కవితక్క.. కంగారులో అతిగా స్పందించిందా?

‘‘రాను రానంటూనే చిన్నదో .. చిన్నదీ.. రాములోరి గుడికొచ్చే చిన్నదో చిన్నదీ..’’ అంటూ ఓ జనరంజకమైన సినిమా పాట ఉంది. గులాబీ తనయ కల్వకుంట్ల కవిత వ్యవహరిస్తున్న తీరు కూడా ఈ చిత్రంలో హీరోయిన్…

‘‘రాను రానంటూనే చిన్నదో .. చిన్నదీ.. రాములోరి గుడికొచ్చే చిన్నదో చిన్నదీ..’’ అంటూ ఓ జనరంజకమైన సినిమా పాట ఉంది. గులాబీ తనయ కల్వకుంట్ల కవిత వ్యవహరిస్తున్న తీరు కూడా ఈ చిత్రంలో హీరోయిన్ వ్యవహరించిన తీరుగానే కనిపిస్తోంది. పట్టించుకోవద్దు.. పట్టించుకోనక్కర్లేదు.. భయపడను.. అని ఆమె చాలా ఢంకా బజాయించి చెబుతుంది. కానీ పట్టించుకోకుండా క్షణమైనా ఆగలేకపోతున్నది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఒక రిమాండ్ రిపోర్ట్ లో తన పేరు బయటకు రాగానే.. కంగారుగా ప్రెస్ మీట్ పెట్టి ఖండించడం ద్వారా కవిత తొందరపడ్డట్టుగా ప్రజలు భావిస్తున్నారు. 

ఎందుకంటే..ఢిల్లీ మద్యం కుంభకోణంలో అమిత్ అరోడా అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతని రిమాండ్ రిపోర్టులో ఆ మద్యం కుంభకోణంతో సంబంధం ఉన్నట్టుగా మరో 36 మంది పేర్లను కూడా కలిపారు. అందులో తెలుగురాష్ట్రాలకు చెందిన ప్రముఖులు పదిమందికి పైగా ఉన్నారు. అయితే వారందరిలోకీ కవితకే కాస్త కంగారు ఎక్కువగా ఉన్నట్టుంది. ఎందుకంటే.. తన పేరు బయటకు రాగానే, చాలా రోజులుగా వినిపిస్తున్న ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి.. పోలీసు రికార్డుల్లోకి ఎక్కినట్టు మీడియాలో కనిపించగానే ఆమె అగ్గిమీద గుగ్గిలం అయిపోయారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ ఫైర్ అయ్యారు. 

ఇందులో ఇంకా చాలా మంది పేర్లున్నాయి. ఒంగోలు ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి లాంటి వారు కూడా ఉన్నారు. వారెవ్వరూ స్పందించలేదు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి అమిత్ అరోడాతో తనకు సంబంధం లేదని చిన్న వివరణ మాత్రమే ఇచ్చారు. అది రాజకీయం చేయాలనుకోలేదు. కవిత మాత్రమే మీడియా ఎదుటకు వచ్చి బిజెపిని, మోడీని, ఈడీని నానా తిట్లు తిట్టారు.

సాధారణంగా ఒక పెద్ద అవినీతి కుంభకోణం జరిగినప్పుడు.. అందులో సంబంధం ఉన్నా లేకపోయినా కొందరు ప్రముఖుల పేర్లు చర్చల్లోకి వస్తుంటాయి. వాళ్లెవ్వరూ వాటిని సీరియస్ గా తీసుకోరు. దర్యాప్తు సంస్థలు తమ ఇంటి దాకా వచ్చి ఇబ్బంది పెడితే తప్ప వారినుంచి స్పందన ఉండదు. ఇది సహజం. అయితే కల్వకుంట్ల కవిత పేరు విననపడగానే ఒక ప్రెస్ మీట్ పెట్టేసి.. ఇదంతా బీజేపీ కుట్ర అనేయడమే తమాషా!

కవిత ఎంత చిత్రంగా మాట్లాడుతున్నారంటే.. బిజెపి ఇలాంటి నీచమైన ఎత్తుగడలకు పాల్పడుతుంటుందని.. అది హీనమైన చర్య అని అంటున్నారు. మోడీ రావడానికి ముందుగా ఏ రాష్ట్రానికైనా ఈడీని పంపిస్తారని పంచ్ డైలాగులతో ఎద్దేవా చేస్తున్నారు. ఈడీ, సీబీఐలు కాదు కదా.. ఎటువంటి విచారణకైనా మేం సిద్ధం అంటున్న కల్వకుంట్ల కవిత.. విచారణ అయ్యేదాకా ఆగి, దానిని ఎదుర్కొని కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చి.. ఇప్పుడు చెబుతున్న నిందాత్మక ప్రవచనాలు అన్నీ చెప్పవచ్చును కదా. 

తన నిజాయితీ బయటపడిన తర్వాత.. బిజెపి ఎంత దుర్మార్గమైనదో, ఎంత నీచమైనదో చెబితే ప్రజలకు ఇంకా బాగా అర్థమవుతుంది కదా.. ఇప్పుడే కంగారు పడి ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకు అని ప్రజలు అనుకుంటున్నారు. పట్టించుకోవద్దు అంటూనే రెచ్చిపోతున్న తరహాలోనే, మేం భయపడం అంటున్న ఆమె మాటల్లోనే భయం కనిపిస్తోందని, కావాలంటే .జైళక్లలో పెట్టుకోండి అనడం ముందస్తుగా జనం సానుభూతి పొందే ప్రయత్నంలాగా ఉన్నదని ప్రజలు అనుకుంటున్నారు.