తిరుపతిలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందుకు తిరుపతి ఎస్వీయూ ఆడిటోరియం వేదికైంది. ఈ వేదికపై ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ ప్రజలకు విశేషమైన సేవలందించిన వ్యక్తి ఎన్టీఆర్ అని పొగడ్తలతో ముంచెత్తారు. ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు తెలుగు జాతికి అపూర్వ శక్తి అందిస్తాయన్నారు.
ఎన్టీఆర్‌కు జనం నాడి తెలుసన్నారు. పార్టీ పెట్టిన తర్వాత అవిశ్రాంతంగా పని చేసి అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు. ఎన్టీఆర్‌తో తనకు కొంత సాన్నిహిత్యం ఉందన్నారు. 1989 నుంచి ఎన్టీఆర్ మనిషిగా తనపై ముద్ర వేశారని గుర్తు చేశారు.
ఎన్టీఆర్ మనిషిగా ఉండటాన్ని తాను గర్విస్తున్నట్టు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చెప్పడం గమనార్హం. పదవీ విరమణ తర్వాత ఎన్టీఆర్‌పై పుస్తకం రాస్తానని ప్రకటించారు. వ్యక్తిగత లాభం కోసం కాకుండా ప్రజాసేవ కోసమే ఎన్టీఆర్ పార్టీ పెట్టారన్నారు.
జస్టిస్ ఎన్వీ రమణ ఆగస్టులో రిటైర్ కానున్నారు. ఈయన 48వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు తీసుకున్నారు. దాదాపు 16 నెలలు చీఫ్ జస్టిస్‌గా సేవలు అందించే అవకాశం దక్కింది.
జస్టిస్ ఎన్వీ రమణ తెలుగువారు కావడం గర్వకారణం. చీఫ్ జస్టిస్‌గా ఎక్కువ కాలం కొనసాగే అవకాశం ఆయనకు దక్కడం విశేషం. ఈ కార్యక్రమానికి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, బీజేపీ జాతీయ నాయకురాలు పురందేశ్వరి, ఆమె భర్త, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు తదితర పెద్దలు హాజరయ్యారు.