అదొక పెద్ద క్రూయిజ్ షిప్.. అందులో పెద్ద మ్యూజిక్ పార్టీ.. ఫ్యాషన్ టీవీ సంయుక్తంతో నమస్కారీ ఎక్స్ పీరియన్స్ అనే సంస్థ అందులో ఆ మ్యూజిక్ పార్టీని ఎరేంజ్ చేసింది. అయితే అదంతా పైకి చెప్పుకోవడానికి మాత్రమే. షిప్ లోపల జరిగింది మాత్రం ఓ రేవ్ పార్టీ. ఆ పార్టీలో డ్రగ్స్ వాడకం. ఇదొక ట్విస్ట్ అయితే.. ఈ ఎపిసోడ్ లో ఏకంగా ఓ బాలీవుడ్ సూపర్ స్టార్ కొడుకు అడ్డంగా దొరకడం మరో పెద్ద ట్విస్ట్.
ముంబయి సాగరతీరంలో వీకెండ్స్ లో క్రూయిజ్ ట్రిప్స్ సహజం. కాస్త డబ్బులు పెట్టగలిగితే పెద్ద షిప్ లో నడిసంద్రంలోకి వెళ్లి 2 రోజుల పాటు సరదాగా గడిపి రావొచ్చు. కార్డెలియా-ది ఎంప్రెస్ అనే షిప్ ను లాంఛ్ చేసి 2 వారాలే అయింది. ఆ లగ్జరీ క్రూయిజ్ షిప్ లో బాలీవుడ్ స్టార్ కొడుకు అడ్డంగా దొరికిపోయాడు.
నిన్న, ఈరోజు, రేపు జరిగే ఈ క్రూయిజ్ విహారయాత్రలో రేవ్ పార్టీ జరగబోతోందనే విషయంపై మాదకద్రవ్యాల నిరోధక శాఖ (ఎన్సీబీ)కి పక్కా సమాచారం అందింది. దీంతో కొంతమంది ఎన్సీబీ అధికారులు సాధారణ పర్యాటకుల్లా షిప్ లోకి ఎంటరయ్యారు. ముంబయి తీరం నుంచి సముద్రంలోకి 15 కిలోమీటర్ల దూరంలోకి షిప్ ప్రవేశించిన వెంటనే రేవ్ పార్టీ మొదలైంది. ఈ విషయాన్ని గ్రహించిన ఎన్సీబీ అధికారులు వెంటనే ఆ పార్టీని ఆపేశారు.
పార్టీలో నిషిద్ధ మాదకద్రవ్యాలు వాడుతూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు కొంతమంది యువకులు. వీటిలో ఎండీ, కొకైన్ లాంటి మత్తు పదార్థాలు ఉన్నాయి. దీనికి సంబంధించి 8 మందిని అరెస్ట్ చేశారు. దాదాపు 40 గదుల్ని సోదా చేశారు. వాళ్లందర్నీ అరెస్ట్ చేసి ఒడ్డుకు తీసుకొచ్చేంతవరకు అందులో బాలీవుడ్ స్టార్ కొడుకు ఉన్నాడనే విషయాన్ని ఎన్సీబీ అధికారులు గుర్తించలేకపోయారు. ఎప్పుడైతే ఆఘమేఘాల మీద లాయర్ ఆనందిని ఫెర్నాండెజ్ ఎన్సీబీ ఆఫీస్ కు వచ్చారో అప్పుడు అసలు విషయం అర్థమైంది.
అరెస్టైన గంటల వ్యవథిలో ఇద్దరు కుర్రాళ్లకు బెయిల్ మంజూరు అవ్వడం, వాళ్లు ఇంటికి వెళ్లిపోవడం చకచకా జరిగిపోయాయి. అలా ఎన్సీబీ ఆఫీస్ నుంచి బయటపడిన కుర్రాళ్లలో ఒకడు బాలీవుడ్ స్టార్ హీరో కొడుకు అనే విషయం బయటకు పొక్కింది. అతడు షారూక్ కొడుకంటూ కొందరు, సైఫ్ అలీఖాన్ కొడుకని మరికొందరు సోషల్ మీడియాలో వాదించుకుంటున్నారు. ఎన్సీబీ అధికారులు మాత్రం ఈ విషయంపై నోరు విప్పడం లేదు.