డబ్బయ్ఏళ్ల వృద్ధ రాజకీయనేత రోజుకు 8 గంటలు రాజకీయాల్లో తలమునకలు కావడం ప్రపంచంలో ఎక్కడా ఏప్రజలు చూడలేరు. కానీ, బాబు 18గంటలు పాటు ప్రజల కోసం పని చేస్తున్నారని ఆయన గారాలపట్టి, తెలుగుదేశం యువరాజు లోకేష్ పలుమార్లు వచ్చీరాని మాటలతో చెప్పారు. లోకేష్ ఏదిచెప్పినా జనాలు పెదాలు విరిచేయడమే. కానీ, బాబు 18గంటల రాజకీయశ్రామికుడు అనేమాటల్లో అసత్యమే లేదని జనాలు కూడా నమ్మారు. ఎందుకంటే అవిశ్రాంత రాజకీయ విన్యాసకుడుగా, సర్వజనులు తెలుసుకోగలిగిన బాబు కదలికలే అందుకు కారణం. బాబు కుళ్లు, కుట్ర, కుసిద్ధపు రాజకీయాలు అనునిత్యం 24 గంటలూ చేయడం ఆయనకే చెల్లు. ఏమాత్రం కసికందకుండా జనాలను నమ్మించడానికి నానాపాట్లు పడడంలో నిత్య ఆరాటకుడుగా వాసికెక్కా రు. ఎన్నికల ముందు నిద్రలో కూడా 'మోదీ నిన్ను మెడలువంచి దించేస్తా! 22పార్టీల నేతల్లారా!
మనమే కాబోయే కేంద్ర పాలకులం. ప్రధాని మీరవుతారా? నన్నే ప్రధానిని చేస్తారా? అని నిద్రలోసయితం కలవరింతలతో సాగే బాబు. తీరా, ఇల్లు గెలవలేక బొక్కాబోర్లాపడ్డారు. అక్కడితో మోదీ అండ్‌కో ఊసెత్తకుండా గప్చిప్ అయ్యారు. అలాంటి బాబు ఓడాక, పార్టీ దుంపధూళి అయ్యాక, వీసమెత్తు జ్ఞానోదయం పొందక ఎగిరెగిరి పడడంలో ఎలాంటి తేడాలేకుండా సాగడం బాబుకే చెల్లింది. పచ్చమీడియాలు తననుగుప్పిట్లో ఉన్నందున పచ్చపచ్చగా రాయించుకుని ప్రజల్ని నమ్మించే ఎత్తుగడలను ఏమాత్రం వదలకుండా సాగడం బాబుకే సాధ్యమయ్యింది. అలాంటి చంద్రన్న 1982నాటి తెలుగుదేశం ఆవిర్భావం నాటి జర్నలిజాన్ని నేటికి చూసుకోవడం ఆయన విజ్ఞతను ఏమనుకోవాలి? ఆరోజుల్లో జర్నలిజం అంటే గౌరవం సర్వత్రా విన్పించేది. అంకిత భావంతో జర్నలిస్టులు, పత్రికల్లో రాసే రకరకాల రాతగాళ్లు అర్ధాకలితో కలాలు కదిపేవారని జనాల్లోటాక్ ఉండేది. మేధావివర్గంలో జర్నలిస్టులకు పెద్ద పీట వేయబడేది.
