జగన్‌ మార్క్‌ పాలన.. వర్క్‌ లేదని వేదన..!

నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌ల్లో అయోమయం అమరావతి నుండే అన్ని ఆర్డర్లూ.. మంత్రులు సహా ఎమ్మెల్యేలకూ చెక్‌ జగన్‌ మార్క్‌ పాలన అధికార పార్టీకి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులకు శిరోభారమయ్యింది. తమమాట చెల్లకపోతే జనంలో తలెత్తుకుని…

నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌ల్లో అయోమయం
అమరావతి నుండే అన్ని ఆర్డర్లూ..
మంత్రులు సహా ఎమ్మెల్యేలకూ చెక్‌
జగన్‌ మార్క్‌ పాలన అధికార పార్టీకి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులకు శిరోభారమయ్యింది. తమమాట చెల్లకపోతే జనంలో తలెత్తుకుని తిరిగేదెలా? అంటూ ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జ్‌లు తీవ్రంగా మదన పడుతున్నారు. జిల్లా మంత్రులు సైతం పలు వ్యవహారాల్లో వేలు పెట్టేందుకు జంకుతున్నారంటే పరిస్థితి పంత జఠిలమైందో అర్ధం చేసుకోవచ్చని గోదావరి జిల్లాలకు చెందిన వైకాపా కీలకనేతలు పలువురు వ్యాఖ్యానిస్తుండటం విశేషం!

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో వైకాపా ప్రభుత్వం ఇలా ఏర్పడిందో లేదో అలా తమ చేతివాటాన్ని ప్రదర్శించేందుకు పలువురు నేతలు నడుంబిగించారు. కొద్ది రోజులకే జగన్‌ కోటరీ కొన్ని కీలక వ్యవహారాల్లో పట్టు బిగించింది. సాధారణంగా కొత్తగా వచ్చిన ప్రభుత్వం తొలుత వివిధ శాఖల్లో బదిలీలపై దృష్టి సారిస్తుంది. ఐఏఎస్‌/ఐపీఎస్‌ అధికారుల నుండి సాధారణ ఉద్యోగి బదిలీల వరకూ తన చిత్తానుసారం ప్రభుత్వం వ్యవహరించడం ఆనవాయితీ!

అయితే రాష్ట్రస్థాయి అధికారుల నుండి జిల్లాల్లో పలు కీలకమైన ఉన్నతాధికారుల బదిలీల వరకూ ప్రభుత్వంలోని పెద్దలే చూసుకుంటారు. డివిజన్‌, జిల్లా స్థాయిల్లో ఉద్యోగాల బదిలీల వ్యవహారంలో మంత్రులు లేక ఎంపీపీలు, ఎమ్మెల్యేలు వేలు పెడుతుంటారు. ప్రత్యేకించి అసెంబ్లీ నియోజకవర్గం స్థాయిలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే చెప్పినమాటే చెల్లుతుంది. సదరు నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఉన్న పక్షంలో అధికార పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ (సమన్వయకర్త) చక్రం తిప్పుతుంటారు.

అయితే జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీన్‌ రివర్స్‌ అయ్యింది. పోలీస్‌, రెవెన్యూ, పంచాయతీరాజ్‌, పురపాలక సంఘాల అధికారులకు సంబంధించి జరిగిన బదిలీలన్నీ అమరావతి కేంద్రంగా నడిచాయి. వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో మండల, డివిజన్‌ స్థాయి అధికారుల నియామకాల్లో వేలుపెట్టిన స్థానిక నేతలందరికీ దిమ్మతిరిగే రీతిలో హైకమాండ్‌ షాక్‌ ఇచ్చింది. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు లేక ఇన్‌ఛార్జ్‌లు రికమండ్‌ చేసిన వారిని పక్కనపెట్టి నేరుగా అమరావతి నుండి ఆర్డర్లు తెచ్చుకున్న అధికారులు ఆయా స్థానాల్లో ఇపుడు చక్రం తిప్పుతున్నారు.

కొందరు మండల, డివిజన్‌ స్థాయి అధికారుల నియామకాలకు సంబంధించి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇచ్చిన సిఫార్స్‌ లెటర్లు బుట్టదాఖలా అయినట్టు తెలుస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలోని పలు మండల, డివిజనల్‌ స్థాయి అధికారులు నేరుగా అమరావతి నుండే రికమండేషన్‌తో ఆయా స్థానాల్లో జాయిన్‌ కావడం స్థానిక నేతలకు కంగు తినిపించింది. అంతకుముందే స్థానిక ప్రజా ప్రతినిధుల సిఫార్స్‌తో విధుల్లో చేరిన అధికారులను వారం పదిరోజులు తిరక్కుండానే వేరే ప్రాంతానికి బదిలీ చేసి వారిస్థానే మరొకరికి అవకాశం కల్పించడం చూసి స్థానిక నేతలు నివ్వెరపోయే స్థితి ఏర్పడింది.

ఇదిలావుంటే ఈ బదిలీల వ్యవహారం తొలుత ముడుపులు తీసుకున్న నేతలకు శిరోభారంగా మారింది. ఇదిలావుంటే గ్రామ/వార్డు వాలంటీర్లు, మద్యం దుకాణాల్లో ఉద్యోగాల నియామకాల విషయంలో స్థానిక ప్రజాప్రతినిధుల మాట చెల్లుబాటయ్యింది. గ్రామ సచివాలయాల ఉద్యోగ నియామకాల్లో మాత్రం వేలుపెట్టే అవకాశం లేకపోవడంతో పలువురు ప్రజా ప్రతినిధులు అసహనంతో రగిలిపోతున్నట్టు తెలుస్తోంది. సచివాలయ ఉద్యోగ నియామకాలన్నీ పూర్తి పారదర్శంగా జరిగేలా ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నట్టు సమాచారం!

ఈ పరిణామం చేతివాటానికి బాగా అలవాటుపడిన కొందరు నేతలకు ఎంతమాత్రం రుచించడం లేదు! సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షకు సంబంధించి ప్రశ్నాపత్రం లీకైనట్టు జరిగిన ప్రచారంలో ఈ ప్రక్రియపై ముఖ్యమంత్రి మరింత పట్టు బిగించినట్టు భోగట్టా! అవినీతికి ఆస్కారం లేకుండా ఉద్యోగాలకు అభ్యర్ధుల పంపిక జరిగేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అక్రమార్కుల పాలిట శాపంగా మారిందనే చెప్పాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

చిరంజీవి గారి వల్లనే అవన్నీ సాధ్యం అయ్యాయి