ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై జనసేనాని పవన్‌కల్యాణ్ కామెంట్స్ తీవ్ర చర్చకు దారి తీశాయి. ముఖ్యమంత్రి జగన్ తర్వాత, పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ సజ్జల రామకృష్ణారెడ్డి అత్యంత శక్తిమంతుడు. పేరుకు సలహాదారుడే కానీ, అన్ని విషయాలు ఆయనే మాట్లాడుతున్నారు. వైసీపీలో కీలకమైన సజ్జల రామకృష్ణారెడ్డి తనను కలిసినట్టు పవన్‌కల్యాణ్ ప్రకటించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
బహుశా వైసీపీ నేతల్లో పవన్ ప్రశంసలు అందుకున్న ఏకైక వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి ఒక్కరే అయి ఉంటారు. సజ్జలపై పవన్‌కల్యాణ్ తన అభిమానాన్ని, గౌరవాన్ని బహిరంగంగా చాటుకున్నారు. తన గురించి మీకు బాగా తెలుసని సజ్జల గురించి పవన్ అన్నారు. మనమేం మాట్లాడుకున్నామో మీకు తెలుసని పవన్ అనడంతో, వాళ్లిద్దరి కలయిక ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
2019 సార్వత్రిక ఎన్నికల ముందు వైసీపీ-జనసేన మధ్య పొత్తు ఉంటుందనే చర్చ పెద్ద ఎత్తున జరిగింది. జనసేనాని పవన్ కల్యాణ్‌తో పొత్తు పెట్టుకుంటే, అధికారంలోకి రావడం సులువవుతుందని అప్పట్లో జగన్‌పై తీవ్ర ఒత్తిడి వచ్చిందనే ప్రచారం కూడా జరిగింది. బహుశా ఆ నేపథ్యంలో ఏమైనా పవన్‌తో సజ్జల భేటీ అయ్యారా? అనే చర్చ జరుగుతోంది. పవన్‌తో సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ అయిన విషయం ఇప్పటి వరకూ ఎవరికీ తెలియకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
కడప జిల్లాలో వామపక్ష రాజకీయ సిద్ధాంతాల పునాదులపై సజ్జల రామకృష్ణారెడ్డి పెరుగుతూ వచ్చారు. ఆయన అన్న దివాకర్‌రెడ్డి సీపీఐ అనుబంధ విద్యార్థి సంఘంలో క్రియాశీలకంగా పనిచేశారు. దివాకర్‌రెడ్డి మామ నర్రెడ్డి శివరామిరెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు.
ఒక దఫా ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు. ఇదీ సజ్జల కుటుంబ రాజకీయ వాతావరణం. నిజానికి సజ్జలరామకృష్ణారెడ్డి మాట తూలరు. ప్రతిదీ ఆచితూచి మాట్లాడ్తారు. ఎక్కడా బ్యాలెన్స్ తప్పరని, అందరి అభిప్రాయాలు వింటారనే పేరుంది. సజ్జల గురించి పవన్ ఏమన్నారంటే…
“ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విజ్ఞత గల వ్యక్తి. ఓసారి కలిసినట్లు గుర్తు. ఆయన అన్నారంట యాక్షన్, కెమెరా, కట్ అని చెప్పి పవన్ వెళ్లిపోతాడని. అలా యాక్షన్, కెమెరా, కట్ అని చెప్పి వ్యక్తిని కాదు గురువు గారూ! మీరు పెద్దలు. మీ పార్టీలో అందరి కంటే మీకు నా గురించి బాగా తెలుసు. మీ నాయకుడికి తెలియదు కాని మీకు బాగా తెలుసు. మన ఇద్దరి సంభాషణల్లో మనమేం మాట్లాడుకున్నామో మీకు తెలుసు. మీలాంటి విజ్ఞులు ఉండి కూడా లక్షా 26 వేల కిలోమీటర్ల రోడ్లలో కనీసం 26 కి.మీ. రోడ్లను కూడా ఒక గుంత లేకుండా క్లీన్‌గా వేయలేని పరిస్థితి”
సజ్జల విజ్ఞులని, గురువు గారని, పెద్దలని పవన్ సంబోధించడం గమనార్హం. పవన్ పొగడ్తలు అందుకున్న సజ్జలపై వైసీపీ పెద్దలు గుస్సా అవుతారా? లేక అంతే అభిమానంగా చూసుకుంటారా? అనే సరదా చర్చ జరుగుతోంది. మొత్తానికి పవన్ తాట, తోలు తీసే జాబితా నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి తప్పించుకున్నట్టే!