వైఎఎస్ జగన్మోహన్ రెడ్డి కేవలం పాదయాత్ర వల్ల వచ్చిన మైలేజీతోనే సీఎం అయ్యారనే ఉద్దేశం పవన్ కల్యాణ్ ది. చాలా సందర్భాల్లో ఈ విషయం బైటపెట్టారు కూడా. పాదయాత్రలు చేయాలని నాకూ ఉంటుంది, నేనూ చేయగలను. కానీ నాకున్న అభిమానం, ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల నేను బైట తిరగలేను. ఒకవేళ తిరిగినా జనం నన్ను పీస్ పీస్ చేసేస్తారు. చెయ్యికి చెయ్యి, కాలుకి కాలు లాగేసుకెళ్తారని అంటుండేవారు పవన్ కల్యాణ్.
వైసీపీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం పాదయాత్రే కావచ్చు, కానీ ఎవరు పడితేవారు, వేల కిలోమీటర్లు రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేయగలరా? ఎక్కడా బ్రేక్ లేకుండా, ఒక్కచోట కూడా వాహనం ఎక్కకుండా నడవగలరా? అది దుస్సాహసమే, అలాంటి సాహసానికి పవన్ సై అంటున్నారు. సన్నిహితుల దగ్గర పాదయాత్రపై అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే అజెండాపై యాత్ర చేయడానికి తగిన కారణం వెదికే పనిలో ఉన్నారు జనసైనికులు. యాత్రకు అవసరమైన ఆర్థిక వనరులు, జిల్లాల్లో ఏయే నేతలు ఎక్కడి వరకు యాత్రను పర్యవేక్షిస్తారు వంటి అంశాలపై నివేదిక తయారు చేసేపని మొదలు పెట్టారు.
ప్రస్తుతం జిల్లాల్లో ఎంక్వయిరీ జరుగుతోంది. పవన్ కల్యాణ్ పర్యటనకు వస్తే ఎవరు ఏయే ప్రాంతాల్లో యాత్రకు అండగా నిలబడతారు, జనసమీకరణ ఎంతవరకు చేయగలరు, చేరికలు ఏమైనా ఉంటాయా? ఎక్కడెక్కడ బహిరంగ సభలు పెట్టే అవకాశం ఉంది? ఇలాంటి ప్రశ్నలకు జిల్లా నాయకుల నుంచి సమాధానాలు రాబడుతున్నారు. అన్నీ అనుకున్నట్టు కుదిరితే ఉగాది తర్వాత పవన్ పాదయాత్ర చేసే ఆలోచనలో ఉన్నారు. అప్పటికి వెన్నునొప్పి పూర్తిగా తగ్గితేనే యాత్ర చేసే అవకాశం ఉంది.
అయితే సన్నిహితులు మాత్రం పవన్ యాత్రను వాయిదా వేసుకోమని సలహా ఇస్తున్నారు. ఎన్నికల ముందు యాత్ర చేపడితే పొలిటికల్ మైలేజీ ఉంటుందని, ఇప్పుడు రాష్ట్రం మొత్తం చుట్టేసినా అప్పటికి పెద్ద ప్రయోజనం ఉండదని చెబుతున్నారు. అటు పవన్ ఆరోగ్య పరిస్థితిపై కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెన్ను నొప్పితో యాత్ర అంటే మళ్లీ అది తిరగబెట్టే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. యాత్ర పేరుతో ఆరోగ్యాన్ని పణంగా పెట్టొద్దని వారు వారిస్తున్నారట.
మరి పవన్ మనసులో ఏముందో? జగన్ కు ధీటుగా పాదయాత్ర చేయాలనుకుంటున్న పవన్ అడుగు ముందుకేస్తారో లేదో మరికొన్ని నెలల్లో తెలిసిపోతుంది.