కరోనా కోవిడ్ -19 విరుగుడు వ్యాక్సిన్ కు సంబంధించిన హ్యూమన్ ట్రయల్స్ ఇండియాలో ఊపందుకుంటున్నాయి. ఇప్పటి వరకూ రెండు ఫార్మా కంపెనీలు తయారు చేసిన వ్యాక్సిన్ లకు సంబంధించిన హ్యూమన్ ట్రయల్స్ ప్రారంభం అయ్యాయి. భారత్ బయోటెక్, జైడస్ లు రూపొందించిన వ్యాక్సిన్ లకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాటిని ఆరు కేంద్రాల్లో మనుషులపై ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. పరిమిత సంఖ్యలోనే వ్యక్తులపై వాటిని ప్రయోగించి ఫలితాలను గమనిస్తున్నారు వైద్య నిపుణులు. వారిపై అవి విజయవంతం అని తేలితే మరి కొందరిపై ప్రయోగించే వీలుంటుందని నిపుణులు చెబుతున్నారు.
మరోవైపు ఆక్స్ ఫర్డ్ రూపొందించిన వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ కూడా ఇండియాలో జరగబోతున్నాయి. అందుకు సంబంధించి ఒక ఫార్మా కంపెనీ కేంద్ర ప్రభుత్వానికి అనుమతిని కోరింది. త్వరలోనే అనుమతులు జారీ కానున్నాయని, ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ కూడా ఇండియాలో ప్రారంభం అవుతాయని సమాచారం. ఇప్పటికే బ్రిటన్ లో ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ కు సంబంధించిన హ్యూమన్ ట్రయల్స్ ప్రారంభం అయ్యాయి. తొలి దశలో అవి విజయవంతంగా సాగాయని ఫలితాలను ప్రకటించారు పరిశోధకులు.
ఇండియన్ ఫార్మా కంపెనీలు రూపొందించిన వ్యాక్సిన్ ఫలితాలు కూడా విజయవంతం అయితే.. కరోనా విరుగుడు విషయంలో ఊరట లభిస్తున్నట్టే. హ్యూమన్ ట్రయల్స్ లో అన్ని దశల్లోనూ వ్యాక్సిన్ విజయవంతం అయితే మరి కొన్ని నెలల్లోనే కరోనా నివారణకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అక్టోబర్ కు చాలా వ్యాక్సిన్ ల శక్తి ఎంతో తేలిపోతుందని, అవి విజయవంతం అయితే.. ఈ ఏడాది ఆఖరుకు భారీ ఎత్తున అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందనేది వారి అంచనా.