అవినీతి బయటకు తెలియకుండా దాచడం చూశాం. ఆయా సమయాలు, సందర్భాల్లో నిజాల్ని, అబద్ధాల్ని దాచి పెడుతుంటారు. అదేంటో గానీ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గురించి బయటి ప్రపంచానికి పెద్దగా తెలియకుండా దాస్తున్నారు. ఆయన పరిధిని చాలా కుదిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఎన్నికల ముంగిట ఎల్లో మీడియా ఎందుకీ నిర్ణయం తీసుకుందో అనే చర్చకు దారి తీసింది.
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏదో ఒక కార్యక్రమం పేరుతో కొన్ని రోజులుగా జనంలోకి వెళ్తున్నారు. జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తూర్పారపడుతున్నారు. బాబు కార్యక్రమాలకు టీడీపీ అనుకూల మీడియా విపరీతమైన ప్రాధాన్యం ఇస్తోంది. టీడీపీకి ఇది అవసరం కూడా. ఇదే సందర్భంలో టీడీపీ భవిష్యత్ రథసారథి లోకేశ్‌ను మాత్రం సదరు మీడియా పెద్దగా పట్టించుకోవడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఉదాహరణకు గత రెండు రోజులుగా లోకేశ్ గుంటూరు జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. బుధవారం తాడేపల్లి పట్టణంలోనూ, అలాగే గురువారం దుగ్గిరాల మండలంలోని మోరంపూడి గ్రామంలో ఇదేం ఖర్మ కార్యక్రమాల్లో లోకేశ్ పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. లోకేశ్ కార్యక్రమాల్ని టీడీపీ అనుకూల పత్రికలు టాబ్లాయిడ్లకే పరిమితం చేయడం వెనుక ఉద్దేశం ఏమై వుంటుందనే చర్చ జరుగుతోంది.
లోకేశ్ నాయకత్వాన్ని ఎక్కువగా ప్రచారం చేయడం వల్ల పార్టీకి నష్టం వస్తుందనే భయాందోళన ఎల్లో మీడియాలో చూడొచ్చు. మరి జనవరి 27 నుంచి లోకేశ్ పాదయాత్ర చేస్తే… పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
ఏది ఏమైనా లోకేశ్ వల్ల ఏమవుతుందో అనే భయం, ఆందోళన టీడీపీతో పాటు ఆ పార్టీ అనుకూల మీడియాలో గూడు కట్టుకున్నట్టే కనిపిస్తోంది. అందుకే సాధ్యమైనంత వరకూ ఎన్నికల ముంగిట లోకేశ్‌ను దాచి పెట్టడమే టీడీపీకి లాభదాయకం అనే అభిప్రాయంలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.