దక్షిణాదిన స్టార్ హీరోలుగా వెలుగుతున్న అనేకమంది ఎప్పుడో ఒకదశలో హిందీ వైపు ఒకచూపు చూడటం జరుగుతూనే ఉంది. ప్రత్యేకించి ఎనభైల స్టార్ హీరోలు సౌత్ నుంచి నార్త్ వైపు వెళ్లి వచ్చారు. తమిళంలో నిలదొక్కుకున్నాకా.. కమల్ హాసన్, రజనీకాంత్‌లు హిందీలో వివిధ సినిమాలు చేస్తూ వచ్చారు. బాలీవుడ్‌లో సోలో ప్రయత్నాలు, అక్కడి స్టార్ హీరోలతో కలిసి నటించడం ఈ హీరోలు చేశారు. రజనీకాంత్, కమల్‌లు తెలుగులో ఎలా అయితే సినిమాలు చేశారో.. అదే విధంగా హిందీలోనూ వారు తమ ప్రయత్నాలను చేశారు. అయితే ఎందుకో డైరెక్ట్ హిందీ సినిమాలు చేయడం మాత్రం కొంతకాలానికే ఆగిపోయింది.
'మరోచరిత్ర' హిందీ రీమేక్‌లో కమల్ హాసన్ నటించాడు. ఆ తర్వాత అనేక సినిమాల్లో చేశారు. బాలీవుడ్ స్టార్ దర్శకులు కూడా కమల్‌తో సినిమాలు చేయడానికి ఇష్టపడ్డారు. అమితాబ్, కమల్ కాంబోలో ఒక సినిమా కూడా రూపొందింది. దాదాపు డెబ్బైశాతం షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఆ సినిమా ఆగిపోయినట్టుగా తెలుస్తోంది. నాటి బాలీవుడ్ ప్రముఖ దర్శకులు రాజ్‌కపూర్, హృషికేష్ ముఖర్జీ, మన్మోహన్ దేశాయ్ లాంటివాళ్లు కమల్ హాసన్‌తో సినిమాలు చేయడానికి ఉత్సుకత చూపించారు.
రాజ్‌కపూర్ దర్శకత్వంలో కమల్ ఒక సినిమాలో నటించినట్టుగా ఉన్నారు. తనతో సినిమా చేయడానికి రెడీ అనా మన్మోహన్ దేశాయ్ ఒకసారి కమల్‌ను అడిగారట. 'స్క్రిప్ట్ ఇవ్వండి.. రెడీ' అని కమల్ ఆన్సర్ చేశారట. 'అమితాబ్ కూడా నన్ను ఆ మాట అడగలేదే..' అని ఆ దర్శకుడు నవ్వుతూ స్పందించారట. కమల్ హాసన్ కొంతకాలానికి వేర్వేరు భాషల్లో నటించడం దాదాపుగా ఆపేశాడు. తమిళంలోనే సినిమాలు చేస్తూ.. వాటినే అన్ని భాషలకూ డబ్ చేసేలా సబ్జెక్టులను ఎంచుకొంటూ వచ్చాడు. కమల్‌కు అన్ని భాషల్లోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడటంతో.. ప్రత్యేకంగా వేర్వేరు భాషల్లో నటించాల్సిన అవసరం లేకుండాపోయింది.
అదే స్థాయికి రజనీకాంత్ కూడా కొంతకాలానికి చేరారు. హిందీలో కొన్ని డైరెక్ట్ సినిమాల్లో చేశాడు రజనీ. అక్కడి స్టార్ హీరోలతో కలిసి నటించాడు. 'భాషా' తర్వాత రజనీకాంత్‌కు కూడా వేర్వేరు భాషల్లో నటించాల్సిన అవసరం లేకుండా పోయింది. తమిళంలో సినిమా చేస్తేచాలు అదే అన్ని భాషలనూ చుట్టేస్తూ వచ్చింది. ఇక రజనీకాంత్, కమల్ హాసన్‌లు హిందీలో కూడా తమ సినిమాలకు తామే డబ్బింగ్ చెప్పుకుంటూ వచ్చారు. హిందీలో సినిమా మేకింగ్‌కు ఎక్కువ రోజులు పట్టడం కూడా కమల్ అక్కడి సినిమాలు మానేయడానికి ఒక కారణం అని అంటారు.
