్ల గ‌డువు వుండ‌గానే ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. గెలుపు, అధికారం రుచి మ‌రిగిన వైసీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌, దాన్ని వ‌దులుకోడానికి సిద్ధంగా లేరు. అయితే అంతా…

సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు మ‌రో రెండేళ్ల గ‌డువు వుండ‌గానే ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. గెలుపు, అధికారం రుచి మ‌రిగిన వైసీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌, దాన్ని వ‌దులుకోడానికి సిద్ధంగా లేరు. అయితే అంతా ప్ర‌జ‌ల చేతుల్లో వుండ‌డంతో, మ‌రోసారి వాళ్ల ఆశీస్సులు పొంద‌డానికి అన్ని ర‌కాల వ్యూహాల‌కు జ‌గ‌న్ ప‌దును పెడుతున్నారు. ఈ నేప‌థ్యంలో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం పేరుతో త‌న ఎమ్మెల్యేలు, ఎంపీలంద‌రినీ జ‌నం వ‌ద్ద‌కు పంపేలా జ‌గ‌న్ ఆదేశాలిచ్చారు.

గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వంపై నిర్వ‌హించిన వ‌ర్క్‌షాప్‌లో జ‌గ‌న్ మ‌రోసారి దిశానిర్దేశం చేశారు. కుప్పం విజ‌యాన్ని కేంద్రంగా చేసుకుని పార్టీ ప్ర‌జాప్ర‌తినిధుల్లో విజ‌యం ఆకాంక్ష‌ను ర‌గిల్చే ప్ర‌య‌త్నం చేశారు. ఈ ద‌ఫా 175కి 175 సీట్లు గెలుపొందాల‌ని ఆదేశించారు. అయితే జ‌గన్‌కు తెలియాల్సింది, తెలుసుకోవాల్సిన ముఖ్య‌మైన సంగ‌తి ఒక‌టుంది. అదేంటో ఆయ‌న మాట‌లను తీసుకునే విశ్లేషిద్దాం.

‘కుప్పం మున్సిపాల్టీని గెలుస్తామని ఎవరైనా అనుకున్నామా? ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను క్లీన్‌ స్వీప్‌ చేస్తామని అనుకున్నామా? ఇంతకు ముందెప్పుడూ అది జరగలేదు. కానీ ఈసారి జరిగింది. ఎందుకు జరిగిందంటే.. ప్రతి ఇంటికీ మంచి చేశాం కాబట్టే. ఇదే రీతిలో 175కు 175 శాసనసభ స్థానాలను సాధించగలుగుతాం. ఇది జరగాలి అంటే.. మనం కష్టపడాలి’  అని జ‌గ‌న్ మార్గ‌నిర్దేశం చేయ‌డం పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు దారి తీసింది.

మ‌రి అనంత‌పురం జిల్లా తాడిప‌త్రి మున్సిపాల్టీని టీడీపీ ద‌క్కించుకున్న సంగ‌తిని జ‌గ‌న్ మ‌రిచిపోకూడ‌దు. తాడిప‌త్రిలో ఓడిపోతామ‌ని ఎవ‌రైనా, ఎప్పుడైనా అనుకున్నామా? అని ఏ ఒక్క అధికార పార్టీ ప్ర‌జాప్ర‌తినిధి అయినా ప్ర‌శ్నించుకున్నారా? 2019 ఎన్నిక‌ల్లో తాడిప‌త్రిలో వైసీపీ విజ‌య కేత‌నం ఎగ‌రేసింది. మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌కు వ‌చ్చే స‌రికి అధికార పార్టీ బొక్క బోర్లా ప‌డడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? రాష్ట్ర‌మంతా ఏక‌ప‌క్షంగా ఫ‌లితాలు వైసీపీ వైపు వ‌చ్చాయి. తాడిప‌త్రి మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో సేవ్ తాడిప‌త్రి పేరుతో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి విస్తృత ప్ర‌చారం చేశారు. క‌నీసం టీడీపీకి ఓటు వేయాల‌ని కూడా ఆయ‌న అభ్య‌ర్థించ‌లేదు. అక్క‌డ టీడీపీకి జ‌నం ఎందుకు ప‌ట్టం క‌ట్టారో జ‌గ‌న్ వాస్త‌వాల‌ను తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.

గ‌తంలో టీడీపీ అధికారంలో ఉండ‌గా, ప‌రిటాల ర‌వి హ‌వా కొన‌సాగుతున్న రోజుల్లో ఇదే తాడిప‌త్రి మున్సిపాల్టీలో జేసీ బ్రద‌ర్స్ కనీసం త‌మ వాళ్ల‌తో నామినేష‌న్లు వేయించ‌లేక‌పోయారు. త‌మ చేతిలో ఎప్పుడూ ఓడిపోయే పేరం నాగిరెడ్డికి తాడిప‌త్రి మున్సిపాలిటీని జేసీ బ్ర‌ద‌ర్స్ విడిచిపెట్టాల్సి వ‌చ్చింది. అలాగ‌ని రాష్ట్ర‌మంతా తాడిప‌త్రి మున్సిపాల్టీలా టీడీపీ చేసుకోగ‌లిగిందా? మ‌రి ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉండ‌గా, ఇదే జేసీ బ్ర‌ద‌ర్ మున్సిపాలిటీ ద‌క్కించుకుని షాక్ ఇవ్వ‌లేదా?

ప్ర‌తి రాజ‌కీయ నాయ‌కుడికి ఒక టైమ్ అంటూ వుంటుంది. మ‌హాభారతంలోని పాత్ర‌ల్ని ఇందుకు చ‌క్క‌టి ఉదాహ‌ర‌ణ‌గా తీసుకోవ‌చ్చు. పాండ‌వుల ప‌రాక్ర‌మాన్ని నిలువ‌రించే వ‌రం ఒకే ఒక్క రోజు సైంధ‌వుడికి  ద‌క్కుతుంది. దాన్ని సైంధ‌వుడు సద్వినియోగం చేసుకుంటాడు. అలాగే కురుక్షేత్రంలో అంతిమ ద‌శ‌లో  క‌ర్ణుడుని శాపాలు చుట్టుముడుతాయి. యుద్ధ‌క్షేత్రంలో ఉండ‌గా ర‌థం భూమిలో కూరుకుపోయి,అర్జునుడి చేతిలో మ‌హా ప‌రాక్ర‌మ‌వంతుడైన క‌ర్ణుడు ప్రాణాలు కోల్పోతాడు. ఇలా ప్ర‌తి ఒక్క‌రికి ఒక్కో స‌మ‌యం వుంటుంది.

కేవ‌లం కుప్పం మున్సిపాలిటీ, అలాగే ఆ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో క్లీన్‌స్వీప్ చేశామ‌ని అత్యుత్సాహానికి పోతే అస‌లుకే ఎస‌రొస్తుంది. కుప్పంలో గెలుపును ఆస్వాదించ‌డంతో పాటు తాడిప‌త్రి ఓట‌మిని కూడా గ‌మ‌నంలో పెట్టుకుని జాగ్ర‌త్త‌గా న‌డుచుకోవాలి. గెలుపు అనేది మ‌త్తెక్కిస్తుంది. కానీ ఓట‌మి అప్ర‌మ‌త్తం చేస్తుంది. ప్ర‌స్తుతం జ‌గ‌న్ , వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు ఏ ర‌క‌మైన ఫీలింగ్‌లో ఉన్నారో త‌మ‌కు తాము ఆత్మ‌ప‌రిశోధ‌న చేసుకోవాలి.  

సొదుం ర‌మ‌ణ‌