యువ హీరో అక్కినేని నాగచైతన్య, స్టార్ హీరోయిన్ సమంత జంట విడాకులపై క్లారిటీ వచ్చేసింది. దీంతో ఇంత కాలం ఆ సెలబ్రిటీ జంటపై సాగుతున్న ప్రచారమే నిజమని, నిన్న స్వయంగా వారే సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం విశేషం. తాజాగా మరో జంట కూడా వారి బాటలోనే నడుస్తోందని విస్తృతమైన చర్చ జరుగుతోంది. అయితే అది పొలిటికల్ జంట కావడం విశేషం.
ఆ జంటే జనసేన, బీజేపీ. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలతో సంబంధం లేకుండా జనసేన, బీజేపీ పొత్తు కుదుర్చుకున్నాయి. ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో పవన్‌కల్యాణ్ చర్చించిన తర్వాత, ఏపీలో 2024 అధికారమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో కలిసి ముందుకు సాగాలని ఇరు పార్టీల రాష్ట్ర నాయకులు ఓ ఒప్పందం చేసుకున్నారు. కానీ ఇంత వరకూ ఏ ఒక్క కార్యక్రమాన్ని జనసేన, బీజేపీ కలిసి చేసిన దాఖలాలు లేవు.
దీంతో బీజేపీతో జనసేనాని తెగదెంపులు చేసుకుంటున్నారనే విస్తృత ప్రచారానికి బలం చేకూర్చే ఘటనలు లేకపోలేదు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగనున్నట్టు ఇటీవల పవన్‌కల్యాణ్ హెచ్చరించారు. అలాగే తాజాగా బద్వేలు ఉప ఎన్నిక బరి నుంచి తప్పుకుంటున్నట్టు జనసేనాని ప్రకటించారు.
ఇటీవల ఉప ఎన్నికలో పోటీపై పవన్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చర్చించారు. ఆ చర్చల్లో ఏం జరిగిందో తెలియదు కానీ, మిత్రపక్షంతో సంబంధం లేకుండా తన పార్టీ వైఖరిని పవన్ వెల్లడించడం బీజేపీకి షాక్ ఇచ్చినట్టైంది.
ఇదే సందర్భంలో బద్వేలు నియోజకవర్గ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఇవాళ కడపలో తేల్చి చెప్పారు. రాజకీయాల్లో కుటుంబ వారసత్వాన్ని తమ పార్టీ ప్రోత్సహించదని ఆయన తెలిపారు.
బద్వేలు ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలని వీర్రాజు పిలుపునివ్వడం గమనార్హం. కానీ జనసేన ప్రస్తావన తీసుకురాకపోవడంపై రకరకాల చర్చకు దారి తీసింది.
దీంతో జనసేన-బీజేపీ కలిసి కొనసాగడంపై సందిగ్ధ నెలకుంది. ఈ రెండు పార్టీల మైత్రిని సమంత-చైతన్య జంటతో పోల్చడం విశేషం. సినీ సెలబ్రిటీ జంటలాగే త్వరలో జనసేన-బీజేపీ జంట కూడా తమ విడాకుల విషయమై స్పష్టత ఇవ్వనున్నారనే వ్యంగ్య కామెంట్స్ సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.
బహుశా పవన్‌కల్యాణ్ విడిపోయినా మనసు చంపుకోనిది కేవలం చంద్రబాబు మీద మాత్రమేనేమో అని సెటైర్స్ విసురుతున్నారు.