మహానాడు వేదికపై అంతమంది నేతల ముందు తొడగొట్టి నిలబడిన టీడీపీ నేత గ్రీష్మ.. ఇప్పుడు ట్రోలింగ్ ని మాత్రం అంత గట్టిగా ఎదుర్కోలేకపోతున్నట్టు కనిపిస్తోంది. తనని ట్రోల్ చేస్తున్నారని, కామెంట్స్ చేస్తున్నారంటూ ఆమె ఓ లిస్ట్ రాసుకుని పోలీసుల దగ్గరకు వెళ్లారు.
ఎవ్వర్నీ వదిలిపెట్టనంటూ రంకెలేస్తు ఓ వీడియో విడుదల చేసింది. ఎప్పట్లానే తన బ్రాండ్ డైలాగ్ “ఈడ్చి ఈడ్చి కొడతా” అనేశారు. మొత్తానికి దివ్యవాణి తర్వాత గ్రీష్మకి ఆ స్థానం దక్కేలా ఉంది.
అడుసు తొక్కనేల.. తొడగొట్టనేల..!!
ఎవరి తొడ వారి ఇష్టం, ఏం.. సినిమాల్లో హీరోలు తొడగొడితే చప్పట్లు కొడతారు కదా, రియల్ లైఫ్ లో ఆడవాళ్లు తొడగొడితే ఎందుకు చప్పట్లు కొట్టరు అనుకున్నారేమో.. టీడీపీ యువనేత గ్రీష్మ ఎమోషన్ ఆపుకోలేక మహానాడు వేదికపై ఆ పనిచేశారు. అయితే అనుకున్నదొకటి, అయినది మరొకటి అన్నట్టుగా.. గ్రీష్మ తొడగొట్టే వ్యవహారం ఆ పార్టీ పరువు తీసింది. మగాళ్లు ఏడుస్తారు, ఆడాళ్లు తొడగొడతారంటూ టీడీపీపై ఓ రేంజ్ లో సెటైర్లు పేలాయి. పరోక్షంగా చంద్రబాబు వెక్కి వెక్కి ఏడ్చే ఎపిసోడ్ మరోసారి బాగా హైలెట్ అయింది.
ఇక ప్రతిభా భారతి సౌమ్యురాలు అని, ఆమె కూతురు ఇలాంటి ఫీట్లు చేస్తుందని అనుకోలేదంటూ కామెంట్లు కూడా పడ్డాయి. ప్రచారం కావాలనుకుంటే మాత్రం మరీ ఇంత చీప్ గా బిహేవ్ చేయాలా అని సొంత పార్టీ నుంచే కౌంటర్లు పడ్డాయి. ఒకరకంగా సోషల్ మీడియాలో నెటిజన్లు.. గ్రీష్మని ఆటాడేసుకున్నారు. దీంతో ఆమెకి కోపమొచ్చింది. పేటీఎం బ్యాచ్ అంటూ తనపై కామెంట్లు చేసిన వారిపై విరుచుకుపడ్డారు.
ప్రస్తుతం టీడీపీలో దివ్యవాణి స్థానం ఖాళీ అయింది. ఆమె లాగా ప్రెస్ మీట్లు పెట్టి గంటలు గంటలు ఉపన్యాసాలు ఇవ్వలేకపోవచ్చు కానీ, మాట్లాడిన కాసేపు కళ్లు పెద్దవి చేసి, రంకెలేయడం గ్రీష్మ స్పెషాలిటీ. ప్రస్తుతం ఇలాంటి వారికే పార్టీలో ఎక్కువ ప్రయారిటీ ఉందనే విషయం అర్థమైపోతోంది. అటు వంగలపూడి అనిత నోటితో రెచ్చిపోతుంటే, ఇటు గ్రీష్మ లాంటి వాళ్లు చేతలు, హావభావాలతో హడావిడి చేస్తున్నారు.
అయితే తాము చేసిన హంగామా ని పక్కనపెట్టి, సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారంటూ ఆవేదన చెందడం మాత్రం కొసమెరుపు. తొడకొట్టడం తప్పు కాదు కానీ, ఆ ఫొటోని వైరల్ చేసేవారిదే ఆ తప్పంతా అంటున్నారు గ్రీష్మ. ట్రోలింగ్ తో కూడా ఆమె హైలెట్ కావాలని భావిస్తున్నారు.