ఉప్పెన సినిమాకు జాతీయ అవార్డు వస్తుందని ఎవరైనా ఊహించారా? పుష్ప సినిమాకు నేషనల్ అవార్డు వస్తుందని విడుదలకు ముందు ఎవరైనా చెప్పారా? ఈ రెండు సినిమాలకు జాతీయ అవార్డులు వస్తాయని, ఇద్దరు ఊహించారట. వాళ్లలో ఒకరు చిరంజీవి కాగా, మరొకరు సుకుమార్.
ఉప్పెన సినిమా కథను వైష్ణవ్ తేజ్ కంటే ముందు చిరంజీవికి వినిపించాడు బుచ్చిబాబు. చిరంజీవి ఆమోద ముద్ర పడిన తర్వాతే వైష్ణవ్ తేజ్ రంగంలోకి దిగాడు. కథ వినే క్రమంలో ఈ సినిమాకు జాతీయ అవార్డు వస్తుందని చిరంజీవి అప్పుడే చెప్పారట. ఇప్పుడు బుచ్చిబాబు ఆ మేటర్ బయటపెట్టాడు. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఉప్పెనకు నేషనల్ అవార్డ్ వచ్చిన సంగతి తెలిసిందే.
ఇక పుష్ప విషయానికొద్దాం. ఈ సినిమాలో నటనకు గాను అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు వచ్చింది. తనకు అవార్డు వస్తుందని బన్నీ ఆశపడ్డాడో లేదో మనకు తెలియదు కానీ, అల్లు అర్జున్ కు కచ్చితంగా అవార్డ్ వస్తుందని సుకుమార్ సెట్స్ లోనే గ్రహించాడట. ఈ విషయాన్ని నిర్మాత నవీన్ బయటపెట్టారు. పుష్ప సినిమా షూటింగ్ జరుగుతున్న టైమ్ లో, బన్నీకి కచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుందని, చాలాసార్లు నవీన్ తో అన్నాడట సుకుమార్.
ఇలా పుష్ప, ఉప్పెన సినిమాలకు జాతీయ అవార్డులు వస్తాయని ఇటు సుకుమార్, అటు చిరంజీవి ఎప్పుడో గ్రహించారట. టాలీవుడ్ చరిత్రలోనే ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి హీరోగా అల్లు అర్జున్ చరిత్ర సృష్టించడంతో.. ఇండస్ట్రీలో చిన్నపాటి పండగ వాతావరణం నెలకొంది.