పవన్ కల్యాణ్ కి తెలిసి మాట్లాడతారో లేక నిజంగానే తెలియక అమాయకంగా అడుగుతుంటారో తెలియదు కానీ.. ఆయన నోటి వెంట ఎప్పుడూ ఆణిముత్యాలే జాలువారుతుంటాయి. తాజాగా పార్ట్-2 ఇంటర్వ్యూతో వచ్చిన పవన్ కల్యాణ్ ఇంటర్వ్యూ పార్ట్-1 వందరెట్లు మేలు అని నిరూపించారు. తలతిక్క ప్రశ్నలు, అంతే తలతిక్క సమాధానాలు రెండో పార్ట్ లో జనసైనికుల్ని హింసించాయి.
ఇంటర్వ్యూకి ఫినిషింగ్ టచ్ విన్నారంటే అందరికీ తిక్క తలకెక్కడం మాత్రం ఖాయం. కాపు రిజర్వేషన్లపై మీరేమంటారని పవన్ కల్యాణ్ ని సదరు “జనసేన జర్నలిస్ట్” ప్రశ్నిచండంతో ఆయన వైపు నుంచి విలువైన సమాధానం బైటకొచ్చింది.
ఎన్నికల ప్రచారంలో జగన్ కాపులకు రిజర్వేషన్లు ఇవ్వనని చెప్పారని, అయితే ప్రజలు మాత్రం జగన్ కే ఓట్లు వేసి గెలిపించారని, తిరిగి ఇప్పుడు జగన్ మళ్లీ కాపులకు క్లారిటీ ఇవ్వాలని పవన్ డిమాండ్ చేశారు. ఒకసారి చెప్పిన దాన్ని మళ్లీ ఇప్పుడు జగన్ ఎందుకు చెప్పాలి? ఎవరికి చెప్పాలి? పోనీ చెబితే ఏమైనా జరుగుతుందా? లేక ఈలోపు జగన్ మనసు ఏమైనా మార్చుకున్నారని పవన్ భావిస్తున్నారా? అసలింతకీ పవన్ బాధ ఏంటో అర్థం కావడం లేదు.
కాపులకు రిజర్వేషన్లు ఇవ్వబోమని పదే పదే జనాలకి వైసీపీ తరపున జగన్ ఎందుకు చెప్పాలి. పవన్ ఇంటర్వ్యూ మొత్తం చూసిన తర్వాత కాపు రిజర్వేషన్ల అంశమే మంచి కామెడీ పీస్ గా మిగిలింది. దీనిపై ఆల్రెడీ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కూడా ఈ సమాధానాన్ని పూర్తిగా తప్పుబట్టడం విశేషం. ఇదేమైనా భారతమా పదే పదే చెప్పించుకోడానికి అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
మొత్తమ్మీద పవన్ ఇంటర్వ్యూలతో ఒక విషయం మాత్రం అర్థమవుతోంది. కేవలం వైసీపీని టార్గెట్ చేయడం కోసమే పవన్ మరోసారి బైటకొచ్చారు. తన పార్టీ మనిషితో ప్రశ్నలు అడిగించుకుని, తనకి నచ్చిన సమాధానం చెప్పి.. దాన్ని సోషల్ మీడియాలో వదిలారు. అసలు పవన్ ఈ ఇంటర్వ్యూ ఇవ్వకుండా ఉంటే బాగుండేదేమో.