“సమంత, నాగచైతన్య విడిపోతే అదేమన్నా జాతీయ సమస్యా? సమాజానికి పనికొచ్చే వార్తలు చెప్పండి” అని ఒకరు..
“ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు..నచ్చలేదు..విడిపోయారు. ఏమిటిందులో పెద్ద వార్త. కోట్లాది డైవొర్సుల్లో ఇదొక డైవర్సు. దేనికి దీని మీద ఇన్నిన్ని వార్తలు” అని ఇంకొకరు…
ఇలా సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.
అందరికీ తెలిసిన విషయమే. సెలబ్రీటీల వార్త కాబట్టి, అందునా మోస్ట్ లవబుల్ కపుల్ కాబట్టి ఈ వార్తకి సమాజంలో చాలామంది కనెక్ట్ అయ్యారు.
సామాజిక అంశం చర్చించునే ముందు ఒక మాట. ఇలాంటి ఏ వార్తైనా జనానికి ఆసక్తికరమే. వీరిలో కొంతమంది నిజంగా బాధపడొచ్చు, కొందరు జోకులేసుకోవచ్చు. అంతే తప్ప పట్టించుకోని వాళ్లు తక్కువ. కనుక మీడియా మొత్తం ఈ వార్తకి ప్రాధాన్యత ఇచ్చి తీరుతుంది.
ఇక సామాజిక విషయానికొద్దాం.
వినడాకిని కాస్త వింతగా అనిపిస్తున్నా, విడాకులు తీసుకోవాలని అనుకుంటూ నిర్ణయం తీసుకోవడానికి ఆలోచిస్తున్న చాలా మంది జంటలకు వీరి డైవొర్స్ స్ఫూర్తినివ్వొచ్చు. ఎలా అని అడగొచ్చు.
ఏదైనా నిర్ణయం తీసుకోవాడినికి సెలెబ్రిటీలకి చెందిన అంశాలు కొన్ని మైండులోకి వస్తాయి.
ఏ బ్రాండ్ చెప్పులు కొనాలి అనుకున్నప్పుడు ఇష్టమైన హీరో ఫలానా బ్రాండ్ చెప్పులు వేసుకుని తిరుగుతున్నాడు అని ప్రచారమైతే, ఆ చెప్పుల ధర రూ 7000 కి పైచిలుకైనా సామాన్యుడు కూడా ఎలాగో అలా కొనే ప్రయత్నం చెస్తాడు.
ఏ వెంచర్లో స్థలం కొనాలి అనుకున్నప్పుడు ఫలానా దర్శకుడు, గాయకుడు “నమ్మకానికి చిరునామా” అని చెప్తే అక్కడ స్థలం కొనబుద్ధేస్తుంది.
అలాగే జీవితానికి సంబంధించిన విషయంలో కూడా. భార్యాభర్తలకి పొసగనప్పుడు, విడిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు సమంత-నాగ చైతన్య విడిపోయారన్న వార్త వీళ్ల నిర్ణయానికి దోహదపడే అవకాశం లేకపోలేదు. ఇంకో మూణ్ణెల్లు ఆగి చూద్దాం అనుకునే జంటలు కూడా వచ్చే వారం పెటాకులకి దిగిపోవచ్చు.
అదే ఈ జంట కలిసిపోయి, “మేం విడిపోదామనుకున్న మాట వాస్తవం. కానీ కలిసుండడానికి నిర్ణయించుకున్నాం”, అని చెప్పి విడిపోవాలనుకున్నదానికి కారణాలు కాకుండా కలిసుండాలనుకునే దానికి కారణాలు చెబితే వచ్చే వారం విడాకులకి దిగుదామనుకున్న జంటలు కూడా ఆర్నెల్లు ఆగాక చూద్దామనుకోవచ్చు, లేక విడాకుల ఆలోచన పూర్తిగా విరమించుకుని కలిసిపోవచ్చు.
మన సమాజం మీద సినిమా సెలెబ్రిటీల ప్రభావం ఆ రేంజులో ఉంటుంది.
ఇంతకీ కలిసుండడం మంచిదా, విడిపోవడం మంచిదా అంటే ఎవరి వ్యక్తిగత వ్యవహారం వాళ్లది..నిజమే..కానీ వైవాహిక జీవితం అంటేనే ఓర్పు, ఓపిక, త్యాగం, అర్థం చేసుకోవడం అన్నిటికీ మించి క్షమా గుణం..అంతకన్న బలంగా “ఏం జరిగినా ఎప్పటికీ కలిసుండాలి” అనే కోరిక ఉండడం ముఖ్యం. ఇవన్నీ ఉంటేనే వైవాహిక బంధాలు నిలబడతాయి.
