దర్శక, రచయిత, నిర్మాత కోనవెంకట్ మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. ఈ మధ్య చాలాకాలంగా ఆయన వార్తలకు దూరంగా వుంటూ వస్తున్నారు. ఎక్కడో అమెరికాలో వుంటూ అనుష్క హీరోయిన్ గా తయారవుతున్న సినిమా వ్యవహారాలు, కొత్త స్క్రిప్ట్ ల తయారీలో వున్నారు. అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చారు. గతంలో ఆయన ఒకటి రెండుసార్లు వార్తల్లోకి ఎక్కారు. ముఖ్యంగా శ్రీరెడ్డి ఇస్యూలో కోనవెంకట్ పేరు తెగ వినిపించింది. అయితే ఆయన తగిన రుజువులు బయటకు పంపి, తనను తాను సేవ్ చేసుకున్నారు.
ఇప్పుడు వచ్చింది. 420 చీటింగ్ కేసు. కథ ఇస్తానని డబ్బులు తీసుకున్నారన్నది కంప్లయింట్ గా తెలుస్తోంది. కథ ఇవ్వలేదు, డబ్బులు అడిగితే ఇవ్వడంలేదు అన్నది దాని కొనసాగింపు. వాస్తవానికి ఇలాగే జరిగి వుంటుంది అని అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే కోనవెంకట్ స్థోమత ముందు పది-పన్నెండు లక్షలు అన్నది చిన్న మొత్తమే. మరి ఎందుకు వెనక్కు ఇవ్వడం లేదు అన్నది తెలియాల్సి వుంది.
అసలు ఇద్దరి మధ్య ఏం జరిగి వుంటుంది? ఈ విషయంలో కోన ఆర్గ్యుమెంట్ ఏమిటన్నది కూడా పోలీసులు తెలుసుకోవాల్సి వుంటుంది. కోనవెంకట్ మొన్నటి ఎన్నికల్లో వైకాపాకు అనుకూలంగా చరుగ్గా వ్యవహరించారు. కోన వెంకట్ బావ ద్రోణంరాజు శ్రీనివాస్, బాబాయ్ కోన రఘుపతి ఆంధ్రలో కీలకపదవుల్లో వున్నారు. అందువల్ల కోన వెంకట్ కు ఇప్పుడు అర్జెంట్ గా ముంచుకువచ్చే ప్రమాదం ఏమీలేదు.
కానీ ఈ ఆరోపణ నుంచి బయటకు వచ్చి, జరిగింది కోన వెంకట్ తెలియచేసి, తన వెర్షన్ క్లియర్ చేయాల్సి వుంది.