ఎంపీలుగా అధికారం వెలగబెడుతున్నవారు.. మరికొన్ని నెలల పాటు ఉండగల ఆ వైభవాన్ని పక్కన పెట్టి, అసెంబ్లీ బరిలోకి అడుగుపెట్టడం అనేది సహజంగా జరుగుతూ ఉండేదే. కానీ ఒక పార్టీకి ఉన్న ఎంపీలందరూ.. అసెంబ్లీకే పోటీపడితే దాని సంకేతాలు ఇంకాస్త ఆసక్తికరంగా ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అదే జరుగుతోంది. ఆ పార్టీకి ప్రస్తుతం ముగ్గురు లోక్ సభ సభ్యులు ఉండగా ఆ ముగ్గురూ కూడా అసెంబ్లీ బరిలో దిగే అవకాశం ఉంది.
17 ఎంపీ సీట్లు ఉన్న తెలంగాణలో కాంగ్రెసుకు ముగ్గురు సభ్యులున్నారు. మల్కాజిగిరి నుంచి రేవంత్ రెడ్డి, భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్గొండ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీలు. అయితే ఇప్పుడు జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ముగ్గురూ కూడా ఎమ్మెల్యే బరిలోనే కంటెస్ట్ చేయాలని అనుకుంటున్నారు.
ఎంపీలందరూ ఎమ్మెల్యే బరిమీద ఫోకస్ పెడుతుండడం అనేది.. పార్టీకి ఒక రకంగా మేలు, ఒక రకంగా చేటు. ఎందుకంటే.. ఇలాంటి పోకడ ద్వారా.. రాష్ట్రంలో కాంగ్రెస్ ఈ దఫా ఖచ్చితంగా అధికారంలోకి రాబోతున్నదని వారందరూ నమ్ముతున్నట్టుగా ప్రజల్లోకి సంకేతాలు వెళతాయి. అదే సమయంలో.. వీరు తప్ప మరొకరు ఆ ఎంపీ నియోజకవర్గాల్లో గెలిచే అవకాశాలు తక్కువగా ఉండే నేపథ్యంలో.. కేంద్రంలోని పార్టీకి బలం సన్నగిల్లినట్టు అవుతుంది.
పీసీసీ చీఫ్ అయినా సరే.. కాంగ్రెసులో ఎమ్మెల్యే టికెట్లకు దరఖాస్తు చేసుకోవాల్సిందే అని గతంలో రేవంత్ ప్రకటించారు. అలాగే తాను 2018లో ఓడిపోయిన కొడంగల్ నుంచే బరిలో ఉంటానని కూడా స్పష్టం చేశారు. అదే సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం తనకు నల్గొండ అసెంబ్లీ సీటు కావాలని దరఖాస్తు చేసుకున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం.. తనకు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని అనుకున్నారేమో గానీ.. హుజూర్ నగర్, కోదాడ సీట్లు రెండూ తమ దంపతులకు గ్యారంటీ అని ఆల్రెడీ ప్రకటించేసుకున్నారు.
ఈ మూడు నియోజకవర్గాల నుంచి కూడా గత ఎన్నికల్లో ఓడిపోయిన నాయకులు వీరే కాబట్టి.. అక్కడి ఆశావహుల నుంచి వీరికి పెద్దగా పోటీ ఉండకపోవచ్చు. ఇదంతా పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందనే విశ్వాసంతోనే జరుగుతున్న పరిణామం అయితే గనుక.. పార్టీకి ఇంకో ప్రమాదం పొంచి ఉంటుంది. పార్టీ గెలిచాక సీఎం సీటుకోసం పోటీ వస్తారనే ఉద్దేశంతో.. కాంగ్రెస్ నాయకులు ఒకరి వెనుక మరొకరు గోతులు తవ్వుకునే అవకాశం ఉంది. వాటన్నింటినీ పార్టీ ఎలా తట్టుకుంటుందో చూడాలి.
అటువైపు ఏపీ రాజకీయాల్లో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను , విశాఖ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దించడానికి జగన్ నిర్ణయించుకున్నట్టుగా కూడా వార్తలువచ్చాయి.