మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సాక్షిగా ఉన్న కల్లూరు గంగాధరరెడ్డి గత రాత్రి ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కడప జిల్లా పులివెందుల పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. అంతేకాదు, అతను కడప జిల్లా నుంచి బహిష్కరణకు గురయ్యాడు.
ఇతను వివేకా హత్య కేసులో అరెస్ట్ అయి, ప్రస్తుతం జైల్లో వున్న డి.శివశంకర్‌రెడ్డికి ప్రధాన అనుచరుడు. వివేకా హత్య కేసును మీద వేసుకుంటే రూ.10 కోట్లు ఇస్తానని శివశంకర్‌రెడ్డి ఆఫర్ చేశాడని సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో గంగాధర్‌రెడ్డి పేర్కొన్నాడు. ఈ విషయం బయటికి రావడంతో గంగాధర్‌రెడ్డి యూటర్న్ తీసుకున్నాడు.
తాను ఆ విధంగా వాంగ్మూలం ఇవ్వలేదని పేర్కొన్నారు. అంతేకాదు. సీబీఐ అధికారులకు తనను బెదిరిస్తున్నారని అనంతపురం ఎస్పీకి గంగాధర్‌రెడ్డి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది.
వివేకా హత్య కేసులో కీలక సాక్షిగా వున్న గంగాధర్‌రెడ్డి బుధవారం రాత్రి అనంతపురం జిల్లా యాడికిలో తన ఇంట్లో పడుకున్న వాడు పడుకున్నట్టే ప్రాణాలు వదలడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇతని స్వస్థలం పులివెందుల. జిల్లా బహిష్కరణకు గురి కావడంతో అనంతపురం జిల్లా యాడికి వెళ్లి స్థిరపడ్డాడు. అనారోగ్యంతో మృతి చెందినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే మృతిపై అనుమానాలు రావడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.