ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి ఆ బేసిక్ నాలెడ్జి లేదా?

చంద్రబాబునాయుడు తనది ఫార్టీఫోర్ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటారు. అలాంటప్పుడు కనీసం బేసిక్ నాలెడ్జీ అయినా పద్ధతిగా ఉండాలి కదా. అలా లేకుండా వ్యవహరిస్తే ప్రజలు నవ్వుకుంటారని ఆయనకు తెలియదా? అంతకు మించి.. ఇన్నాళ్లు…

చంద్రబాబునాయుడు తనది ఫార్టీఫోర్ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటారు. అలాంటప్పుడు కనీసం బేసిక్ నాలెడ్జీ అయినా పద్ధతిగా ఉండాలి కదా. అలా లేకుండా వ్యవహరిస్తే ప్రజలు నవ్వుకుంటారని ఆయనకు తెలియదా? అంతకు మించి.. ఇన్నాళ్లు రాజకీయాల్లో ఉండి ఇలాంటి బేసిక్ నాలెడ్జి కూడా సంపాదించుకోలేకపోయిన వ్యక్తికి మళ్లీ అధికారం కట్టబెడితే.. రాష్ట్రాన్ని ఇంకెంత అధోగతి పాల్జేస్తాడో అనే అనుమానం వాళ్లకు కలగదా? అనే ప్రశ్నలు ఇప్పుడు ఎదురవుతున్నాయి.

పోలవరం సందర్శన అనే పేరుతో.. ఒక సాధారణ ఎమ్మెల్యే అయిన తాను అక్కడికి వెళ్లేప్పుడు కనీసం నిబంధనలు పాటించాలనే జ్ఞానం లేకుండా భంగపడిన చంద్రబాబుకు అక్కడి పోలీసులు బాగానే బుద్ధి చెప్పారు. 

ఇంతకూ ఏం జరిగిందంటే.. ఇదేం ఖర్మ పేరుతో రాష్ట్రమంతా తిరిగి నానా యాగీ చేయడానికి చంద్రబాబు ఒక పెద్ద టూర్ షెడ్యూల్ నే పెట్టుకొన్నారు. ఊరూరా తిరుగుతున్నారు. జగన్ సర్కారు మీద నిందలేస్తున్నారు. ఇందులో భాగంగానే పోలవరం కూడా వెళ్లాలనుకున్నారు. అసలే అనుమతులు ఉంటే తప్ప ఎవరినీ లోపలకు పంపడానికి వీల్లేని ప్రాంతం అది. 

చంద్రబాబుకోసం బోలెడన్ని బ్యానర్లు, స్వాగత తోరణాలు గట్రా ఏర్పాటుచేసి.. నానా హడావుడిగా వస్తాం అనంటే ఊరుకుంటారా? పోలీసులు అడ్డుకున్నారు! చాలా సహజంగా పోలీసుల మీద అగ్గిమీద గుగ్గిలం అయిపోయారు చంద్రబాబునాయుడు. తెలుగుదేశం కార్యకర్తలు వందల సంఖ్యలో అప్పటికే చేరుకున్నారు. ఈ ఉదంతాన్ని ఇంకాస్త నాటకీయంగా రక్తి కట్టించడానికి.. ‘అయిదూళ్లు ఇమ్మనిరి అయిదుగురకు.. అంటూ భారతంలో శ్రీకృష్ణుడు రాయబారం ఘట్టంలో పద్యాలు పాడిన స్టయిల్లో..’ చంద్రబాబునాయుడు కూడా.. తమలోంచి కనీసం అయిదుగురిని మాత్రం ప్రాజెక్టు వద్దకు అనుమతించాలని అడిగారు. 

ఎంతమంది అయినా సరే.. అనుమతి తెచ్చుకుంటేనే పంపుతాం అని పోలీసులు తెగేసి చెప్పారు. మళ్లీ ఎప్పుడు రమ్మంటారని అడిగితే.. ముందు జలవనరుల శాఖ నుంచి అనుమతి తెచ్చుకోండి.. ఎప్పుడైనా రావొచ్చునని పోలీసులు జవాబిచ్చారు. 

ఇక్కడ ప్రజలకు కలుగుతున్న సందేహం అదే.. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లాలంటే.. జలవనరుల శాఖ అనుమతి తెచ్చుకోవాలని ఆయనకు తెలియదా? పోలవరం విషయంలో తనకు మించిన నాలెడ్జి మరెవ్వరికీ లేదని చెప్పుకునే చంద్రబాబునాయుడు.. ఆ శాఖ నుంచి అనుమతి లేకుండానే వెళ్లిపోవచ్చునని ఎలా అనుకున్నారు?.

ఏదో తనను ఆపేశారనే డ్రామా నడిపించడానికి తప్ప.. జలవనరుల శాఖ అనుమతి తెచ్చుకోవాలనే సంగతి నేర్చుకోకుండానే.. ఆయన మూడుమార్లు ముఖ్యమంత్రిగా తన పదవీకాలాన్ని పూర్తి చేశారా? అని ప్రజలు అనుకుంటున్నారు. ఇలాంటి డ్రామాలు జనాన్ని మెప్పించవు. అది డ్రామా అని జనం గుర్తించినా, ఆయనలో అంత అజ్ఞానం ఉన్నదా అని అనుకున్నా.. రెండు రకాలుగానూ ఆయనకే నష్టం.