అందుకే పెళ్లిళ్లల్లో మంత్రాలు కూడా “ధర్మేచ, అర్థేచ, కామేచ నాతి చరితవ్యం- నాతి చరామి” అని చెప్పిస్తారు. అంటే “ధర్మం విషయంలో కానీ, ధనం విషయంలో కానీ, కోరికల విషయంలో కానీ వదలకూడదు- వదిలిపెట్టను” అని.
భార్యో, భర్తో ధర్మం తప్పారని వదిలేసే దాకా వెళ్లిపోకూడదు. ధర్మం తప్పాలని తప్పరు. ఇద్దరూ మానవమాత్రులే. ఏవో బలహీనతలుండొచ్చు, బలహీన క్షణాలుండొచ్చు. ధర్మం తప్పినా ఇక తప్పనని ఒట్టేసుకుని కలిసే బతకమంటుంది వైవాహిక ధర్మం.
అలాగే కట్నం తక్కువయ్యిందని భర్త భార్యని వదిలేయడం, తనకన్నా తక్కువ సంపాదిస్తున్నాడని, తన సంపాదన మీదే బతుకుతున్నాడని భార్య భర్తని వదిలేయడం సరికాదంటుంది మన వ్యవస్థ.
కోరికల విషయంలోనూ అంతే.
గొడవేదైనా, ఏ స్థాయిదైనా సరే ఇద్దరూ సర్దుకుపోయి ఉండాలి తప్ప విడిపోవడమనేది పనికిరాదని వివాహ వ్యవస్థ చెబుతుంది.
ఎందుకంటే వైవాహిక జీవితంలో వ్యక్తిత్వ వికాస సాధన ఉంటుంది. ఓర్పు, సహనం, లౌక్యం, బాధ్యత, త్యాగం, సేవాగుణం అన్నీ అలవడతాయి. ఇవే మనిషిని “కంప్లీట్ హ్యూమన్” గా తీర్చిదిద్దేవి.
“కలిసుంటే ఉండండి, లేకపోతే విడిపోండి..అంతే తప్ప బలవంతంగా బతకాల్సిన పనిలేదు” అని చాలామంది పెళ్లిని ఒక కంపెనీలో ఉద్యోగంలాగ భావించి చెబుతుంటారు.
ఈ రోజుల్లో ఇది పైపైకి సరైనదే అని చాలామందికి అనిపించినా మనిషిలో సహజంగా పెరగాల్సిన ఎన్నో మంచి లక్షణాలు విడాకులతోనే ఆగిపోతాయి.
అంటే, విడాకులైన జంటలంతా మంచివాళ్లు కాదని అనడంలేదు. భరించలేనంత బాధ కలిగినప్పుడే విడిపోతారు.
భర్త సాడిష్టయ్యి శారీరకంగా హింసించేవాడైతే ప్రాణాన్ని కాపాడుకోవడానికి మించిన విషయం మరొకటి ఉండదు కనుక విడిపోవాలనుకోవచ్చు. అయితే ఒక సర్వే ప్రకారం ఇలాంటి కారణాల వల్ల అయ్యే విడాకులు తక్కువ.
ఎక్కువ శాతం ఇగో క్లాషెస్ వల్లనో, ధనాశ మూలంగానో, అక్రమ సంబంధాల కారణంగానో విడాకులు జరుగుతున్నాయి. అన్నింటిలోనూ కామన్ గా అసలు కారణం చెప్పకుండా “భర్త నపుంసకుడు” అనో, “భార్య ముట్టుకోనీవట్లేదనో” దొంగ కారణాలు చెబుతుంటారని ఒక లాయర్ చెప్పారు. లా పాయింట్ ప్రకారం ఆ కారణాలు చెబితే విడాకులు త్వరగా మంజూరౌతాయని చెప్పడమే తప్ప అన్ని కేసుల్లోనూ ఇది నిజం కాదు.
ఇక ఇగో క్లాషెస్ ని హ్యాండిల్ చేయడానికి మ్యారేజ్ కౌన్సెలింగ్ సెంటర్స్ ఉన్నాయి. చట్టంలో విడాకుల ప్రక్రియ ఉన్నా కౌన్సెలింగ్ సెంటర్స్ ఎందుకున్నాయంటే…మన సమాజం, ప్రభుత్వం పెళ్లైన జంటలు కలిసుండాలనే కోరుకుంటుంది.
ధనాశ మూలంగా విడాకులనేవి నిత్యం వింటున్న వార్తలే. కట్నం కోసమో, ఆస్తి కోసమో వేధింపులు, వగైరాలు ఇందులో కామన్ పాయింట్. ఈ ధనాశని నియంత్రించుకోవడం కూడా పర్సనాలిటీ డెవల్ప్మెంటులో భాగమే. ఇలాంటి ధనాశ తప్పని చట్టం కూడా చేసి మరీ శిక్షలేస్తోంది మన రాజ్యాంగం.
