ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన సగం పాలనా కాలానికి సమీపంలో ఉన్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించే సందర్భంలో జగన్ స్పష్టంగా …రెండున్నరేళ్ల తర్వాత కేబినెట్‌ను పూర్తిగా మారుస్తానని ప్రకటించారు. ఆ సమయం రానే వచ్చింది. దీంతో నూతన కేబినెట్ కూర్పుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
కొత్త కేబినెట్‌లో ఎవరుండాలనేది ముఖ్యమంత్రి ఇష్టమని మంత్రులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త కేబినెట్‌లో ఎవరెవరు ఉంటారనే అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది.
ఇందులో భాగంగా ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. జగన్ కేబినెట్‌లో అత్యంత సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా తొలగించనున్నారని సమాచారం. అయితే పెద్దిరెడ్డి పదవి మాత్రం పదిలం అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడైన చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డిని మంత్రి పదవి వరించనుందని సమాచారం. దీంతో రామచంద్రారెడ్డి పదవి పోయినా, తన తమ్ముడికి ఇప్పించుకోవడం ద్వారా మరోసారి చక్రం తిప్పొచ్చనే ఎత్తుగడ వేసినట్టు సమాచారం.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడికి మంత్రి పదవి ఇచ్చేందుకు సీఎం కూడా సుముఖంగా ఉన్నారని తెలిసింది. ఒకవేళ ద్వారకనాథరెడ్డికి కాదనుకుంటే మాత్రం… చిత్తూరు జిల్లాలో నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా లేదా చెవిరెడ్డి పేర్లను పరిశీలించొచ్చనే చర్చ జరుగుతోంది. మరో రెండుమూడు నెలల్లో మంత్రులుగా కొత్త ముఖాలను చూడడం ఖాయం.