ఎన్టీఆర్ సిన్మాల్లో హీరో వెలుగులు వెలిగినంతకాలం వెలిగి, చివరాఖరిలో ఆయన స్వంత సిన్మాలు (శ్రీరామ పట్టాభిషేకం, శ్రీతిరుపతి వేంకటేశ్వరకల్యాణం, వేములవాడ భీమకవి, చాణక్యచంద్రగుప్త, శ్రీమద్విరాటపర్వం, రౌడీరాముడు కొంటెకృష్ణుడు, సత్యంశివం, అక్బర్, అనార్కలి, అగ్గిరవ్వ, సింహం నవ్వింది,) వరుసఫ్లాప్‌లు అయ్యాయి. పైగా, వృద్ధ హీరోగా రాణించడం కష్టమే అని నిష్క్రమణ దిశలో తెరజీవితం వదలి రాజకీయరంగు పులుముకున్నారు. ఎన్టీఆర్ రాకతో జర్నలిజం కూడా వెర్రితలలు వేయడంలో తెలుగునాట మహోన్నతంగా ఆరంభం అయ్యింది. తిమ్మిని బమ్మిని చేయడంలో 1974లో ఆరంభమై తెలుగు దినపత్రికలను తొక్కుకుంటూ ముందు వరుసలో మహారాజా దర్జాలో ఆశీనమైన ఓదినపత్రిక నడుం బిగించింది. కులంపిచ్చతో పెట్రేగిపోయింది. తెలుగు సినీతెర మీద యువతకు అవకాశం లేదా? అని ఎన్టీఆర్ తెరమీద హీరోగా ఇంకెన్నాళ్లు ఏలుతారని ప్రశ్నించేదా పత్రిక?
ఎప్పుడయితే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి దూకడంతో 50ఏళ్ల పాటు తెరమీద దేవుడే నేడు మనుష్యుల్ని ఆదుకోవడానికి విచ్చేసిన రాముడు అని పతాకరాతలతో తెలుగువారి గుండెల్లో నింపేసిగాని నిద్రపోలేదు. అప్పటి జర్నలిజంపై పాఠకుల్లో, జనాల్లో వంకరచూపులు లేవు. పత్రికల్లో వచ్చిందంటే అదో గజిట్ పబ్లికేషన్లా ఉండేది. అలా నమ్మిన జనాల నమ్మకంపై ఎన్టీఆర్‌ను రాముడు, ఏసు, అల్లా అని చాటేలా అక్షరయజ్ఞానికి తెగబడింది. కీర్తిస్తే ఎవరికి ఇష్టముండదు? అందులో ఎన్టీఆర్ ఉబ్బులింగడు కంటే ఒకాకు ఎక్కువే. అక్కణ్నించి ఆపత్రిక తెలుగుదేశానికి రంగుల కరపత్రమై ఒకవేదిక అయ్యింది. విఠలాచార్య జంతర్‌మంతర్ సిన్మాలా అప్రతిహతంగా టీడీపీని 38ఏళ్లుగా మోస్తునే ఉంది. టీడీపీ గెలిచిందా జననీరాజనం అని ఎత్తుకోవడం. పార్టీ ఓడిందా దుష్ట కాంగ్రెస్ రిగ్గింగ్ కారణంగా గెలుపు తృటిలో తప్పిందని వెనకేసుకు రావడం. ఈ మధ్య ఈవీఎమ్‌లు, వీవీప్యాట్లు మోదీ రిమోట్ కంట్రోల్లో పనిచేస్తాయన్నవరకు టీడీపీని ఎత్తుకునే ఉంది.
టీడీపీని చంకనెత్తుకున్న ఆపత్రిక అప్పట్లో 7ఏళ్లు ఎంతగా జనాలను నమ్మించాలో అంతగా నమ్మించింది. మధ్యలో జనాలు జర్నలిజం అనగానేమి? అని జర్నలిసం లోతులు పరిశోధించి నిగ్గుతేల్చారు. కేవలం కులపిచ్చితో ఈపత్రిక టీడీపీ కొమ్ముకాస్తోందని భూతద్దాలతో గుర్తించారు.1989లో ప్రజలను ఉద్ధరించే ఎన్టీఆర్‌ను కాంగ్రెస్ ఓడించింది. ఓటమి దిగులుతో పదిరోజులుపాటు ఎన్టీఆర్ ముఖం చాటేసారు. కొన్నాళ్లు మౌనం అయ్యారు. ఆరుమాసాలో, ఏడాదో వేచిచూద్దాం కాంగ్రెస్ పాలన, అప్పుడు ఎండగడదాం అని ఒకింత వేచి చూడడంలో ఉన్నారు. కానీ, ఎదుటివారిని తట్టుకో లేనితనం తెలుగుదేశానికి జన్మహక్కులాంటిది. అయితే, అప్పటికే కాంగ్రెస్‌తో తొలివెన్నుపోటుకు గురయి పదవిచ్యుతుడు కావడం వంటివి ఎన్టీఆర్ కాంగ్రెస్‌తో పేచీ ఎందుకు అన్నట్లు మెత్తబడిపోయారు. కేంద్రంలో కాంగ్రెస్‌పై నోరు చేసుకోవడం బాగా తగ్గించేసుకున్నారు.
