బోడిగుండుకి, మోకాలికి ముడివేయడంలో హీరోయిన్ కంగనా రనౌత్ పండిపోయింది. సుశాంత్ సింగ్ మరణించినప్పుడు ఆమె పోస్టులు చూస్తే ఎవరికైనా ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది. మరోవైపు బీజేపీని వెనకేసుకొచ్చే క్రమంలో మహారాష్ట్ర సర్కారుపై కంగనా చేసిన విమర్శలు కూడా ఈ సామెతను గుర్తుచేస్తాయి. ఇప్పుడీ ముద్దుగుమ్మ మరో కొత్త లాజిక్ తో తెరపైకొచ్చింది.
నాగచైతన్య-సమంత విడాకుల వ్యవహారం ఈరోజు అధికారికంగా బయటకొచ్చింది. చైతూ, సమంతతో పాటు నాగార్జున కూడా ఈ విషయాన్ని నిర్థారించారు. ఇప్పుడీ వ్యవహారంపై కంగనా స్పందించింది. వీళ్లిద్దరి విడాకుల మధ్యలోకి అమీర్ ఖాన్ ను లాక్కొచ్చింది.
తాజాగా విడాకులిచ్చిన ఈ సౌత్ హీరో, కొన్ని రోజుల కిందట ఓ బాలీవుడ్ సూపర్ స్టార్ ను కలిశాడని, ఆ వెంటనే తన భార్యకు సౌత్ హీరో విడాకులిచ్చాడని పేర్కొంది కంగనా. సదరు బాలీవుడ్ సూపర్ స్టార్ కు బాలీవుడ్ లో విడాకుల స్పెషలిస్ట్ గా పేరుందని, ఎంతోమంది మహిళలు, పిల్లల జీవితాలతో ఆడుకున్నాడంటూ పరోక్షంగా అమీర్ పై సెటైర్లు వేసింది కంగన.
పదేళ్లు రిలేషన్ షిప్ లో ఉండి, నాలుగేళ్లు వైవాహిక జీవితాన్ని గడిపిన హీరో.. విడాకుల స్పెషలిస్ట్ అయిన బాలీవుడ్ స్టార్ ను కలిసిన వెంటనే, సదరు బాలీవుడ్ స్టార్ సూచనలు-సలహాల మేరకు సౌత్ హీరో తన భార్యకు విడాకులిచ్చాడంటూ రాసుకొచ్చింది కంగన. అమీర్-చైతూ కలిసి లాల్ సింగ్ చద్దా అనే సినిమా చేశారు.
ఈ సందర్భంగా మగాళ్లందరిపై ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చేసింది ఈ బాలీవుడ్ హీరోయిన్. సమాజంలో విడాకుల వ్యవహారం ఎప్పుడు తెరపైకొచ్చినా అందులో మగాడిదే తప్పంటోంది కంగన. దేవుడు అలా సృష్టిని తయారుచేశాడని.. మగాళ్లు వేటగాళ్లుగా, మహిళలు బలిపశువులుగా మారడం ఆనవాయితీ అని చెప్పుకొచ్చింది. దుస్తులు మార్చినంత ఈజీగా ఆడవాళ్లను మార్చేసే పురుషుల పట్ల జాగ్రత్తగా ఉండాలని మహిళా లోకానికి ఓ సందేశం ఇచ్చింది ఈ ''తలైవి''.