గల్లాకు కూడా నమ్మకం కలిగించలేని చంద్రబాబు!

ఒకవైపు చంద్రబాబు.. నా జీవితానికి ఇది చివరిచాన్స్, నన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయండి అంటూ చంద్రబాబునాయుడు ప్రజల ఎదుట దేబిరిస్తూ రాష్ట్రమంతా తిరుగుతున్నారు. మరోవైపు జగన్ ఈసారి ఎన్నికల్లో ఎలా గెలుస్తాడో చూస్తా.. అంటూ…

ఒకవైపు చంద్రబాబు.. నా జీవితానికి ఇది చివరిచాన్స్, నన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయండి అంటూ చంద్రబాబునాయుడు ప్రజల ఎదుట దేబిరిస్తూ రాష్ట్రమంతా తిరుగుతున్నారు. మరోవైపు జగన్ ఈసారి ఎన్నికల్లో ఎలా గెలుస్తాడో చూస్తా.. అంటూ ఆయన దత్తపుత్రుడు సవాళ్లు విసురుతున్నారు. మరోవైపు జగన్ పతనం ఖాయం.. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయం అంటూ పచ్చశ్రేణులన్నీ బాకా ఊదుతున్నాయి. 

మరి ఇంత హడావుడి జరుగుతుండగా.. మరో ఏడాదిన్నర వ్యవధిలో మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడుతుందనే నమ్మకం ఉన్నప్పుడు.. వాళ్ల సొంత పార్టీ ఎంపీ తన వ్యాపారాన్ని ఏపీ నుంచి ఎందుకు తెలంగాణకు తరలించుకుపోతున్నట్టు? అనే ప్రశ్న సామాన్యుడికి కలుగుతోంది.

తెలుగుదేశానికి చెందిన గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, అమరరాజా బ్యాటరీస్ సంస్థకు సారధి. ఆయన తండ్రి రామచంద్రనాయుడు స్థాపించిన వ్యాపార సామ్రాజ్యానికి వారసుడు. చిత్తూరు జిల్లాలను పారిశ్రామికీకరిస్తున్నాం అనే ముసుగులో రాజకీయ దన్ను వాడుకుంటూ అనేకానేక రీతుల్లో నిబంధనలను అతిక్రమించడంలో అమరరాజా సంస్థ ది అందె వేసిన చేయి. కొత్త పరిశ్రమలు పెడుతున్నాం.. వందల వేల మందికి ఉపాధి ఇస్తాం అనే మాటలు చెబుతూ దందా నడిపిస్తుంటారు. 

అయితే రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. వారి పప్పులు ఉడకలేదు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉండగా.. .జిల్లాలో పరిశ్రమలు పెడతాం అంటే.. ఆయన నమ్మి 483 ఎకరాల భూములు ఇచ్చారు. ఏళ్లూ పూళ్లూ గడుస్తున్నా భూముల్ని సంపదగా అనుభవిస్తున్నారే తప్ప.. పరిశ్రమలు రాలేదు. జగన్ సర్కారు వచ్చాక.. ప్రభుత్వంనుంచి భూములు తీసుకుని అభివృద్ధి చేయకుండా, చెప్పిన ప్లాంట్లు పెట్టకుండా నాటకాలు ఆడుతున్న బూటకపు పారిశ్రామికవేత్తలనుంచి స్థలాలు వెనక్కు తీసుకున్నారు. అమరరాజానుంచి కూడా 253 ఎకరాలను వెనక్కు తీసుకుంటే వారు కోర్టు కేసు నడిపిస్తున్నారు. 

ఈలోగా.. అమరరాజా బ్యాటరీస్ పై కాలుష్య నియంత్రణ మండలి దాడులు నిర్వహించింది. పరిమితికి మించిన కాలుష్యం వస్తున్నట్టుగా తేల్చింది. ఉద్యోగుల రక్తం కూడా కలుషితం అవుతున్నట్టు పొల్యూషన్ బోర్డు గుర్తించింది. యథేచ్ఛగా కాలుష్య నియంత్రణ పద్ధతులు పాటించకుండా ఉద్యోగుల జీవితాలతో కూడా ఆడుకుంటూ ఉంటే, వాటిని పొల్యూషన్ బోర్డు తేల్చడమే తప్పు, వేధింపు అన్నట్టుగా పచ్చమీడియా కూస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ లిథియం అయాన్ బ్యాటరీస్ ఫ్యాక్టరీ యూనిట్ ను తెలంగాణకు తీసుకువెళ్లారనేది వారి ఏడుపు.

అయితే ఇక్కడ జనానికి కలుగుతున్న సందేహం ఏంటంటే.. 2024లో తెలుగుదేశం గెలుస్తుందనే నమ్మకం ఏ కొంచెం ఉన్నా సరే.. గల్లా జయదేవ్ అప్పటిదాకా వేచిచూడవచ్చు కద. అంటే.. చంద్రబాబు మళ్లీ సీఎం అవుతారనే నమ్మకం.. ఆయన పార్టీ వారికే లేదు. పైకి ఎన్ని మాటలు చెప్పినాసరే.. ఆచరణకు వచ్చేసరికి ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. 

జగన్ పతనం తప్పదు అని జనాన్ని చంద్రబాబు మభ్యపెట్టగలరు తప్ప.. తన సొంత పార్టీ వారిని కూడా నమ్మించలేకపోతున్నారనేది తేలిపోతోంది. పాపం మళ్లీ అధికారం దక్కించుకోవడానికి ఈ ముదిమి వయసులో అనవసర ప్రయాస పడుతున్నారని కూడా అనిపిస్తోంది.