జగన్‌, కేసీఆర్‌ల మధ్య సంబంధాలు ఎలా ఉండాలి?

ఏపీ, తెలంగాణల మధ్య సంబంధాలు ఎలా ఉండాలి? ఏపీ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి మధ్య సత్సంబంధాలు ఏ మేరకు ఉండాలన్న చర్చ సాగుతోంది. ఇది ఆసక్తికరమైన అంశమే. గతంలో ఇద్దరు ముఖ్యమంత్రులు అసలు మాట్లాడుకోని…

ఏపీ, తెలంగాణల మధ్య సంబంధాలు ఎలా ఉండాలి? ఏపీ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి మధ్య సత్సంబంధాలు ఏ మేరకు ఉండాలన్న చర్చ సాగుతోంది. ఇది ఆసక్తికరమైన అంశమే. గతంలో ఇద్దరు ముఖ్యమంత్రులు అసలు మాట్లాడుకోని పరిస్థితి నుంచి ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు నాలుగు గంటలు కూర్చుని అనేక అంశాలపై చర్చించిన సందర్భం. ఇది దేని గురించన్నది అర్థం అయి ఉండాలి. కొద్దిరోజుల క్రితం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ల మధ్య మరో భేటీ జరిగిన తీరు గురించే. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కలిసి ఉండాలంటూనే గతంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ల మధ్య కొన్నిసార్లు ప్రచ్చన్న యుద్ధం, మరికొన్నిసార్లు పరోక్ష యుద్ధం సాగేది.

చివరికి హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని కనుక ఇక్కడ ఏపీ పోలీస్‌స్టేషన్‌లు పెడతాం అంటూ చంద్రబాబు డబాయించిన సందర్భం చూశం. ఆ తర్వాత ఓటుకు నోటు కేసులో పట్టుబడి రాజీపార్ములా కింద విజయవాడ తరలి వెళ్లిపోయిన వైనం అందరికీ తెలుసు. ఆ తర్వాత అప్పటి గవర్నర్‌ నరసింహన్‌ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను సమావేశపరచి విభజన సమస్యలను పరిష్కరించాలని పలుమార్లు ప్రయత్నించారు. కాని ఒకటో, అరో సందర్భంలో తప్ప అసలు వారు కలుసుకోలేదు. పైగా సూటీపోటి మాటలతో రెండు రాష్ట్రాల ప్రజల మధ్య ఉద్దిక్తతలకు కారకులయ్యారు. ఓటుకు నోటు కేసు రాజీతర్వాత చంద్రబాబు నాయుడు కొంతకాలం పాటు కేసీఆర్‌ పేరు ఎత్తకుండా, తెలంగాణలో పార్టీని పూర్తిగా వదలుకున్నారు. కాని తిరిగి సాధారణ ఎన్నికల సమయానికి ఆయన విజృంభించి మళ్లీ కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

టీఆర్‌ఎస్‌తో పొత్తు కోసం ప్రయత్నించి విఫలం అయిన తర్వాత ఆ విమర్శలు దూషణల స్థాయికి వెళ్లాయి. కాని అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌ ఎన్నడూ కేసీఆర్‌ జోలికి వెళ్లలేదు. అనవసర వివాదాలలో తలదూర్చలేదు. కాకపోతే ఒక సందర్భంలో నీటి సమస్య అప్పుడు మాత్రం కేసీఆర్‌ను కొంత విమర్శించి ఉండవచ్చు. అంతే. 2019లో జగన్‌ అధికారంలోకి వచ్చాక మొత్తం కథ మారిపోయింది. జగన్‌ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్‌ స్వయంగా వెళ్లి ప్రసంగించడం, కలిసిసాగుదాం అని ప్రజలకు బరోసా ఇవ్వడంతో రెండు రాష్ట్రాల ప్రజలు సంతోషించారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో స్థిరపడ్డ ఆంధ్ర, రాయలసీమ వాసులకు పెద్ద ఊరట కలిగింది. లక్షలాది మంది ప్రజలు ఇక అసలు గొడవలు ఉండవన్న భరోసాను పొందారు. ఆ రకంగా కేసీఆర్‌, జగన్‌ల కలయిక పెద్ద మేలే చేసింది. అయితే ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం ఊరుకుంటుందా?

జగన్‌పై విమర్శలు ఆరంభించింది. కేసీఆర్‌కు జగన్‌ లొంగిపోయారనో, తెలంగాణకు రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారనో, తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారనో విమర్శలు చేయడానికి చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు వెనుకాడలేదు. టీడీపీ గొప్పతనం ఏమిటంటే తాము చేయలేనిదానిని ఎవరైనా చేస్తే వారికి ఎక్కడలేని కోపం వస్తుంది. వారిని తిట్టడమే ద్యేయంగా పెట్టుకుంటారు. టీర్‌ఎస్‌తో ఒకవేళ పొత్తు కుదుర్చుకోగలిగి ఉంటే ఇదే చంద్రబాబు, ఆ పార్టీ నేతలు ఏమనేవారు.. అబ్బో రెండురాష్ట్రాల ప్రజల కోసమే కలిశాం. తెలుగువారు ఎక్కడ ఉన్నా వారి అభివృద్దికే టీడీపీ ఉంది అని చంద్రబాబు అనేకసార్లు గతంలో ఊదరగొట్టారు. దానిని మరింత గట్టిగా ప్రచారం చేసేవారు. అది వేరే విషయం.

