రాశి, రంభకు క్లాస్ పీకిన కోర్టు

ఒకప్పటి హీరోయిన్లు రాశి, రంభ వెండితెరపై కనిపించడం మానేశారు. కానీ బుల్లితెరపై మాత్రం వీళ్ల హంగామా అంతా ఇంతా కాదు. మరీ ముఖ్యంగా ప్రకటనల టైమ్ వచ్చిందంటే చాలు “కలర్స్” అంటూ ప్రత్యక్షమైపోయారు వీళ్లిద్దరూ.…

ఒకప్పటి హీరోయిన్లు రాశి, రంభ వెండితెరపై కనిపించడం మానేశారు. కానీ బుల్లితెరపై మాత్రం వీళ్ల హంగామా అంతా ఇంతా కాదు. మరీ ముఖ్యంగా ప్రకటనల టైమ్ వచ్చిందంటే చాలు “కలర్స్” అంటూ ప్రత్యక్షమైపోయారు వీళ్లిద్దరూ. తాము బరువు తగ్గామని, అందరూ తగ్గొచ్చంటూ కలర్ ఫుల్ గా ఊరిస్తుంటారు. దీనిపై విజయవాడ వినియోగదారుల కోర్టు సీరియస్ అయింది.

కలర్స్ వెయిట్ లాస్ కార్యక్రమం చూసి అందులో చేరి మోసపోయిన ఓ వ్యక్తి విజయవాడ కన్జూమర్ కోర్టులో కేసు వేశాడు. ఈ కేసును సానుకూలంగా పరిశీలించిన కోర్టు.. కలర్స్ సంస్థకు జరిమానా విధించింది. కస్టమర్ చెల్లించిన 74652 రూపాయల మొత్తాన్ని 9శాతం వడ్డీతో చెల్లించాలని ఆదేశించింది. అంతేకాకుండా, వినియోగదారుల సంక్షేమ నిధికి 2 లక్షల రూపాయల్ని జరిమానాగా చెల్లించాలని ఆదేశించింది.

కలర్ సంస్థకు ఫైన్ విధించిన కోర్టు… రాశి, రంభ నటించిన యాడ్స్ పై నిషేధం విధించింది. వాటిని ప్రసారం చేయొద్దని సంస్థకు ఆదేశించింది. అదే సమయంలో రాశి, రంభపై కోర్టు అక్షింతలు వేసింది. సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని, వాణిజ్య ప్రకటనల్లో నటించే ముందు ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నామో ఆలోచించాలని సూచించింది. ఇక మీదట ఇటువంటి ప్రకటనల్లో నటించే తారలకు కూడా కొత్త చట్టం ద్వారా జరిమానా విధించే అవకాశం ఉందని గుర్తుచేసింది.

ప్రస్తుతానికి రంభ, రాశిలకు ఎలాంటి ఫైన్ విధించని కోర్టు, మొదటి తప్పుగా వాళ్లిద్దరికీ క్లాస్ పీకి వదిలేసింది. అయితే కలర్స్ కార్యక్రమం అనేది చాలా చిన్నది. ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా ప్రస్తుతం చాలా రకాల యాడ్స్ టీవీల్లో కనిపిస్తున్నాయి. వీటిపై ప్రజలే స్పందించాలి. సాక్ష్యాలతో కన్జూమర్ కోర్టును ఆశ్రయించాలి. ప్రజల్లో ఈ తరహా చైతన్యం వచ్చినప్పుడే కార్పొరేట్ సమాజం ఒళ్లు దగ్గరపెట్టుకొని పనిచేస్తుంది.

చిరంజీవి గారి వల్లనే అవన్నీ సాధ్యం అయ్యాయి