ఎన్టీఆర్‌ను ఎత్తుకోవడంలో టీడీపీకి రంగుల కరపత్రం అనే జనవాక్కును నెత్తిమీద నుంచి దించుకునేయత్నం ఆపత్రిక ఏనాడు చేయలేదు. ఎన్టీఆర్ తొలిసారి ముఖ్యమంత్రి అయ్యాక పాలన అంతా తనకనుసన్నల్లో చేస్తారు. తన పత్రికాఫీసుకు ఎన్టీఆర్ రోజూ వచ్చి ఏమిచేయాలని అడుగుతారనుకున్నారు. ఎన్టీఆర్‌కు రాజకీయాలు ఏమీతెలియవు అనే భ్రమల్లో ఆపత్రిక యజమాని ఉండేవారు. ఎన్టీఆర్ రాజ్యసభ ఇస్తానని ఆఫర్ ఇవ్వడంతో ఎన్టీఆర్వద్ద కంయ్ కుంయ్లు పనికిరావని, పార్టీలో ఎప్పుడు అవకాశం వచ్చినా సీఎం సీటులో కూర్చుందామనే కలలుకనే చంద్రబాబుతో ఆపత్రిక లోపాయికారిగా గుసగుసలకు తెరలెత్తేసింది. పార్టీలో బాబు ముఠాలు కట్టడం ఎన్టీఆర్‌కు తెలిసినా మా అల్లుడే కదా అన్నట్లు మెతకవైఖరితో ఉండేవారు. పైగా, ఏ సమస్య వచ్చినా బాబుతో చర్చించడం దాన్ని ఆపత్రిక బాబు అపరచాణక్యుల వారన్నట్లుగా సమస్య పరిష్కరించారన్నట్లు అక్షరాలతో చూపడం ఇవన్నీ పార్టీలో బాబును ఎవరెస్టును చేసాయి.
పార్టీలో ఎక్కువమంది బాబు వెనుకనే క్యూకట్టారు. ఆ దినపత్రిక పార్టీలో ఎన్టీఆర్‌కు ఇష్టులైన నేతలను వరుసగా దూబచేస్తూ పార్టీలోంచి వెళ్లిపోయేవరకు అక్షరపోట్లకు తెగబడింది. అదే సమయంలో లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి రావడం ఆమె ఎన్టీఆర్‌తో పాలన విషయాల్లో ముమ్మరం కావడం ఇవన్నీ పొంచున్న బాబుకు అయోమయం నెలకొంది. ఎన్టీఆర్ కొడుకులు రాజకీయాలవైపు కన్నెత్తి చూడడంలేదు. మద్యలో లక్ష్మీపార్వతి పార్టీని తన్నుకుపోవడమా అన్నట్లు బాబు, పత్రికాధిపతి చెవులు, మూతులు కొరుక్కుని మళ్లీ దారులు వెతికారు. ఆమెను దూబచేయడంలో తలమునకల య్యారు. చివరికి రెండో వెన్నుపోటుకు తేలిగ్గా ఎన్టీఆర్‌ను గురిచేసి రోడ్డున పడేసారు. ఇదంతా ఒకపత్రిక తనకలం వీరులతో సాగించిన పచ్చరాతలతో తెలుగుదేశాన్ని నింగిలోకి ఎత్తేస్తూ సాగింది. సిద్ధాంతాలు, పార్టీ మనుగడను మరింతగా తీర్చిదిద్దాలనుకునే పార్టీలో ఉన్న కొద్దిమంది నేతలను దూబచేస్తూ పార్టీ వదలిపోయేలా చేసేసింది.
