అప్పుడప్పుడూ ఇలాంటి కామెడీ ఉండాల్సిందే..

రాజకీయాల్లో అప్పుడప్పుడూ కామెడీ పాళ్లు కొంత తగ్గితే కొందరు వ్యక్తులు రంగప్రవేశం చేస్తుంటారు. ప్రెస్ మీట్ పెట్టడం గానీ, కార్యక్రమం నిర్వహించడం గానీ చేసి.. ఆ లోటును భర్తీచేసి వెళ్తారు. వారి మాటల్లో తెలివితేటలు…

రాజకీయాల్లో అప్పుడప్పుడూ కామెడీ పాళ్లు కొంత తగ్గితే కొందరు వ్యక్తులు రంగప్రవేశం చేస్తుంటారు. ప్రెస్ మీట్ పెట్టడం గానీ, కార్యక్రమం నిర్వహించడం గానీ చేసి.. ఆ లోటును భర్తీచేసి వెళ్తారు. వారి మాటల్లో తెలివితేటలు మాత్రమే ఉంటాయి. లాజిక్ ఉండదు. చిత్తశుద్ధి ఉండదు. వాస్తవానికి దగ్గరగానూ ఉండవు. ప్రజలు నవ్వుకోవడానికి పనికి వస్తాయి. కానీ.. కొంచెం ఆలోచన పరులు అయితే.. ఆగ్రహించడానికి అసహ్యించుకోవడానికి దారితీస్తాయి. తాజాగా బిజెపి నాయకుడు జివిఎల్ నరసింహారావు ఇలాంటి ప్రెస్ మీట్ ఒకటి నిర్వహించారు. 

రాజకీయంగా ప్రజల్లో తమకు ఏమీ బలం లేకపోయినా.. అప్పుడప్పుడూ మీడియాలో కనిపించడం ద్వారా.. అస్తిత్వాన్ని నిరూపించుకుంటూ ఉండే అనేకానేక మంది కాగితం పులుల్లో జీవీఎల్ కూడా ఒకరు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యం కావడానికి పూర్తి బాధ్యత వైసీపీ ప్రభుత్వానిదే అని ఆయన ఇప్పుడు నిందిస్తున్నారు.

పోలవరం ప్రాజెక్టు మాదంటే మాదని తెలుగుదేశం, వైసీపీ రెండు పార్టీలూ ప్రగల్భాలు పలుకుతున్నాయని జీవీఎల్ అంటున్నారు. ఆ రెండు పార్టీలు కాకుండా పోలవరం మీద హక్కును ఎవరు క్లెయిం చేసుకోవాలి? వైఎస్ రాజశేఖరరెడ్డి పూనికతో మాత్రమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం అడుగులు పడ్డాయి. విభజన సందర్భంగా దానిని జాతీయ ప్రాజెక్టుగా పూర్తిగా కేంద్రమే నిర్మిస్తుందనే మాట వచ్చిన తర్వాత.. తొలి ప్రభుత్వ సారధిగా చంద్రబాబునాయుడు పోలవరం విషయంలో చాలా హడావుడి చేశారు. తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి.. పారదర్శకంగా ఎలాంటి అవినీతికి, లొసుగులకు తావు లేకుండా పోలవరం పూర్తి చేయాలనే ఉద్దేశంతో రివర్స్ టెండరింగ్ ద్వారా పనులు అప్పగించి.. త్వరితగతిన చేయిస్తున్నారు. 

పోలవరం ప్రాజెక్టు ఆలస్యం కావడం అనే పాపానికి సంబంధించి ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేయకుండా నాటకాలు ఆడుతూ.. బడ్జెట్ కేటాయింపుల్లో ముష్టి విదిలించినట్టుగా నిధులు ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ను వంచిస్తున్న కేంద్రప్రభుత్వానిదే ప్రధాన బాధ్యత.

రాష్ట్రం ఖర్చు చేసిన డబ్బులు ఏనాడూ వెంటనే విడుదల చేయకుండా.. కేంద్రం చేస్తున్న జాప్యం వల్లనే పోలవరం వెనక్కు వెనక్కు వెళుతోంది. ఆ విషయంలో బడ్జెట్ వచ్చే రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టే దమ్ములేని కమల మేధావులు.. ఆ తర్వాత ఎన్నటికో ప్రజల ముందుకు వచ్చి పోలవరం మాది అంటుంటారు. పోలవరం మీదే.. అది జాతీయ ప్రాజెక్టే.. ఎప్పటికి పూర్తి చేస్తారో చెప్పండి. నిర్వాసితులందరికీ పరిహారాలు చెల్లించి సెటిల్ చేయండి.. అంటే ఎక్కడివారక్కడ జారుకుంటారు. 

ఇలాంటి మాయమాటల కమలదళం.. ఇప్పుడు బాధ్యత మొత్తం వైసీపీదే అంటూ తప్పించుకోవాలని చూస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కశాతం ఓటు బ్యాంకుకు దిక్కులేని ఈ పార్టీ భవిష్యత్తులో వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని అనుకుంటోందట. తెలుగు ప్రజల అమాయకత్వం మీద కమలానికి బాగానే నమ్మకం ఉన్నట్టుంది.