ఇక చివరిది..అతి ముఖ్యమైనది “అక్రమ సంబంధం”.
తన జీవిత భాగస్వామి అక్రమసంబంధాన్ని ఎవ్వరూ సహించలేరు. అయితే అటువంటి సంబంధాలు పెట్టుకున్న ఎందరో మగాళ్లు శతాబ్దాలుగా భార్యలతో కాపురాలు చేస్తూనే వచ్చారు. అయినా భార్యలు భరిస్తూనే బతికేవారు. ఏమన్నా అంటే “మగాడు తిరగక చెడతాడు- ఆడది తిరిగి చెడుతుంది” అంటూ సామెతలు చెప్పి ఆ అధర్మాన్ని పరోక్షంగా ప్రోత్సహించేవారు. ఇక్కడ “తిరగడం” అనేది సాధారణ అర్థంలో తీసుకున్నా సరే, అసలు భావం ఏమిటంటే స్త్రీకి స్వేచ్ఛ లేని రోజుల్లో మగాళ్లకి ఇష్టారాజ్యంగా ఉండేది.
ఇప్పుడలా కాదు. స్త్రీకి సమాన హక్కులు కల్పించి, సమాజంలో భాగస్వామిని చేసి, ఉద్యోగాలు చేయమని ప్రోత్సహించి “ఆ” విషయంలో మాత్రం ఆడదానిలా ప్రవర్తించాలి కానీ మగాడిలా బరితెగించకూడదు అని కోరుకుంటున్న సమాజం మనది. “బరితెగింపు” మగవాడి లక్షణంగా, హక్కుగా మార్చి భ్రష్టుపట్టించుకున్న సమాజం కూడా మనదే.
నిజానికి ఆడైనా, మగైనా అక్రమ సంబంధం పెట్టుకుంటే ధర్మం తప్పినట్టే..అది బయట పడి జీవిత భాగస్వామిని బాధించినప్పుడు క్షమించే ఓపిక ఒకరికి, మళ్లీ ఆ తప్పు చేయనన్న నిశ్చయం మరొకరికి బలంగా ఉండాలి. అది సాధ్యమా అంటే కష్టమే. అసాధ్యం మాత్రం కాదు. ఈ పద్ధతిలో కాపురాలు కూలిపోకుండా నిలబెట్టుకున్నవాళ్లు కూడా ఎందరో ఉన్నారు.
అలా కాకుండా “మా వైవాహిక బంధం శరీరాలకి అతీతం. మా శారీరక విషయాలు, పరాయి సంబంధాలు మా బంధాన్ని ఏమీ చెయ్యవు” అని ఓషో విధానంలో పరస్పర అంగీకారంతో బతికేసే కొన్ని అత్యంత అరుదైన జంటలు కూడా ఉంటాయి. వాళ్ల గురించి మాట్లాడడంలేదు.
ఏది ఏమైనా సమంత- నాగచైతన్యల విడాకులకి గల కారణం ఎవ్వరికీ తెలియదు. అది వారి వ్యక్తిగతం. విషయం ఏదైనా సెలెబ్రిటీల విడాకులు సమాజంలోని యువజంటలకి స్ఫూర్తి కాకూడదు.
డబ్బు ఖర్చుపెట్టి పర్సనాలిటీ డెవెలప్మెంట్ క్లాసులకి వెళ్లక్కర్లేదు. వైవాహిక బంధంలో పెంపొందించుకునే ఎన్నో గొప్ప లక్షణాలు జీవితంలో ఎదగడానికి ఉపకరిస్తాయి.
జిం సెంటర్లో ఎనిమిది పుల్లప్స్ తీసాక “టూ మోర్” అంటూ కోచ్ ఇంకాస్త కష్టపడి పది పూర్తి చేయమంటాడు. కళ్లు మూసుకుని, ఊపిరి బిగపెట్టి బలవంతంగా చేసేస్తాం. కొన్నాళ్లకి శక్తి పెరిగి 15 చేయగలుగుతాం.
ఈ వ్యాసం ఉద్దేశం కూడా అలాంటిదే. దయచేసి ఈ వ్యాసకర్తని మ్యారిటల్ జిం కోచ్ అనుకోండి. మీ వైవాహిక జీవితంలో ఎంత కష్టంగా ఉన్నా కళ్లు మూసుకుని ఇంకొక్క రెండేళ్లు మౌనంగా భరించండి. ఆ తర్వాత మరో ఐదేళ్లు భరించే శక్తి రావొచ్చు. ఆ తర్వాత ఆలోచిస్తే “పదేళ్ల క్రితం విడాకులివ్వాలనుకున్నానా! హౌ సిల్లీ!!” అనిపించవచ్చు.
శ్రీనివాస మూర్తి