సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి సంబంధించి కంగనాను కూడా ప్రశ్నించాలని నిర్ణయించారు ముంబయి పోలీసులు. ఈ మేరకు ముంబయిలోని ఆమె నివాసానికి నోటీసులు పంపించారు. అయితే అక్కడ కంగనా లేదు. దీంతో కంగనా పోలీసుల విచారణ నుంచి తప్పించుకుందంటూ ఓ సెక్షన్ మీడియా కథనాలిచ్చింది.
ఈ మొత్తం వ్యవహారంపై కంగనా లాయర్ స్పందించాడు. లాక్ డౌన్ మొదలైనప్పట్నుంచి కంగన ముంబయిలో లేదని, తన కుటుంబ సభ్యులతో కలిసి మనాలీలో ఉందని తెలిపిన లాయర్.. పోలీసులకు పూర్తిగా సహకరించడానికి కంగనా సిద్ధంగా ఉందని, కానీ ముంబయి రావడానికి మాత్రం అమె సుముఖంగా లేదని స్పష్టంచేశాడు.
వీలైతే ఓ టీమ్ ను మనాలీ పంపాల్సిందింగా కంగన తరఫు లాయర్ పోలీసుల్ని అభ్యర్థించాడు. అలా కుదరని పక్షంలో లైవ్ ఛాటింగ్, వెబ్ మీడియా ద్వారానైనా కంగనాను పోలీసులు ప్రశ్నించొచ్చని కోరాడు. దీనిపై ముంబయి పోలీసులు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
సుశాంత్ మరణించిన రెండో రోజు నుంచి కంగనా తన స్వరం వినిపిస్తూనే ఉంది. బాలీవుడ్ లో పాతుకుపోయిన ఓ గ్రూప్ వల్లనే సుశాంత్ మరణించాడని ఆమె ఆరోపిస్తోంది. బాలీవుడ్ లో కొంతమంది సిండికేట్ అయిన సుశాంత్ ను చంపేశారని విమర్శించిన కంగన.. కరణ్ జోహార్, ఆదిత్య చోప్రాలే సుశాంత్ కెరీర్ ను పనిగట్టుకొని నాశనం చేశారని ఆరోపించింది. ఇప్పుడీమె ఆరోపణలు, వాదనలన్నీ పోలీస్ రికార్డుల్లోకి కూడా ఎక్కబోతున్నాయి.