ఇక తెలుగు హీరోల్లో చిరంజీవి తన సినిమాల అనువాదాలతో హిందీ వాళ్లను పలకరించాడు. ఆ తర్వాత తనే డైరెక్టుగా రెండు మూడు సినిమాలు చేశాడు మెగాస్టార్. అయితే అవేవీ ఆశించిన ఫలితాలను అందుకోలేదు. చిరంజీవి హిందీ సినిమా ప్రయాణం కొన్ని సినిమాలకే పరిమితం అయ్యింది. ఇప్పుడు 'సైరా నరసింహారెడ్డి'తో మళ్లీ మెగాస్టార్ బాలీవుడ్ ప్రేక్షకులను పలకరిస్తూ ఉన్నారు. ఈ సినిమాలో అమితాబ్ నటించడం, భారీఎత్తున రూపొంది ఉండటంతో అక్కడ కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
సూపర్ హిట్టైన తమిళ సినిమా 'జెంటిల్మన్' రీమేక్ లోనూ, తెలుగులో సూపర్ హిట్ 'అంకుశం' రీమేక్‌లోనూ చిరంజీవి హిందీలో నటించారు. మొత్తంగా హిందీలో చిరంజీవికి సరైన హిట్టులేదు. ఆ లోటు 'సైరా.. నరసింహారెడ్డి'తో భర్తీ అవుతుందేమో చూడాల్సి ఉంది. ఇక తెలుగు నుంచి ఎక్కువ హిందీ సినిమాల్లో నటించింది నాగార్జునే. 'శివ' రీమేక్‌తో బాలీవుడ్ ప్రయాణం మొదలుపెట్టిన నాగార్జున ఆ తర్వాత అనేక సినిమాల్లో నటించారు. ప్రస్తుతం కూడా ఒక సినిమాను హిందీలో చేస్తున్నారు నాగ్. మరీ సూపర్ హిట్ అంటూ ఏదీ కొట్టలేకపోయినా.. అడపాదడపా హిందీలో సినిమాలు చేస్తూ సరదా తీర్చుకుంటున్నాడు నాగార్జున.
అయితే గత కొన్నేళ్లలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. డబ్బింగులు పెరిగిపోయాయి. ఆఖరికి ఫ్లాప్ అయిన సినిమాలు కూడా హిందీలోకి అనువాదం అయ్యే ప్రక్రియ పుంజుకుంది. గత దశాబ్దంన్నరలో ఈ పరిస్థితి వచ్చింది. మొదట్లో నాగార్జున, చిరంజీవి వంటి హీరోల సినిమాలను డబ్బింగ్ చేసి టీవీల్లో వేసుకునే వాళ్లు. అక్కడ నుంచి ఆఖరికి అనామక సినిమాలను కూడా అనువదించి వాటిని టీవీల్లో వేసుకోవడం, థియేటర్లలో రిలీజ్ చేయడం, యూట్యూబ్‌లో పెట్టడం జరుగుతూ ఉంది. ఇలా యూట్యూబ్ ద్వారానే కొంతమంది తెలుగు హీరోలు హిందీలో తమ సినిమాలకు ప్రత్యేక మార్కెట్‌ను సంపాదించుకున్నారు.
