'మా' ఎన్నికలు టాలీవుడ్‌లో నటుల మధ్య చిచ్చు పెడుతున్నాయి. అసలే నటీనటుల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న సంబంధాలపై మీడియా ఆజ్యం పోస్తోందనే అభిప్రాయం టాలీవుడ్ పెద్దల్లో వుంది. ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు ప్యానళ్ల మధ్య నువ్వానేనా అన్నట్టు బిగ్ ఫైట్ జరుగుతోంది. గెలుపు కోసం ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో నామినేషన్ వేసిన అనంతరం ప్రకాశ్‌రాజ్‌పై మంచు విష్ణు ఘాటు కామెంట్ చేశారు. దీనికి మంచు విష్ణుపై ప్రకాశ్‌రాజ్ అంతేస్థాయిలో కౌంటర్ ఇవ్వడం మరింత గ్యాప్‌ను పెంచినట్టైంది. దీనిపై తాజాగా ఓ చానల్‌తో ప్రకాశ్‌రాజ్ మాట్లాడుతూ వాతావరణాన్ని చల్లబరిచే ప్రయత్నం చేశారు.
ఇటీవల 'రిపబ్లిక్' చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించాలనే నిర్ణయంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి జగన్‌తో పాటు మంత్రులపై యథేచ్ఛగా పవన్ నోరు పారేసుకున్నారు.
పవన్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, చిత్రపరిశ్రమతో సంబంధం లేదని ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ స్పష్టం చేసింది. ఇదే అంశంపై మంచు విష్ణు స్పందిస్తూ…. 'ప్రకాశ్‌రాజ్ ఇండస్ట్రీ పక్కనున్నాడా..లేక పవన్ కల్యాణ్ పక్కనున్నాడా' అని నిలదీశారు.
ఇదే అంశంపై ప్రకాశ్‌రాజ్ తనదైన స్టైల్‌లో మంచు విష్ణుకు సమాధానం ఇస్తూ… 'పవన్ కల్యాణ్ మార్నిగ్ షో కలెక్షన్స్ అంత ఉండవు మీ సినిమా బడ్జెట్' అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇలా మాట్లాడ్డంపై ప్రకాశ్‌రాజ్ మరోసారి మీడియాకు వివరణ ఇచ్చారు.
'మోహన్ బాబు బంగారం. ఆయన కొడుకులు విష్ణు, మనోజ్, కూతురు లక్ష్మీ అంటే కూడా నాకు చాలా ఇష్టం. గతంలో లక్ష్మీ చేసిన రెండు కార్యక్రమాలకు కూడా నేను వెళ్లాను. వ్యక్తిగతంగా వారంటే చాలా గౌరవం, అభిమానం అని అన్నారు. కానీ మంచు ఓ విలేఖరి అడిగిన ప్రశ్న వేరైనా తను ప్రకాశ్ రాజ్ ఇండస్ట్రీ పక్కనున్నాడా..లేక పవన్ కల్యాణ్ పక్కనున్నాడా అనడం కొద్దిగా బాధ కలిగించింది. అందుకే అలా మాట్లాడానే తప్ప వ్యక్తిగతంగా వేరే కారణాలు ఏవీ లేవు'. అని ప్రకాశ్ రాజ్ తెలిపారు.
దీంతో ఈ వివాదానికి ఇప్పటికైనా తెరపడుతుందా? లేక మంచు విష్ణు వైపు నుంచి ఘాటైన రియాక్షన్ ఉంటుందా? అనేది తేలాల్సి వుంది.