జగన్ ఫోటో పెట్టుకుని, ఆయన ఇచ్చిన బీఫారం మీద గెలిచిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామక్రిష్ణ రాజు, మన ఇంట్లో దాణా మేసేసి పక్కోడి ఇంట్లోకెళ్లి గుడ్డుపెట్టే రకం కోడి లాంటి వాడని అందరికీ తెలుసు.
జగన్ ను చూసి.. నియోజకవర్గ ప్రజలు ఆయనను ఎంపీగా గెలిపిస్తే.. ఆ తర్వాత నియోజకవర్గంలో అడుగుపెట్టి ప్రజలను పలకరించడానికి కూడా భయపడే ఎంపీ బహుశా దేశంలో ఆయన ఒక్కరే ఉంటారని కూడా అందరికీ తెలుసు. నిరంతరం ఢిల్లీలో కూర్చుని ప్రెస్మీట్లు పెడుతూ, యూట్యూబ్ వీడియోలు విడుదల చేస్తూ ముఖ్యమంత్రి జగన్ ను తిడుతూ, పార్టీ అధ్యక్షుడు జగన్ ను పొగుడుతూ.. రకరకాలుగా తెలివితేటలు ప్రదర్శిస్తుండే వ్యక్తి ఆయన.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇంక తనకు ఠికానా లేదని తెలిసిపోయిన తర్వాత ఆయన వేరే పార్టీ తీర్థం పుచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఏదో జగన్ బొమ్మతో గెలిచాడు తప్ప.. తనకంటూ వార్డు మెంబరుగా కూడా గెలవలేని ఆయనను తీసుకోవడానికి పార్టీలే సుముఖత చూపడం లేదు. బిజెపి వారి ప్రాపకం కోసం బహుధా ప్రయత్నించినప్పటికీ వారు పట్టించుకోలేదని అంటుంటారు. ఇప్పుడు తెలుగుదేశం భజన కూడా చేస్తున్నాడు.
అలాంటి రఘురామక్రిష్ణ రాజు ఇప్పుడు తాజాగా ఒక సరికొత్త అవతారం ఎత్తారు. ఆయన తెలుగుదేశం వారికి, ఆ పార్టీ తరఫున సోషల్ మీడియాలో రెచ్చిపోయే వారికి, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతూ ఓవరాక్షన్ చేసే వారికి ఆయన న్యాయ సలహాలు ఇస్తున్నారు. అంటే రఘురామక్రిష్ణ రాజు కొత్తగా లీగల్ ఎడ్వయిజర్ పాత్ర పోషిస్తున్నారన్నమాట.
ఇటీవలి పరిణామాల్లో ఒక ఎమ్మెల్యే తమ్ముడి మీద లోకేశ్ టీం కోర్టులో ఫిర్యాదు చేయడాన్ని అభినందించిన రఘురామక్రిష్ణ రాజు అదే పని అందరూ చేయాలంటున్నారు. రాష్ట్రంలో పోలీసుల వలన హింసకు గురైన వారందరూ కూడా ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టుల్లో ఫిర్యాదుచేయాలని, ప్రభుత్వం మారిన తర్వాత వారి మీద చర్యలు తీసుకోవచ్చునని ఆయన సలహా ఇస్తున్నారు. ప్రభుత్వం అంటేనే.. తమకు నచ్చని వారి మీద చర్యలు తీసుకునే వ్యవస్థ అని చంద్రబాబులాగానే ఆయన కూడా నమ్ముతున్నట్లుగా ఉంది.
ఇంతకి ఈ లీగల్ ఎడ్వయిజర్ గా.. న్యాయసలహాలు ఇవ్వడానికి ఆయన లా చదివారా అంటే తెలియదు. అంత పెద్ద న్యాయకోవిదుడా అంటే అదీకాదు. కానీ ఏదో సామెత చెప్పినట్టుగా కొత్త వైద్యుడికంటె పాత రోగి మేలన్నట్టు.. నిత్యం అనేక కేసుల్లో ఉంటూ.. బ్యాంకులకు వందల కోట్ల రుణాల ఎగవేతలతోసహా అన్ని కేసుల్లో కోర్టులకు హాజరవుతూ లేదా న్యాయవాదులతో సంప్రదిస్తూ ఉండే ఈ వ్యక్తికి.. ఆ మాత్రం న్యాయ పరిజ్ఞానం అప్రయత్నంగానే వచ్చి ఉంటుంది అని జనం అనుకుంటున్నారు.