తెలుగులో ఫ్లాప్ అయిన సినిమాలు కూడా.. హిందీ వెర్షనల్లో యూట్యూబ్‌లో కోట్లలో వ్యూస్ పొందాయనే లెక్కలను తరచూ ఆయా హీరోలు ప్రకటించుకుంటూ ఉన్నారు. ఇలా తెలుగు హీరోలు కొందరు హిందీ జనాల మధ్యన యూట్యూబ్ స్టార్స్‌గా వెలుగుతున్నారు. అయితే కొందరు నిఖార్సైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రామ్‌చరణ్ హిందీలో ఒక సినిమా చేసి విఫలం అయ్యాడు. 'జంజీర్ 'రీమేక్‌తో చరణ్ ఫ్లాప్‌ను మూటగట్టుకున్నాడు. మనదగ్గర హిట్టైన 'ఖైదీ' సినిమాను పునీత్ రాజ్‌కుమార్ వచ్చి రీమేక్ చేసి మనకు చూపిస్తే మనకెలా అనిపిస్తుందో, 'జంజీర్'ను రామ్‌చరణ్ రీమేక్ చేస్తే హిందీ జనాలకు అలాగే అనిపించిందని కొందరు క్రిటిక్స్ చురకలు అంటించారు.
అయితే చరణ్ ప్రయత్నాలను ఆపేదిలేదని ప్రకటించాడు. మళ్లీ హిందీ మీద దండెత్తడానికి ఈ హీరో రెడీ అవుతున్నాడు. ఆ సంగతలా ఉంటే.. తమిళ హీరో ధనుష్ హిందీలో మంచి హిట్‌కొట్టాడు. అమితాబ్‌తో కలిసి హిందీలో కూడా ఒక సినిమా చేశాడు. తన రూపానికి తగ్గట్టైన పాత్రలతో ధనుష్ బాలీవుడ్‌లో కూడా ఉనికిని చాటుతూ ఉన్నాడు. డబ్బింగ్ మార్కెట్ మీద కన్నా.. ఈ హీరో డైరెక్ట్ హిందీ సినిమాలతోనే ప్రత్యేకంగా ఉనికిని చాటడానికి ప్రయత్నాలు సాగిస్తున్నాడు.
అలాగే అలాంటి ప్రయత్నాలు చేస్తున్న మరో హీరో దుల్కర్ సల్మాన్. 'కార్వాన్' సినిమాతో దుల్కర్ సల్మాన్ బాలీవుడ్ వైపు వెళ్లాడు. ఆ తర్వాత ఇటీవలే 'జోయా ఫ్యాక్టర్' అంటూ మరో ప్రయత్నం చేశాడు. మలయాళానికే పరిమితం కాకుండా, 'ఓకే కన్మణి' సినిమాతో తమిళులను, అదే సినిమాతో తెలుగు వాళ్లను, ఆపై 'మహానటి'తో ఇంకోసారి తెలుగువాళ్లను, ఇప్పుడు బాలీవుడ్ వాళ్లను పలకరిస్తున్నాడు దుల్కర్‌సల్మాన్. తన ఫస్ట్ ఇంప్రెషన్స్‌తో ప్రతిచోటా ఆకట్టుకుంటున్నాడు ఈ హీరో.
అయితే సౌతిండియన్ హీరోలు బాలీవుడ్‌లో చేస్తున్న సినిమాలతో లాంగ్వేజ్ ప్రాబ్లమ్ తప్పలేదని తెలుస్తోంది. తమ వాయిస్‌ను తమ పాత్రలకు చెప్పుకునేందుకు కొందరు హీరోలు ఇష్టం చూపుతారు. అలాంటప్పుడు కూడా పలికే విషయంలో ఇబ్బంది వస్తూ ఉంటుంది. ఇదివరకూ మోహన్‌లాల్‌ను హిందీ సినిమాలో నటింపజేసిన రామ్‌గోపాల్ వర్మ.. అతడి కేరెక్టర్‌ను ముంబైలో పనిచేసే ఒక తమిళ పోలీస్‌గా డిజైన్ చేశాడు. ఇటీవల 'జోయా ఫ్యాక్టర్'లో కూడా దుల్కర్ సల్మాన్ క్యారెక్టర్‌ను చెన్నై నుంచి ట్రాన్స్‌ఫర్ అయినట్టుగా చూపించారు. హీరోల భాష ఇబ్బందులు తప్పించడానికి దర్శకులకు ఈ అవకాశం ఉంది.