జ‌గ‌న్ కాదు…ష‌ర్మిల వెనుక ఎవ‌రంటే!

తెలంగాణ‌లో వైఎస్ ష‌ర్మిల రాజ‌కీయంగా దూకుడు వెనుక బీజేపీ వుందా? అంటే…ఔన‌ని టీఆర్ఎస్ అంటోంది. తెలంగాణ‌లో ష‌ర్మిల రాజ‌కీయ పార్టీ పెట్ట‌డాన్ని ఆమె అన్న వైఎస్ జ‌గ‌న్ తీవ్రంగా వ్య‌తిరేకించిన‌ట్టు గ‌తంలో ఏపీ ప్ర‌భుత్వ…

తెలంగాణ‌లో వైఎస్ ష‌ర్మిల రాజ‌కీయంగా దూకుడు వెనుక బీజేపీ వుందా? అంటే…ఔన‌ని టీఆర్ఎస్ అంటోంది. తెలంగాణ‌లో ష‌ర్మిల రాజ‌కీయ పార్టీ పెట్ట‌డాన్ని ఆమె అన్న వైఎస్ జ‌గ‌న్ తీవ్రంగా వ్య‌తిరేకించిన‌ట్టు గ‌తంలో ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి బ‌హిరంగంగా చెప్పిన సంగ‌తి తెలిసిందే. ష‌ర్మిల రాజ‌కీయ పార్టీతో త‌మ‌కెలాంటి సంబంధం లేద‌ని ఆయ‌న కుండ‌బ‌ద్ధ‌లు కొట్టిన‌ట్టు చెప్ప‌డంపై తాను నొచ్చుకున్న‌ట్టు అప్ప‌ట్లో ష‌ర్మిల చెప్పారు.

తెలంగాణ‌లో మూడు నాలుగు రోజులుగా ష‌ర్మిల కేంద్రంగా రాజ‌కీయాలు వేడెక్కాయి. ష‌ర్మిల పాద‌యాత్ర‌పై టీఆర్ఎస్ శ్రేణులు దాడికి పాల్ప‌డ‌డం తీవ్ర వివాదాస్ప‌ద‌మైంది. ఈ సంద‌ర్భంగా అరెస్టులు, బెయిల్‌లు త‌దిత‌ర ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. ష‌ర్మిల‌కు సంబంధించి జ‌గ‌న్ ప్ర‌మేయం లేద‌ని టీఆర్ఎస్ పార్టీ నిర్ధార‌ణ‌కు వ‌చ్చింది. అయితే ష‌ర్మిల వెనుక బీజేపీ వుండి నాట‌కం ఆడిస్తోంద‌ని ఆ పార్టీ అనుమానిస్తోంది.

ష‌ర్మిల పాద‌యాత్ర‌పై టీఆర్ఎస్ శ్రేణుల దాడిని కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి ఖండించ‌డం, అలాగే గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై ఆవేద‌న వ్య‌క్తం చేయ‌డాన్ని టీఆర్ఎస్ గుర్తు చేస్తూ… ఆమె వెనుక బీజేపీ వుంద‌ని రుజువుకు ఇంత కంటే ఏం కావాల‌ని టీఆర్ఎస్ నేత‌లు ప్ర‌శ్ని స్తున్నారు. ఈ నేప‌థ్యంలో ష‌ర్మిల‌పై తెలంగాణ ప్ర‌భుత్వ చీఫ్‌విప్ విన‌య్ భాస్క‌ర్ విమ‌ర్శ‌లు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి.

తెలంగాణ‌తో ష‌ర్మిల‌కు సంబంధం ఏంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. కుటుంబంతో గొడ‌వ‌లు వుంటే అక్క‌డే తేల్చుకోవాల‌ని ఆయ‌న సూచించారు. కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ డైరెక్షన్‌లో షర్మిల నడుస్తోందని ఆయ‌న ఆరోపించారు. జ‌గ‌న్‌తో ష‌ర్మిల‌కు విభేదాలున్నాయ‌ని టీఆర్ఎస్ నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. ఇదే సంద‌ర్భంలో బీజేపీతో ష‌ర్మిల‌కు స‌న్నిహిత సంబంధాలున్నాయ‌ని ఆరోపించ‌డం వెనుక నిజం ఎంత అనేది రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఇదిలా వుండ‌గా త‌న వెనుక బీజేపీ వుంద‌న్న ఆరోప‌ణ‌ల‌పై ష‌ర్మిల గ‌ట్టిగానే స‌మాధానం ఇచ్చారు. గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసైని క‌లిసి విన‌తిప‌త్రం స‌మ‌ర్పించిన అనంత‌రం ఆమె రాజ్‌భ‌వ‌న్ వెలుప‌ల మీడియాతో మాట్లాడారు. బీజేపీతో సంబంధాల‌పై మీడియా అడిగిన ప్ర‌శ్న‌కు ఆమె ఘాటుగా స‌మాధానం ఇచ్చారు. ఇంత‌కాలం బీజేపీతో చెట్ట‌ప‌ట్టాలేసుకుని తిరిగింది టీఆర్ఎసే అని ఆరోపించారు. బీజేపీతో టీఆర్ఎస్ అంట‌కాగితే మాత్రం సంసారం, మ‌రెవ‌రైనా చేస్తే వ్య‌భిచార‌మా? అని ఆమె చుర‌క‌లు అంటించారు.