పాన్ ఇండియా రఫ్ మూవీ…అడవి శేష్

తన స్టామినా ఏంటొ, తనకు ఏ పాత్రలు సెట్ అవుతాయో తెలుసుకుని, ఆ దిశగా సాగిపోతున్న హీరో. మిగిలిన వారికి దొరకని చాన్స్ ఒకటి అడవి శేష్ కు దొరికింది. హీరోలు నిర్మాతలు గా…

తన స్టామినా ఏంటొ, తనకు ఏ పాత్రలు సెట్ అవుతాయో తెలుసుకుని, ఆ దిశగా సాగిపోతున్న హీరో. మిగిలిన వారికి దొరకని చాన్స్ ఒకటి అడవి శేష్ కు దొరికింది. హీరోలు నిర్మాతలు గా మారితే ఆ సినిమాలకు హీరోగా అడవి శేష్ నే తీసుకోవడం. మహేష్ బాబు తీసిన మేజర్ కు శేష్ నే హీరో. నాని తీసిన హిట్ 2 కి కూడా డిటో డిటో. త్వరలో నాగ్ తీయబోతున్న సినిమా లోనూ శేష్ నే హీరో. హిట్ 2 సినిమా విడుదల నేపథ్యంలో అడవి శేష్ తో చిట్ చాట్.

హిట్ 2 విషయంలో కొంచెం టెన్షన్ గా కనిపిస్తున్నారు

ఏ సినిమా టైమ్ లో అయినా ఇలాగే వుంటాను. కావాలంటే మేజర్ ప్రమోషన్ వీడియోలు చూడండి. అది బై డిఫాల్ట్ నాలో వుంది. విడుదల ముందు టెన్షన్ పడడం, ఎంతకూ చేస్తున్నదే చేస్తూ వుండడం. నిర్మాత వదిలేస్తే ఆ సినిమా అలా చేస్తూనే వుంటాను. ఒకటికి పది వేల వెర్షన్లు

ఎందుకు అలా? మీ వర్క్ మీద మీకు నమ్మకం లేకనా? సంతృప్తి పాయింట్ అన్నది లేకనా?

నమ్మకం అని కాదు. ఇంకా బెటర్..ఇంకా బెటర్ అని అనుకుంటూనే వుంటాను. అదే సమస్య. ఎక్కడో విన్నాను. నిరంతరం ప్రాక్టీస్ చేస్తేనే సచిన్ కాగలం అని. నేను సచిన్ ను కావాలనుకుంటున్నాను.

అంతేనా హిట్ 2 ను హిట్ చేసి తీరాల్సిన బాధ్యత మీద వుందునుకుంటున్నారా?

అదేం లేదు. ఏ సినిమా చేసినా హండ్రెడ్ పర్సంట్ ఇవ్వడానికే చూస్తాను

థ్రిల్లర్లు అంటేనే ఓ సెట్ ఆఫ్ ఆడియన్స్ కు పరిమితం అవుతాయి. హిట్ 2 ఆ విషయంలో మరీ లిమిటెడ్ అవుతుందని ఏమైనా అనిపిస్తోందా?

థ్రిల్లర్లకు ఆ సమస్య ఎప్పుడూ వుంటుంది. సాధారణంగా థ్రిల్లర్ సినిమాల్లో కిల్లర్ కు కూడా ఒక ఫ్లాష్ బ్యాక్, మోటివ్ సెట్ చేస్తూ వుంటారు. అలాంటిది ఏమీ లేకుండా హిట్2 డిజైన్ చేసారు.ఎవరు చంపారు అన్నది కాకుండా ఎందుకు చంపారు అన్నది కూడా కీలకంగా వుంటుంది. అందువల్ల రెగ్యులర్ యూత్ ఆడియన్స్ టికెట్ లతో పాటు అదనపు టికెట్ లు కూడా తెగుతాయనే అనుకుంటున్నాను.

మీకంటూ మీకు నప్పే పాత్రలు, సినిమాలు సెట్ చేసుకున్నారు. మొత్తానికి ఓ లైన్ లోకి ఒదిగిపోయారు. మరి దీనిని విస్తరించుకుంటూ ముందుకు వెళ్లే ఆలోచనలు వున్నాయా?

కచ్చితంగా. కొంచెం కొంచెంగా పెంచుకొవాలనే చూస్తున్నాను. మేజర్ అలాంటి ప్రయత్నమే. త్వరలో ఓ ఆస్కార్ అవార్డు సినిమాను తెలుగులో చేస్తున్నాను. పాన్ ఇండియా లెవెల్ లో వుంటుంది. అన్నపూర్ణ సంస్థతో పాటు ఓ హాలీవుడ్ సంస్థ కూడా ఈ సినిమాతో ఇక్కడ పరిచయం అవుతోంది.చాలా రఫ్ క్యారెక్టర్ అందులో నాది.

హీరోలు సినిమా నిర్మించాలంటే మీరే గుర్తుకు వస్తారా?

అదేదో అలా సెట్ అవుతోంది. నా వర్క్ మీద నమ్మకం అని అనుకుంటాను. అది నా అదృష్టం.

సినిమాలో మీరు వుంటే స్క్రిప్ట్ కెలికేస్తారని భయం దర్శకులకు వుంటుందా?

నేను కెలకను. నేను రైటర్ గా వున్న సినిమాలకు ఎలాగూ అలా అనుకునే అవకాశం వుంటుంది. రైటింగ్ చేయని హిట్ 2 లాంటి సినిమాల విషయంలో అనేక సందేహాలు వ్యక్తం చేస్తాను. వాటికి సమాధానాలు వస్తే చేయి కాదు వేలు కూడా పెట్టనక్కరలేదు. హిట్ 2 సినిమా విషయంలో నా సందేహాలకు దర్శకుడు స్క్రిప్ట్ లోనే సమాధానాలు ఇచ్చేసాడు. అందువల్ల ఈ సినిమాకు నేను హీరోను మాత్రమే.

ఇంక ఎన్నాళ్లు ఇలా సటిల్ట్ పెర్ ఫార్మెన్స్, ఫ్లర్టింగ్, లిప్ లాక్స్…బోర్ కొట్టేస్తే.

అలా అని లేదు. అమెరికాలో పుట్టి పెరగడం వల్ల సటిల్డ్ పెర్ ఫార్మెన్స్ అలవాటు. ఈ సినిమాలో కాస్త దాన్ని దాటి చేసాను. మిగిలినవన్నీ కథకు అనుగుణంగానే తప్ప కావాలని కాదు.

హిట్ 2 అయిన తరువాత కూడా ఇంకా సినిమాలేనా? పెళ్లికి గ్యాప్ ఏమైనా తీసుకుంటారా?

పెళ్లి ఆలోచన అంతగా లేదు. ఎందుకంటే ఇంట్లో అమ్మ నాన్నలకే సమయం ఇవ్వలేకపోతున్నాను. నాకు సినిమా తప్ప మరోటి పట్టదు. పార్టీలకు కూడా దూరం. అందువల్ల ఇప్పుడైతే పెళ్లి గురించి ఆలోచన లేదు. చేసుకోవాలి..ఇక తరువాత పెళ్లే అని ఎప్పుడయినా అనిపిస్తే అప్పుడు వుంటుంది.

విఎస్ఎన్ మూర్తి