తెర‌పైకి ద‌త్త పుత్రిక‌

రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయాల‌పై అవ‌గాహ‌న వున్న వారికి ద‌త్త‌పుత్రుడు అనే ప‌దం సుప‌రిచితం. రాజ‌కీయ ద‌త్త పుత్రుడెవ‌రో జ‌నానికి బాగా తెలుసు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప‌దేప‌దే బాబు ద‌త్త పుత్రుడ‌ని…

రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయాల‌పై అవ‌గాహ‌న వున్న వారికి ద‌త్త‌పుత్రుడు అనే ప‌దం సుప‌రిచితం. రాజ‌కీయ ద‌త్త పుత్రుడెవ‌రో జ‌నానికి బాగా తెలుసు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప‌దేప‌దే బాబు ద‌త్త పుత్రుడ‌ని విమ‌ర్శిస్తున్న సంగ‌తి తెలిసిందే. ద‌త్త పుత్ర బిరుదాంకితుడు జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌. జ‌న‌సేనాని అని సొంత వాళ్లు పిలిస్తే… ద‌త్త పుత్రుడ‌ని ప్ర‌త్య‌ర్థులు ముద్దుగా పిలుస్తుంటారు.

తాజాగా తెలంగాణ రాజ‌కీయ తెర‌పైకి ద‌త్త పుత్రిక వ‌చ్చింది. బీజేపీ ద‌త్త పుత్రిక‌గా ష‌ర్మిల‌కు టీఆర్ఎస్ నేత‌లు ముద్దు పేరు పెట్ట‌డం గ‌మ‌నార్హం. బీజేపీ ద‌త్త పుత్రిక ష‌ర్మిల అని మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డి, బీజేపీ వ‌దిలిన బాణం అని మంత్రి హ‌రీష్‌రావు త‌మ‌దైన స్టైల్‌లో వైఎస్సార్‌టీపీ అధినేత్రిపై విమ‌ర్శ‌లు గుప్పించారు. తెలంగాణ‌లో రాజ‌కీయంగా ఏ మాత్రం బ‌లం లేని ష‌ర్మిల త‌మ‌ను విమ‌ర్శించ‌డాన్ని టీఆర్ఎస్ నేత‌లు జీర్ణించుకోలేక‌పోతున్నారు.

ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థులైన కాంగ్రెస్‌, బీజేపీ నేత‌ల విమ‌ర్శ‌ల కంటే ష‌ర్మిల తీవ్ర వ్యాఖ్య‌ల‌తో టీఆర్ఎస్ నేత‌లు ఇబ్బంది ప‌డుతున్నారు. గ‌త మూడు నాలుగు రోజులుగా ష‌ర్మిల చుట్టూ తెలంగాణ రాజ‌కీయాలు తిరుగుతున్నాయి. ఇంత కాలం ష‌ర్మిల ఉనికిని గుర్తించడానికి నిరాక‌రిస్తూ వ‌స్తున్న‌ప్ప‌టికీ, చివ‌రికి ఆమె ట్రాప్‌లో అధికార పార్టీ ప‌డింది.

ఈ నేప‌థ్యంలో ష‌ర్మిల పేరు ప్ర‌స్తావించ‌కుండా బీజేపీ ద‌త్త పుత్రిక అంటూ రాజ‌కీయ ఎదురు దాడికి టీఆర్ఎస్ సిద్ధ‌మైంది. ఏపీ సీఎం, ష‌ర్మిల సొంత అన్న చూపిన మార్గాన్నే టీఆర్ఎస్ ఎంచుకున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఏడాది మాత్ర‌మే గ‌డువు వున్న నేప‌థ్యంలో రాజ‌కీయంగా ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌ల‌కు అక్క‌డి పార్టీలు క‌త్తులు నూరుతున్నాయి.