ఇళ్లు ఇస్తానన్నందుకు, కోవిడ్ పరీక్షలు విస్తృతంగా చేస్తున్నందుకు, బడుగు బలహీన వర్గాలకు ఇంగ్లీష్ విద్య అందిస్తానన్నం దుకు వైఎస్ జగన్ సర్కార్‌కు ప్రతిపక్షాల నుంచి రాళ్ల దెబ్బలు తప్పడం లేదు.
తనది ఎన్నికల సర్కార్ కాదని….ప్రజా సర్కార్ అని, అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఎన్నికల మ్యానిఫెస్టో అమలుపై చిత్తశుద్ధితో ముందుకు వెళుతున్నందుకు జగన్ సర్కార్‌కు రాళ్ల దెబ్బలు. ప్రతిపక్షాలే కాదు…రాజ్యాంగ వ్యవస్థల నుంచి కూడా రాళ్ల దెబ్బలు తప్పడం లేదు.
ఈ సందర్భంగా జీవితానుభవాన్ని కాచి వడబోసిన పెద్దలు చెప్పిన ఓ విషయం గుర్తు చేసుకోవాల్సి ఉంది. అది ‘కాయలు కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు’ అని పెద్దలు ఊరికే చెప్పలేదు. ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా మహమ్మారి దెబ్బకు విలవిలలాడుతోంది. ఈ విపత్తును జగన్ సర్కార్ ఎదుర్కొంటున్న తీరు ఏపీలోని ప్రతిపక్షాలకు తప్ప దేశ వ్యాప్తంగా అందరి ప్రశంసలు అందుకుంటోంది.
కరోనా పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అందుకు తగ్గట్టు మరిన్ని మెరుగైన చర్యలను తీసుకునేందుకు జగన్ సర్కార్ పకడ్బందీ వ్యూహంతో కదులుతోంది. కరోనా వైద్యానికి ఖర్చుకు వెనుకాడడం లేదు. ఒక్కో కరోనా రోగికి దాదాపు రూ 35 వేల వరకు ఖర్చు పెడుతోంది.
రాష్ట్రంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న దృష్ట్యా మరో 54 ఆస్పత్రులను కోవిడ్ బాధితుల కోసం వెంటనే ఏర్పాటు చేసేందుకు జగన్ సర్కార్ నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 84 ఆస్పత్రులున్నాయి. ఇప్పుడు ఏర్పాటు చేయబోయే ఆస్పత్రులతో కలిపి ఆ సంఖ్య 138కి చేరుతుంది.
మరోవైపు కేవలసం ఆస్పత్రులను ఏర్పాటు చేయడమే కాకుండా, రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు వచ్చే ఆరు నెలల కాలానికి పనిచేసే విధంగా పెద్ద ఎత్తున స్పెషలిస్టులు, వైద్యులు, వైద్య సిబ్బంది, శానిటేషన్ సిబ్బందిని నియమించేందుకు సీఎం జగన్ సంబంధితశాఖ అధికారులకు ఆదేశాలిచ్చారు.
కోవిడ్ రోగులకు వైద్యం అందించేందుకు ఆస్పత్రుల పెంపు, మౌలిక సదుపాయాల కల్పన కోసం వచ్చే ఆరు నెలల కాలానికి జగన్ సర్కార్ రూ.1000 కోట్లు ఖర్చు చేసేందుకు నిర్ణయించింది. ఏపీలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు బాగా చేస్తున్నారని తెలంగాణ హైకోర్టు ప్రస్తావించిన విషయాన్ని విస్మరించొద్దు.
ఒకవేళ ఏపీలో కరోనాపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించి ఉంటే…ఇక్కడి ప్రతిపక్షాలు ఈ పాటికి న్యాయస్థానాన్ని తప్పక ఆశ్రయించేవి. కానీ ఆ పనిచేయలేదంటే కరోనా నిర్ధారణతో పాటు రోగులకు మెరుగైన వైద్యం అందిస్తుండడమే కారణం. కేవలం జగన్ సర్కార్‌పై ఏదో ఒక విమర్శ చేయాలనే ఉద్దేశంతో…రాళ్లు వేస్తున్నాయి.
తాజాగా కరోనా నియంత్రణలో జగన్ సర్కార్ చేతులెత్తేసే పరిస్థితి వచ్చిందని జనసేనాని పవన్‌కల్యాణ్ ఆరోపించడం విడ్డూరంగా ఉంది. ఇదే నాయకుడు కొన్ని రోజుల క్రితం కరోనాపై జగన్ సర్కార్ తీసుకుంటున్న చర్యలను ప్రశంసించడాన్ని చూశాం. మరి ఇంతలోనే ఆయన అభిప్రాయం మార్పు ఎందుకొచ్చిందో పవన్‌కల్యాణ్‌కే తెలియాలి.