చైతూ మాజీ భార్యను ఇండస్ట్రీ పట్టించుకుంటుందా?

తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడిదే హాట్ టాపిక్. వాళ్లిద్దరూ విడిపోయారు సరే, అది వాళ్ల వ్యక్తిగతం అనుకోవచ్చు. మరి సమంత కెరీర్ పరిస్థితేంటి? నాగచైతన్య మాజీ భార్య అనే ట్యాగ్ లైన్ తో ఆమె…

తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడిదే హాట్ టాపిక్. వాళ్లిద్దరూ విడిపోయారు సరే, అది వాళ్ల వ్యక్తిగతం అనుకోవచ్చు. మరి సమంత కెరీర్ పరిస్థితేంటి? నాగచైతన్య మాజీ భార్య అనే ట్యాగ్ లైన్ తో ఆమె ఇండస్ట్రీలో ఎంత కాలం కొనసాగగలదు? ఆమెకు టాలెంట్ ఉన్నప్పటికీ, రాబోయే రోజుల్లో మహేష్, రామ్ చరణ్, ప్రభాస్ లాంటి స్టార్లు సమంతకు అవకాశాలివ్వగలరా? ఆమెను నాగచైతన్య మాజీ భార్యగా కాకుండా ఓ గ్లామరస్ నటిగా చూడగలరా?

సమంతకు ఇప్పటికే అవకాశాలు తగ్గిపోయాయి? ఈ నేపథ్యంలో ఆమె హైదరాబాద్ లోనే ఉంటానని ప్రకటించుకున్నప్పటికీ, మునుపటిలా ఆమెకు అవకాశాలొస్తాయా అనేది చాలామంది అనుమానం.

కెరీర్ కోసమే ఫ్యామిలీ లైఫ్ పణంగా..?

చైతన్య, సమంత మధ్య విడాకులకు కారణాలు చాలానే ఉండొచ్చు కానీ, వాటిలో కచ్చితంగా సమంత సినిమా కెరీర్ అనేది మేజర్ రోల్ పోషించి ఉంటుందనే అనుమానాలున్నాయి. చైతూతో పెళ్లి తర్వాత సమంత తనకు తానే అవకాశాలు తగ్గించుకుంది. 

గ్లామరస్ రోల్స్ తగ్గించి, పెర్ఫామెన్స్ స్కోప్ ఉన్న సినిమాలనే సమంత ఎంచుకుంది. ఆ తర్వాత ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో ఒక్కసారిగా సమంత మళ్లీ తన స్టామినా చూపించింది. బోల్డ్ గా రెచ్చిపోయింది. ఆలుమగలు మధ్య బంధం బీటలువారడానికి ఇది కూడా ఓ కారణం అంటున్నారు చాలామంది.

అయితే కేవలం కెరీర్ కోసం బంగారం లాంటి జీవితాన్ని నాశనం చేసుకునేంత తెలివితక్కువ పిల్ల కాదు సమంత. ఆమె చాలా షార్ప్ అనే విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి సినీ కెరీర్ ను, ఆమె విడాకుల వ్యవహారాన్ని కలిపి చూడలేం. సెపరేషన్ లో అదొక ఎలిమెంట్ మాత్రమే కావొచ్చు.

మరి సమంత కెరీర్ ఎలా ఉండబోతోంది..?

ఈ సంగతి పక్కనపెడితే.. విడాకుల తర్వాత టాలీవుడ్ లో సమంత కెరీర్ ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది. చైతన్య, సమంత ఇద్దరి కెరీర్ పోల్చి చూస్తే.. సమంతే ఒక మెట్టు పైన ఉంది. కానీ విడాకుల తర్వాత సమంతకు అలాంటి స్కోప్ ఉంటుందా అనేది అనుమానమే. కోలీవుడ్, బాలీవుడ్ లో సమంతకు పెద్ద ఇబ్బందేమీ ఉండదు. బాలీవుడ్ లో అసలిలాంటి వ్యవహారాలు మామూలే కాబట్టి, సమంతకు అవకాశాలు వచ్చినా రావొచ్చు.

కానీ టాలీవుడ్ లో మాత్రం సమంత కెరీర్ పై చాలా అనుమానాలు పొడసూపుతున్నాయి. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత ఎంతమంది స్టార్ హీరోలు ఆమెను పిలిచి అవకాశం ఇస్తారనేది మిలియన్ డాలర్ ప్రశ్న.

సినిమా వాళ్ల మధ్య ఉండే మొహమాటాలు, అక్కినేని ఫ్యామిలీతో ఉండే అవసరాలతో సమంతకు అవకాశాలివ్వడానికి ఎంతమంది హీరోలు, దర్శకులు, నిర్మాతలు ముందుకొస్తారనేది అనుమానమే. మహేష్, అల్లు అర్జున్ లాంటి హీరోలకు సమంత అంటే ప్రొఫెషనల్ గా చాలా ఇష్టం ఉండొచ్చు. 

ఆమె పక్కనుంటే సీన్ బాగా పండుతుందనే నమ్మకం ఉండొచ్చు. ఫలానా పాత్రకు సమంత అయితే సూపర్ అనే ఆలోచన రావడం కూడా సహజమే. కానీ అదే సమయంలో ఈ విడాకుల వ్యవహారం, అక్కినేని కాంపౌండ్ తో సంబంధబాంధవ్యాలు తెలుగులో ఆమె కెరీర్ కు ప్రతిబంధకంగా మారొచ్చు. వీటిని దాటుకొని, సమంత తిరిగి తన పూర్వ వైభవాన్ని ఎలా అందుకుంటుందో చూడాలి.