ఇప్పుడు జగన్‌, కేసీఆర్‌లు చేస్తున్న దానివల్ల రెండురాష్ట్రాల ప్రజలకు ఏమిటి ఉపయోగం అన్న చర్చ కూడా వస్తుంది. కచ్చితంగా మేలు జరుగుతుందని నిరూపించవలసిన బాధ్యత రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులపైన ఉంది. ఇప్పటికైతే ప్రజలకు వీరిద్దరూ కలిసి ఒక మంచి సందేశం ఇచ్చారు. కలసి ఉంటే కలదు సుఖం అని వారు ప్రజలకు చెప్పగలిగారు. గతంలో ప్రజల మధ్య ఏమైనా అపోహలు, అనుమానాలు, సందేహాలు ఉంటే అవిపోవడానికి వీరి సమావేశాలు ఉపకరిస్తాయి. ఇచ్చి పుచ్చుకునే దోరణిలో వెళతామని అంటున్నారు. అది కూడా మంచిదే. దీని కొనసాగింపుగా ముందు ఉమ్మడి ఆస్తుల విభజన అంటే షేడ్యూల్‌ తొమ్మిది, పదిలలో ఉన్న ఆస్తులను పంచుకోవడం, ఆయా సంస్థల బ్యాంకు ఖాతాలలో ఉన్న డబ్బును రెండు రాష్ట్రాలకు ఉపయోగించుకోగలగడం చేయాలి.

అప్పుడే వీరి కలయికలకు మరింత సార్థకత వస్తుంది. అది అంత తేలికైన విషయం కాదని అందరికి తెలుసు. కాని ఇప్పుడున్నంత సృహృద్భావ వాతావరణం గతంలో ఎన్నడూలేదు. భవిష్యత్తులో కూడా ఉంటుందన్న గ్యారంటీ ఉండదు. ఎందుకంటే ఏ రాష్ట్ర ప్రయోజనాలు ఆ రాష్ట్రానికి ముఖ్యం కనుక, ఇరుగు, పొరుగు కనుక ఏవో చిన్నవో, పెద్దవో వివాదాలు వస్తుంటాయి. వాటిని కలిసి కూర్చుని పరిష్కరించుకుంటే పర్వాలేదు. కాని రాజకీయాలు కూడా మిళితమై ఉంటాయి కనుక అన్నీ సజావుగా సాగుతాయని చెప్పలేం. ఈ విషయంలో కేసీఆర్‌ మహా తెలివిగా ఉంటారన్న భావన ఉంది. అలాంటి అంశాలు తెరపైకి రాకముందే ముఖ్యమైన విభజన సమస్యలు పరిష్కరించుకోగలగాలి. అదే సమయంలో రెండు రాష్ట్రాల సీఎంల మధ్య జరుగుతన్న గోదావరి జలాల తరలింపులో మాత్రం ఇద్దరూ ఆచితూచి అడుగువేయాలి.

రాయలసీమకు నీరు ఇస్తామని చిత్తూరుజిల్లా పర్యటనలో కేసీఆర్‌ అంటే తెలంగాణ ప్రతిపక్షాలు కేసీఆర్‌ ఆ రాష్ట్రం కోసం పనిచేస్తారా అని విమర్శించాయి. గోదావరి జలాలను శ్రీశైలంకు తరలించే స్కీము గురించి జగన్‌ మాట్లాడితే తెలంగాణ కోసం పనిచేస్తారా అని ఏపీ ప్రతిపక్షం విమర్వించింది. ప్రతిపక్షం కాకపోయినా, ఏపీకి సంబంధించిన కొందరు ప్రముఖులు. అనుభవజ్ఞులు జగన్‌ జాగ్రత్త.. కేసీఆర్‌ ట్రాప్‌లో పడబోకండి అని చెబుతున్నారు.. తెలుగుదేశం సోసల్‌ మీడియా అయితే తెలంగాణ భూభాగంలో లక్షన్నర కోట్లతో ప్రాజెక్టు ఆరంభమైనట్లు ఏపీ డబ్బు ఏభైవేల కోట్లకు పైగా అక్కడ ఖర్చు పెట్టేస్తున్నట్లు, దీనివల్ల ఆంధ్రులకు చాలా నష్టం జరిగిపోతున్నట్లు ప్రచారం ఆరంభించేసింది. వీటన్నిటిని గమనంలోకి తీసుకుని ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు ముందుకుసాగాలి.

కేసీఆర్‌, జగన్‌లు స్నేహంగా ఉండడం అవసరం. అదే సమయంలో ఇద్దరూ జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే ఇద్దరు విమర్శలకు గురి అవుతారన్నది ఎక్కువ మంది భావన. అయితే ఆస్తుల విభజన సజావుగా చేసుకుని, రెండు రాష్ట్రాలకు మేలు కలిగితే వారికి గొప్ప పేరు కూడా వస్తుంది. ముందు ఆ పనిచేసిన తర్వాత గోదావరి జలాలు ఏ విధంగా కృష్ణలోకి తీసుకువెళ్లాలన్న దానిపై చర్చిస్తే బెటర్‌ అనిపిస్తుంది. ఏది ఏమైనా ప్రతిపక్ష నేత చంద్రబాబు వంటి వారి విమర్శలు ఎలా ఉన్నప్పట్టికీ, కేసీఆర్‌, జగన్‌లు స్నేహం కొనసాగించడం ద్వారా రెండు రాష్ట్రాల ప్రజల మధ్య సత్సంబధాలకు వారు వారధు అవుతున్నారు. అంతవరకు సంతోషించాల్సిందే.
-కొమ్మినేని శ్రీనివాసరావు

చిరంజీవి గారి వల్లనే అవన్నీ సాధ్యం అయ్యాయి