ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఇప్పుడు కల్వకుంట్ల కవిత పేరు బహిరంగ రహస్యం. ఇన్నాళ్లూ బిజెపి నాయకుల ఆరోపణల్లో మాత్రమే ఉన్న కవిత కు ఇప్పుడు సీబీఐ నోటీసులు కూడా ఇచ్చింది. అరెస్టు చేసిన నిందితుడి రిమాండ్ రిపోర్టులో తన పేరు రావడంతోనే.. దీనిని రాజకీయ కుట్రగా అభివర్ణిస్తూ విరుచుకు పడిన కల్వకుంట్ల కవిత.. సీబీఐ విచారణకు తాను సిద్ధమే అని ప్రకటించారు. వారి నోటీసులకు స్పందించారు. తన సంసిద్ధతను కూడా తెలియజేశారు. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే కల్వకుంట్ల కవిత పాజిటివ్ ఇమేజి సృష్టించుకున్నట్టుగా కనిపిస్తోంది.
తెలంగాణలోని కేసీఆర్ సర్కారు, అన్ని విధాలుగానూ కేంద్రంలోని మోడీ సర్కారుతో ఢీ కొంటోంది. పరస్పర ఆరోపణలు చేసుకోవడం మాత్రమే కాదు, కేసుల జోరు చూస్తే కూడా ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. ఎమ్మెల్యేలకు ఎర అనే కేసులో బిజెపి జుట్టు కేసీఆర్ చేతికి చిక్కింది.. అని జనం అనుకుంటున్నారు. అదే సమయంలో ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత ఉన్నారనే మాట బిజెపికి అస్త్రంగా మారింది.
కేసీఆర్ ను, తెరాసను ఇరుకున పెట్టడానికి మద్యం కుంభకోణంలో కవిత పాత్ర ఉన్నదనే ఆరోపణలను చాలాకాలంగా వినిపిస్తున్నారు. తెరాసతో అనుబంధం ఉన్న అనేక మంది ఇతర వ్యక్తులను ఇదివరకే విచారించారు. అయితే కవితకు అధికారికంగా నోటీసులు రాలేదు. ఈలోగా ఎమ్మెల్యేలకు ఎర కేసు తెరపైకి వచ్చింది. ముగ్గురిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న తెలంగాణ పోలీసులు.. భారతీయ జనతా పార్టీలో కింగ్ పిన్ లాంటి తెరవెనుక నాయకుడు బిఎల్ సంతోష్ కు నోటీసులు పంపారు. ఈ పరస్పర కేసుల వ్యవహారాలను ప్రజలు మాత్రం ‘కవిత జోలికి వస్తే’ అని హెచ్చరిస్తున్నట్లుగానే అర్థం చేసుకుంటున్నారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. తెలంగాణ సిట్ పోలీసుల నోటీసులకు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ అసలు స్పందించలేదు. విచారణకు రాలేదు.. నోటీసులను అసలు పట్టించుకోలేదు. కానీ కవిత అలా చేయలేదు. తన పేరు రిమాండ్ రిపోర్టులో ఉన్నదని బయటకు రాగానే.. ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు చేసినప్పటికీ.. సీబీఐ నోటీసులు ఇవ్వగానే స్పందించారు. ఈనెల ఆరోతేదీన విచారిస్తామని హైదరాబాదు లేదా ఢిల్లీలో ఎక్కడ అందుబాటులో ఉంటారో చెప్పాలని సీబీఐ నోటీసులు ఇవ్వడంతో.. హైదరాబాదులోని తన ఇంట్లో విచారించవచ్చునని కవిత స్పందించడం విశేషం.
హైదరాబాదులో కవిత ఇంట్లో ఆమెను సీబీఐ విచారించడం అంటే.. ఆరోజున చాలా పెద్ద పొలిటికల్ మైలేజీ హైడ్రామా ఉంటుందని అనుకోవచ్చు. కవితను విచారించే సీబీఐ తర్వాతి స్టెప్ ఎలా ఉంటుందో గానీ.. ఆమె ఇంట్లో ప్రెస్ మీట్ పెడితేనే వందల సంఖ్యలో అక్కడకు తరలివచ్చి హడావుడి చేసే గులాబీ దళాలు.. ఆమెను విచారించడానికి సీబీఐ అక్కడకు వచ్చే సందర్భంలో వేలసంఖ్యలో గుమికూడి.. హైప్ క్రియేట్ చేసే అవకాశం చాలా ఉంది.