మిత్రపక్షమైన బీజేపీని జనసేనాని పవన్‌కల్యాణ్ ఇరకాటంలో పడేశారు. ఇందుకు బద్వేలు ఉప ఎన్నిక కారణమైంది. వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య మృతితో కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే అక్కడ వైసీపీ , టీడీపీ తమ అభ్యర్థులను కూడా ప్రకటించి ప్రచారంలో ఉన్నాయి. మరోవైపు నామినేషన్లు స్వీకరిస్తున్నారు.
ఇటీవల విజయవాడలో పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో బద్వేలులో క్షేత్రస్థాయి పరిస్థితులపై జనసేనాని పవన్‌కల్యాణ్ ఆరా తీశారు. అనంతరం బద్వేలులో పోటీపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, పవన్‌కల్యాణ్ మధ్య చర్చలు కూడా జరిగాయి. ఒకట్రెండు రోజుల్లో ఉమ్మడి అభ్యర్థిని ప్రకటిస్తామని సోము వీర్రాజు ప్రకటించారు. ఈ నేపథ్యంలో బద్వేలు ఉప ఎన్నికలో పోటీకి దూరంగా ఉంటామని పవన్‌కల్యాణ్ ప్రకటించి బీజేపీకి షాక్ ఇచ్చారు.
బద్వేలు ఉప ఎన్నికలో పోటీ చేయాలని ఒత్తిళ్లు ఉన్నప్పటికీ… రాజకీయ విలువల కోసం విరమించుకుంటున్నామని పవన్ కల్యాణ్ ప్రకటించారు. వైసీపీ ఎమ్మెల్యే చనిపోవడంతో ఆయన భార్యను పోటీలో నిలిపారని, ఆమెను గౌరవించి పోటీ చేయడం లేదని ఆయన తేల్చి చెప్పారు.
మరి ఇదే రీతిలో మిత్రపక్షమైన బీజేపీ కూడా భావిస్తుందా? ఒకవేళ బీజేపీ ఉప ఎన్నిక బరిలో దిగితే… వైసీపీ అభ్యర్థిపై గౌరవం, మానవత్వం లేదని భావించాలా? అనే చర్చకు దారి తీసింది. ఏది ఏమైనా పవన్ ఏకపక్ష నిర్ణయం బీజేపీకి ఒకింత ఆగ్రహం తెప్పిస్తోంది.
బద్వేలు ఉప ఎన్నికపై ఉమ్మడి ప్రకటన చేసి వుంటే, ఇరు పార్టీలకు గౌరవం ఉండేదని బీజేపీ అభిప్రాయపడుతోంది. కానీ జనసేనాని వైఖరి అనుమానాలకు తావిస్తోందని బీజేపీ భావన.