ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు తానేం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కాని పరిస్థితి. పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించి, బలోపేతం చేయాలని ఆదేశించినా… ఇంత వరకూ ఆ పని తప్ప మిగిలినవన్నీ వీర్రాజు చేస్తున్నారు.
కనీసం ఒక్కరిని కూడా ఆయన తన పార్టీలోకి చేర్చుకున్న దాఖలాలు లేవు. ఇదేమని ఎవరైనా ప్రశ్నిస్తే… ఆవేశ పడడం ఆయనకు అలవాటైంది. నిన్న అమలాపురం వెళుతున్న సోము వీర్రాజును అడ్డుకున్న ఎస్ఐ పట్ల వీర్రాజు దురుసుగా ప్రవర్తించడాన్ని అందరూ చూశారు.
ఈ నేపథ్యంలో ఆయన నెల్లూరు ఆత్మకూరు ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లారు. మీడియాతో మాట్లాడుతూ అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు. ఆత్మకూరు నియోజకవర్గంలో ఒక మండలంలో బీజేపీ ఏజెంట్లను కూచోనివ్వరనే ప్రచారం జరుగుతోందని, ఎలా చేస్తారో చూస్తామని హెచ్చరించారు. అమలాపురం వెళుతున్న తనను అడ్డుకున్నందుకు పోలీసులు కేసు పెట్టారని, మరి వైసీపీ ఎమ్మెల్యేలు నోరు పారేసుకున్నా ఎందుకు పోలీసులు పట్టించుకోలేదని నిలదీశారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాపై విమర్శలు గుప్పించిన మంత్రి రోజాపై ఆయన విమర్శలు చేశారు. రోజా సినిమా నటి అని, ఆమెకి రాజకీయాలపై అవగాహన లేదన్నారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్టు చదివే మంత్రి రోజా అని వెటకరించారు. తిరుపతి, బద్వేలు ఉపఎన్నికల్లో ప్రజలు బీజేపీకి ఓట్లు వేసిన విషయం రోజాకి తెలియదా? అని సోము వీర్రాజు ప్రశ్నించడం గమనార్హం.
మరి తమ మిత్రుడైన పవన్‌కల్యాణ్ ఎవరో వీర్రాజుకు తెలియదా? టాలీవుడ్ అగ్రహీరో అయిన పవన్‌కు ఫ్యాన్స్, అలాగే బలమైన సామాజిక వర్గం మద్దతు ఉంటుందనే కదా బీజేపీ పొత్తు పెట్టుకున్నది. రాజకీయాలపై అవగాహన విషయంలో పవన్‌కల్యాణ్ కంటే అజ్ఞాని మరొకరు ఉండరనే సంగతిని వీర్రాజు గుర్తించుకుంటే మంచిది.
రోజాకు కాదు, పవన్‌కు రాజకీయాలపై అవగాహన లేదని వీర్రాజుకు తెలియకుండానే విమర్శలు చేస్తున్నారా? ఇదే సినిమా నటుడు ఇటీవల ఆప్షన్ ఇవ్వగానే, మార్గనిర్దేశం చేశాడని సంబరపడిన మొదటి వ్యక్తి కూడా సోము వీర్రాజే. సినిమా నటులపై చులకన భావం వుంటే, పవన్‌తో ఎలా కొనసాగుతున్నారో మరి అనే కామెంట్స్ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.