గంభీర సాగర కెరటాలు అనునిత్యం అక్కడ సమరమే చేస్తాయి. ఎగిసిపడే కడలి కెరటాల ఆరాటం ఒక అద్భుత పోరాటంగా కనిపిస్తుంది. చూసేవారికి ఎన్నో జీవిత పాఠాలను నేర్పిస్తుంది. విశాఖ బీచ్ ఆహ్లాదంతో పాటు అలజడిని అలికిడిని కలిగిస్తుంది.
అటువంటి సాగరతీరమే ఇపుడు యుద్ధ క్షేత్రం అయింది. బీచ్ వద్ద బాంబుల మోతతో అందమైన విశాఖకు అసలేమి జరుగుతోంది అన్న ఉత్కంఠ అందరిలో కనిపిస్తోంది. సాయంకాలం సాగర తీరం అని వచ్చేవారు సైతం గగుర్పాటుకు గురి అయ్యే విధంగా యుద్ధ సన్నివేశాలు అక్కడ చోటు చేసుకుంటున్నాయి.
ఇదంతా డిసెంబర్ 4న జరిగే విశాఖ నేవీ డేకు ముందు రిహాల్సల్స్. గగనతలంలో యుద్ధ హెలికాప్టర్లు, సాగర మధ్యంలో ఉన్న యుద్ధ నౌకల నుంచి తూటాల మోతలు, బాంబులు కురిపించే వణికించే సన్నివేశాలు. గత వారం రోజులుగా విశాఖ సాగర తీరం సమర నినాదం చేస్తోంది.
యుద్ధ హెలికాప్టర్ల నుంచి సైనికులు తాడు సాయంతో సముద్రంలో ఉన్న నౌకలోకి అలవోకగా దూకేస్తున్నారు. అక్కడ నుంచి శతృవు గుట్టు మట్టుకుని కనిపెట్టి పనిపడుతున్నారు. తమ వద్ద ఉన్న ఆయుధాలతో పగవాని పీచమణుస్తున్నారు. భారత నావికాదళ పాటవం ఎంతటి ఘనమైనదో చాటి చెప్పే ఈ దృశ్యాలు నగర పౌరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి, గర్వంగా అనిపిస్తున్నాయి.
నేవీ డేలో ప్రదర్శించే అనేక విన్యాసాలు ముందుగానే చూసే భాగ్యం విశాఖ వాసులకు దక్కుతోంది. సాయంకాలం విహారానికి వచ్చిన వారు నావికాదళ ప్రదర్శనలు చూసి అబ్బురపడుతున్నారు, సంబరపడుతున్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో ఈ నెల 4 ఆదివారం మూడు గంటల పాటు విరామం లేకుండా సాగే ఈ విన్యాసాల కోసం నగరం యావత్తు ముస్తాబైపోతోంది.