అదేంటి.. ముద్దుపెట్టింది భార్యకే కదా, మరి అలాంటప్పుడు విడాకులెందుకు? ఇక్కడ మేటర్ ఏంటంటే, గదిలో పెట్టాల్సిన ముద్దును 300 మధ్యలో పెట్టాడు సదరు భర్త. అందుకే ఆ భార్యామణికి కోపమొచ్చింది, వెంటనే విడాకులిచ్చింది.
ఉత్తర్ ప్రదేశ్ లోని సంభాల్ లో నవంబర్ 26న వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. 28వ తేదీన పావసా గ్రామంలో భారీగా రిసెప్షన్ ఏర్పాటుచేశారు. దాదాపు 300 మంది అతిథులు హాజరయ్యారు. స్టేజ్ పై నూతన వధూవరులు కూర్చున్నారు.
అంతా ఆహ్లాదకరంగా, సజావుగా సాగుతున్న టైమ్ లో.. ఉన్నట్టుండి సడెన్ గా తన భార్యను ముద్దుపెట్టుకున్నాడు భర్త. ఊహించని ఈ పరిణామానికి భార్య షాక్ అయింది. ఆ వెంటనే కోపం తెచ్చుకుంది. వెంటనే స్టేజ్ దిగి చకచకా తన గదిలోకి నడుచుకుంటూ వెళ్లిపోయింది.
కోపంతో రగిలిపోతున్న పెళ్లికూతుర్ని శాంతింపజేసేందుకు కుటుంబ సభ్యులు చాలా రకాలుగా ప్రయత్నించారు. కానీ కొత్త పెళ్లికూతురు మాత్రం మాట వినలేదు. వందలాది మంది మధ్య తన పర్మిషన్ లేకుండా ముద్దాడిన భర్త క్యారెక్టర్ ను ఆమె అనుమానించింది.
వేదికపైకి వెళ్లాల్సిన వధువు, పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. భర్తపై ఫిర్యాదు చేసింది. తన భర్త ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందని, అతడితో ఉండలేనని ఫిర్యాదులో పేర్కొంది.
ఇంతకీ ముద్దు ఎందుకు పెట్టాడు..?
ఇంతకీ సదరు వరుడు ఎందుకు అలా ముద్దుపెట్టుకోవాల్సి వచ్చింది? శోభనం వరకు ఆగలేకపోయాడా? దీనికి పెళ్లికొడుకు ఇచ్చే వివరణ మరో రకంగా ఉంది. తన ఫ్రెండ్స్ తో పెళ్లికొడుకు పందెం కాసాడంట. అందరి మధ్య భార్యను ముద్దుపెట్టుకుంటానని, అలా పెట్టుకుంటే 1500 రూపాయలు ఇవ్వాలని, పెట్టుకోకపోతే 3వేలు ఇస్తానంటూ పందెం కాశాడంట. అందుకే అలా ప్రవర్తించాల్సి వచ్చిందనేది వరుడు వాదన.
అయితే ఈ వాదనతో కొత్త భార్య ఏకీభవించలేదు. అలాంటి పందెం ఒకటి ఉందని తనకు తెలియదని స్పష్టం చేసింది. రెండు కుటుంబాలు సుదీర్ఘంగా వాదించుకున్న తర్వాత, కొత్తగా పెళ్లయిన భార్యాభర్తలిద్దరూ విడిపోవడమే కరెక్ట్ అని అంతా ఓ నిర్ణయానికొచ్చారు. వాళ్లిద్దరి పెళ్లి అధికారికంగా రిజిస్టర్ కాలేదు కాబట్టి, వెంటనే విడిపోవచ్చని పోలీసులు కూడా తేల్చారు.