చివరికి సీఎం కుర్చీ ఆశపరుడు చంద్రబాబును పార్టీకి సర్వాధికారి కావడానికి తనవంతు అక్షరసాయం చేసింది. టీడీపీకి అసలు మూల విరాట్టు ఎన్టీఆర్‌ను ఉత్సవవిగ్రహంగా మార్చేసి రోడ్డున పడేలా చేసింది. ఏడుగురు కొడుకులు ఉన్న ఎన్టీఆర్ ఆస్థు లకు మాత్రమే వారసులయ్యారు. కానీ, ఆయన పెట్టుకున్న పార్టీకి చిన్నఅల్లుడు బాబు వారసుడు కావడాన్ని అడ్డుకోలేక పోయారు. పార్టీ దరిదాపుల్లోకి వెళ్లలేని పరిస్థితిలో బిక్కముఖా లేసారు. కనీసం పార్టీ టిక్కెట్, పొందలేకపోయారు. బాలకృష్ణ వియ్యంకుడు అయినందున పార్టీ ఎంఎల్ఏతో సరిపుచ్చబడ్డారు. తెలుగుదేశానికి 1982 నుంచి నేటివరకు అక్షరాలతో పట్టంకడుతూ, అనేక తప్పుడు రాతలతో పచ్చమీడియా, టీడీపీ రంగుల కరపత్రం అనేముద్రలు వేయించుకుందా ఆపత్రిక. చేతిలో మీడియా లేకుండా పార్టీ పెడితే అధోగతే అనే బితుకును రాజకీయనేతలకు నూరిపోసింది.దాంతో కొత్త దినపత్రికలను తెలుగునేలపై కాళ్లూనేలా చేసుకుని పక్కలో అక్షర బల్లాలను కోరితెచ్చుకున్నట్లు అయ్యింది. అలా వచ్చిన పత్రికలు (ఉదయం, వార్త, సూర్య, నమస్తేతెలంగాణా, సాక్షి,)లతో బాటు మరిన్ని ఉన్నాయి.
నడపలేక పాత యాజమాన్యం చేతులెత్తేసిన ఆంధ్రజ్యోతిని ఏకమొత్తంగా కొనుగోలు చేసుకుని, కాంగ్రెస్ రాతలను పక్కనపెట్టేసి, టీడీపీని మరింత ఎత్తుకునేలా రాతలతో పెట్రేగమని చంద్రబాబే ఆర్థికసాయం అందించారు. బాబు బినామీయే అనేది బహిరంగ రహస్యమే. అలాగే బాబు ప్రజల్లో బలంగా ఉన్న మీడియాను గుప్పిట్లోకి లాక్కుని ఎలా పాలించినా, ఎవరిపై ఎన్ని ఆరోపణలు చేసినా గుప్పిట్లో ఉన్న మీడియా తన రాతలతో తిమ్మిని బమ్మిని చేస్తుందని ఆదిశలో బాబు అండ్ బేటా పరుగులు తీస్తున్నారు. మీడియాను మేనేజ్‌చేసే బాబుకు, సోషల్‌మీడియా ఒకవైపు జగన్ మీడియా మరోవైపు ఎప్పటికప్పుడు ఎండగడ్తుంటే తట్టుకోలేకపోయారు. ఈమద్య ఘోర ఓటమికి కారణం తనపై వ్యతిరేక ప్రచారానికి తెగబడిన సాక్షి మీడియా, సోషల్ మీడియాయే అని బాబు ఒంటికాలిపై లేచారు.
