ఇదేం ఖర్మ రాష్ట్రానికి అంటూ చంద్రబాబు జనంలోకి వెళ్లారు. అయితే ఆ కార్యక్రమం టీడీపీకి రివర్స్ అయ్యింది. జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం పక్కన పెడితే, జగన్ దెబ్బకు వివరణ ఇవ్వడానికే సరిపోతోంది. ఒకవేళ టీడీపీ అధికారంలోకి వస్తే… ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయని జగన్‌తో పాటు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తునా ప్రచారం చేస్తున్నారు.
గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం పేరుతో అధికార పార్టీ నేతలూ ప్రతిరోజూ ఇంటింటికి వెళ్లి గత మూడున్నరేళ్లలో అందిన లబ్ధి గురించి నేరుగా వివరిస్తున్నారు. మరోసారి తమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరుతున్నారు. మరీ ముఖ్యంగా టీడీపీని గెలిపిస్తే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయని అధికార పార్టీ నేతలు గడపగడపకూ వెళ్లి హెచ్చరిస్తున్నారు. దీంతో తమకు కలిగే లబ్ధి ఆగిపోతుందనే భయం సామాన్య ప్రజానీకంలో వుంది.
ఈ నేపథ్యంలో రాజకీయంగా తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని చంద్రబాబు భయపడుతున్నారు. సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం శ్రీలంకలా మారిపోతుందని దుష్ప్రచారం చేసిన చంద్రబాబే… ప్రజల్లో వ్యతిరేకతను పసిగట్టి యూటర్న్ తీసుకున్నారు. అబ్బే… తామొస్తే ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని నిలిపేది లేదని ఊరూరా ప్రచారం చేయడం మొదలు పెట్టారు. దీంతో జగన్ పథకాలకు బాబు ప్రచారం చేస్తున్నారనే సరదా కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.
‘టీడీపీ గెలిస్తే సంక్షేమ కార్యక్రమాలు రద్దవుతాయని ఈ చేతగాని నేతలు వలంటీర్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. మీరు నమ్మొద్దు. మేమొస్తే ఏ సంక్షేమ కార్యక్రమమూ రద్దు కాదు. ప్రభుత్వ ఆదాయం పెంచి పేదలను మరింత ఎక్కువగా ఆదుకుంటాం’ అని ఇదేం ఖర్మ కార్యక్రమంలో చంద్రబాబు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.
జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను బాగా అమలు చేస్తోందని ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రజల సమక్షంలో ఒప్పుకుంటున్నారు. సంక్షేమ పథకాల అమలు విషయంలో మాత్రం జగన్‌ను ఎవరూ తప్పు పట్టలేరు. అలాంటిది జగన్‌ను కాదని పేద, బడుగు బలహీన వర్గాల ప్రజలు మరో నాయకుడి గురించి ఎందుకు ఆలోచిస్తారు? తన పాలనలో ప్రతి కుటుంబానికి లబ్ధి కలిగితేనే ఓటు వేయాలని జగన్ నేరుగా ప్రజలతో అంటుండం మనందరం వింటున్నాం.
అధికారంలో ఉన్న ఐదేళ్లు ఏమీ చేయకుండా, ఈ దఫా వస్తే అద్భుతాలు చేస్తానని చెప్పినంత మాత్రాన జనం నమ్ముతారని చంద్రబాబు ఎలా అనుకుంటున్నారో అనే చర్చకు దారి తీసింది. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి పేరుతో జనంలోకి వెళుతూ… జగన్ సంక్షేమ పాలన అందిస్తున్నారని, తనకు అధికారం ఇస్తే అదే పని చేస్తానని చంద్రబాబు ప్రచారం చేయడం వైసీపీకి కిక్ ఇస్తోంది. ఇదే సందర్భంలో చంద్రబాబు ప్రచార డొల్లతనాన్ని బయట పెడుతోంది.