ఒక వయసు వచ్చిన తర్వాత.. వయసుకు తగిన ఆటలే ఆడాలి. ఎంతకాలమూ నేనింకా కుర్రోడిని, కుర్రతనంలో వేసిన వేషాలన్నీ వేస్తా అంటే నడుస్తుందా.. నడవదు! ఇదే మాటతో ఇప్పుడు సోషల్ మీడియా చంద్రబాబునాయుడు మీద రెచ్చిపోతోంది. చంద్రబాబునాయుడు తన ముసలితనానికి తగినట్టుగా ఉండకపోతే నడుం నొప్పి కాకుండా ఇంకేం వస్తుందని.. జనం జోకులు పేలుస్తున్నారు. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. జనం ఇలా తనను ముసలితనం పేరుతో ట్రోల్ చేయడానికి అవకాశాన్ని స్వయంగా చంద్రబాబునాయుడే ఇవ్వడం విశేషం.
ఎలాగైనా ఈ ఎన్నికల్లో జగన్ ను ఓడించి అధికారంలోకి రావాలని చంద్రబాబునాయుడు పాటుపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ అనే పేరుతో ఆయన ప్రస్తుతం ఊరూ వాడా తిరుగుతున్నారు. జగన్ రాష్ట్రాన్ని ముంచేస్తున్నారని.. తనకు తోచిన మాటలన్నీ చెబుతున్నారు.
తనకు వయసు అయిపోయిందని, మళ్లీ ఎన్నికల నాటికి తాను రాజకీయాల్లో ఉంటానో లేదో అని.. తనకు ఇది చివరి చాన్స్ అని, ప్రజలు తనను ముఖ్యమంత్రిని చేయాలని ఆయన బతిమాలుతున్నారు. ఇలాంటి ప్రయత్నం వల్ల కూడా ప్రజల్లో నవ్వులపాలు అవుతున్నారే తప్ప మరో ప్రయోజనం సాధించడం లేదు. అయితే ఇదే సమయంలో.. చంద్రబాబు జనం నవ్వుకోడానికి, సోషల్ మీడియాలో తనను ట్రోలింగ్ చేయడానికి మరో అవకాశం ఇచ్చారు.
తాడేపల్లి గూడెంలో చంద్రబాబు సభ నిర్వహించారు. అక్కడ మాట్లాడుతూ.. రోడ్లు సరిగా ఉండడం లేదనే అంశాన్ని ఆయన ప్రస్తావించారు. తన మార్కు సెటైర్ జోడించే ప్రయత్నంలో భాగంగా.. జగన్ కొత్త పథకం తెస్తాడు దానికి ‘ఉయ్యాల బాట.. గుంతలే గుంతలు’ అని పేరు పెడతారు అంటూ ఎద్దేవా చేశారు. అంతవరకు ఊరుకున్నా కూడా ఏదో పరువుగా ఉండేది. అయితే చంద్రబాబునాయుడు మాత్రం.. ‘ఈ రోడ్లలో ప్రయాణిస్తోంటే నాకు నడుం నొప్పి వస్తోంది. మరో నాలుగు రోజులు తిరిగితే ఈ జిల్లాలోనే ఏదో ఒక ఆస్పత్రిలో చేరాల్సి వస్తుంది’ అని కూడా అన్నారు.
సరిగ్గా ఈ మాటనే పట్టుకుని జనం ట్రోలింగ్ చేస్తున్నారు. ముసలితనంలో నడుం నొప్పి రాకుండా ఇంకే వస్తుంది బాబుగారూ అని ఎద్దేవా చేస్తున్నారు. ‘ఎన్నికలు ఇంకా ఏడాదిన్నర దూరంలో ఉండగా ఇప్పుడే నడుం నొప్పి వస్తే.. అప్పటికింకా ఏం నొప్పలు వస్తాయో’ అని కొందరు.. ‘నడుం నొప్పి వచ్చిన తరవాత సీఎంగా ఏం చేస్తారుగానీ ఇంట్లో కూర్చోండి’ అని కొందరు రకరకాలుగా ఎద్దేవా చేస్తున్నారు.
72 ఏళ్ల వయసు వచ్చాక కృష్ణా రామా అంటూ మనవడితో ఆడుకుంటూ ఇంట్లో కూర్చోకుండా ఈ అధికారం పిచ్చి పదవీలాలసత ఏంటంటూ.. దెప్పి పొడుస్తున్నారు. మొత్తానికి చంద్రబాబు తన మాటలతో తన మీద ట్రోలింగ్ కు తానే అవకాశం ఇస్తున్నారు.