బాబు ఏపీ పాలకుడుగా సాక్షిని మూయించే దిశలో అడుగులు వేసారు. కానీ, అది సాధ్యంకాదని పైగా, అప్పట్లో పొత్తులో ఉన్న మోదీ సహకరించరని మౌనమయ్యారు. లేకుంటే జగన్ మీడియాను కనీసం 16నెలలైనా స్థంబింపచేసే వారే. అలాంటి తీరులో బాబు కదలికలు అవకాశం లేక తోకముడిచాయి. ఇప్పుడు ప్రింట్మీడియా పాలిటి యమగండంగా ఎలక్ట్రానిక్ మీడియాదే పైచేయిగా గతపదేళ్లుగా సాగుతోంది. అన్ని మీడియాలకంటే మేమే ఎక్కువ అన్నట్లు సోషల్‌మీడియా మరింత ముందుకు సాగుతోంది. చంద్రబాబు ఇంకా రెండు ప్రింట్మీడియాలతో ఏడు ఎలాక్ట్రానిక్ మీడియాలతో జనాలను నమ్మించే ఎత్తుగడల్లో సాగుతున్నారు. తనగుప్పిట్లో ఉన్న మీడియాలు ప్రజలను నమ్మించలేక పలువిషయాల్లో చతికిల పడుతునే ఉన్నాయి.
బాబు ఏదోలా కనీసం అత్తెసరు సంఖ్యాబలంతో కడచిన ఎన్నికల్లో అధికారం చేపడతాను అని అనుకున్నారు. బాబును భుజంకెత్తుకున్న మీడియా ఈసారి బాబుదే గెలుపు. చేయని అభివృద్ధిని చేసారని జనాలను నమ్మించడంలో తలమునకలై ఉత్తరాది సర్వేసంస్థల పేర్లతో సర్వేల్లో బాబుకు 130సీట్లు గ్యారెంటీ అని ప్రజల్లో గుప్పించి నమ్మించేసామోచ్ చంకలు గుద్దుకున్నాయా మీడియాలు. బాబు గెలుపు ఆనందంలో తేలియాడారు. బాబు ఎన్నికల ముందు రెండునెలలుపాటు వేలకోట్ల ఖర్చుతో సంక్షేమ పథకాలను బాబు పచ్చమీడియా పిచ్చపిచ్చగా జనాల్లో వండి వార్చింది. ప్రజలు మహానిశ్శబ్ధాన్ని పెదాలబిగువులో భరిస్తూ బాబుకు పచ్చమీడియాకు మాడుపగిలేలా తీర్పునిచ్చారు. అయినా బాబులో వీసమెత్తు జ్ఞానోదయం కాలేదు.
బాబు చేస్తున్న వికృతచేష్టలకు వంతపాడే బాబు మీడియాకు కనీసం సిగ్గనిపించలేదు. బాబు నమ్మినవరకు మనబాణీ మనదే. ప్రజలేమనుకుంటే మనకేం. మన మీడియా పైత్యపు రాతలను కళ్లకద్దుకుని నమ్మినోడు, అన్నివిధాల ఆర్ధికంగా జేబులు నింపేటోడు మన బాబు, మన పాలిటి బంగారు బాబే. ఆయన్ని అనునిత్యం సంతృప్తి పడేలా చేసుకుందాం పబ్బం గడుపుకుందామన్నట్లు ఓడిననాటి నుంచి జగన్ సర్కారుపై పలు విషయాల్లో బాబు ఆరోపణలకు పూయాల్సిన కత్తులు పూసి చేయాల్సిన అక్షరగరిడీలు జనాల్లో చేస్తునే ఉన్నారు. ఏఒక్కటి బాబుకు జనాల్లో మార్కులు పడనేలేదు. బాబు ఆరోపణలు పెరుగన్నపు మూటలు అనిపించలేదు.
మాజీ స్పీకర్ కోడెలకు సర్కారు వేధింపే ఆత్మహత్యకు కారణమయ్యిందని గగ్గోలు కూడా బాబుకు ఆయాసమే మిగిల్చింది. బాబు అంటే విన్యసించే పచ్చమీడియా జనాల్లో తేలికయ్యింది. బాబు అండ్ బేటాకు తెలియని బహిరంగ రహస్యం ఏమిటంటే పచ్చకలాల పోట్లకు కాలంచెల్లింది. జనాలను నమ్మించేయత్నంలో ఏది నిజం ఏది అబద్ధమో జనాలు క్షణాల్లో నిర్ణయించే రాజకీయ పండితులయ్యారు. వారి ముందు కుప్పిగంతులకు కాలం చెల్లింది.
-యర్నాగుల సుధాకరరావు