పవన్ ఇంటర్వ్యూ: షో ఎక్కువ..మేటర్ తక్కువ

పవన్ కల్యాణ్ ఇంటర్వ్యూ అదిగో వస్తోంది, ఇదిగో వస్తోంది.. అంటూ ఫొటోలు రిలీజ్ చేసి బిల్డప్ ఇచ్చినంత సీన్ అసలా ఇంటర్వ్యూలో కనిపించలేదు. ఇంకా చెప్పాలంటే పవన్ నటించిన ఎన్నో సినిమాల్లా.. ఈ ఇంటర్వ్యూలో…

పవన్ కల్యాణ్ ఇంటర్వ్యూ అదిగో వస్తోంది, ఇదిగో వస్తోంది.. అంటూ ఫొటోలు రిలీజ్ చేసి బిల్డప్ ఇచ్చినంత సీన్ అసలా ఇంటర్వ్యూలో కనిపించలేదు. ఇంకా చెప్పాలంటే పవన్ నటించిన ఎన్నో సినిమాల్లా.. ఈ ఇంటర్వ్యూలో కూడా ప్రచారం ఎక్కువ, మేటర్ తక్కువ. లాక్ డౌన్ తర్వాత తొలిసారి కెమెరా ముందుకొస్తున్నాడంటే.. మాంచి ఫైర్ తో కనిపిస్తాడనుకున్నారంతా. చివరకు ప్రోమో కటింగ్ లో ఉన్నంత ఎఫెక్ట్ కూడా పవన్ మాటల్లో ఏమాత్రం కనిపించలేదు. ఇంటర్వ్యూ ఆసాంతం సోది, సుత్తి.

సామాజిక దూరం పాటిస్తూ పవన్ ఇంటర్వ్యూ ఇచ్చారు అంటే.. ఎంతమంది జర్నలిస్ట్ లను పిలిచారో అనుకున్నారు కానీ.. అక్కడుంది ఒక్కరే ఒక్కరు, అది కూడా జనసేన మీడియా హెడ్ హరిప్రసాద్. జర్నలిస్ట్ లు, జనం తరపున ఆయన ప్రశ్నలు అడిగారు. ఆయన దూరం నుంచి నిలబడి ప్రశ్నలు అడిగితే.. ఈయన కుర్చీలో కాలు మీద కాలేసుకుని సమాధానాలు చెప్పారు. దీన్నసలు ఇంటర్వ్యూ అని ఎందుకు ప్రచారం చేసుకున్నారో జనసేన నాయకులకే తెలియాలి. 

తాను చెప్పాలనుకున్న అంశాలన్నిటినీ పవనే స్వయంగా చెప్పొచ్చు కదా. ఇంటర్వ్యూ అనే పేరు పెట్టి, తనకు నచ్చిన ప్రశ్నలనే అడిగించుకుని, తను ప్రిపేర్ చేసుకున్న సమాధానాలు చెప్పడాన్ని ఇంటర్వ్యూ అని, సోషల్ మీడియా కోసం ప్రత్యేకంగా ఇచ్చారని చెప్పుకోవడం ఎందుకు? రాగా పోగా పవన్ కల్యాణ్ చాతుర్మాస్య దీక్ష చేస్తున్నారనే విషయాన్ని హైలెట్ చేసుకోడానికి మాత్రమే ఈ ఇంటర్వ్యూ పనికొచ్చింది.

2003కి ముందు అయ్యప్ప మాల వేసుకునేవాడిని, ఆ తర్వాత చాతుర్మాస్య దీక్ష చేపట్టాను, సినిమాల్లో ఉన్నప్పుడు దీని గురించి ఎవరికీ తెలియలేదు, ఇప్పుడు ప్రజా జీవితంలోకి వచ్చాను కాబట్టి అందరికీ తెలిసిందని చెప్పుకొచ్చారు పవన్. ఈ సెల్ఫ్ డబ్బా పక్కనపెడితే మిగతాదంతా వైసీపీపై పడి విమర్శలు చేయడానికే సరిపోయింది.

ఏపీ నాయకత్వం కరోనా గురించి సరిగా అంచనా వేయలేకపోయిందని, ఆస్పత్రిలో కొవిడ్ బాధితులకు ఆహార, వైద్య సదుపాయాలు బాగా లేవని చెప్పుకొచ్చారు పవన్. దళితులను వైసీపీ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని అన్నారు. ఇక రాజధాని విషయంలో కూడా వైసీపీ నిర్ణయాన్ని తప్పుబట్టారు జనసేనాని. గత ప్రభుత్వ తప్పిదాన్ని తెలివిగా తప్పిస్తూ.. ఇప్పుడున్న ప్రభుత్వం వల్ల ఒరిగేదేమీ లేదని చెప్పే ప్రయత్నం చేశారు.

వాస్తవానికి పవన్ ఇంటర్వ్యూ అంటే కొన్ని పంచ్ డైలాగులు, ఇంకొన్ని పదునైన విమర్శలు, మరికొన్ని సవాళ్లు ఎదురు చూస్తారు అభిమానులు, ప్రజలు. కానీ అవేవీ లేకుండా చప్పగా సాగిపోయింది ఈ ఇంటర్వ్యూ. కనీసం నాలుగైదు మీడియా సంస్థల నుంచి జర్నలిస్ట్ లను పిలిచినా అది వేరే రకంగా ఉండేది. ప్రశ్నలు, సమాధానాలు కాస్త ఘాటుగా సాగేవి. అలాంటివేవీ లేకుండా పవన్ కల్యాణ్ పవర్ లెస్ ఇంటర్వ్యూ ఇచ్చారు.

పార్ట్-1 ఇంత దారుణంగా ఉంటే.. ఇక దీనికి పార్ట్-2 కూడా ఉందట. ఆ ముచ్చట ఎలా ఉంటుందో చూడాలి.

నేను ఎప్పటికీ పవన్ భక్తుడినే