అతి సర్వత్ర వర్జయేత్‌

సోష‌ల్ ఇంజ‌నీరింగ్ పేరుతో అధికార పార్టీ వైసీపీ విప‌రీత పోక‌డ‌ల‌కు వెళుతోంద‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. త‌మ అధికారాన్ని చ‌క్క‌బెట్టుకునేందుకు ఇత‌రుల హ‌క్కుల‌ను కాల‌రాసేందుకు కూడా వైసీపీ అధిష్టానం వెనుదీయ‌డం లేద‌ని ఆవేద‌న‌, ఆక్రోశం ఆ…

సోష‌ల్ ఇంజ‌నీరింగ్ పేరుతో అధికార పార్టీ వైసీపీ విప‌రీత పోక‌డ‌ల‌కు వెళుతోంద‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. త‌మ అధికారాన్ని చ‌క్క‌బెట్టుకునేందుకు ఇత‌రుల హ‌క్కుల‌ను కాల‌రాసేందుకు కూడా వైసీపీ అధిష్టానం వెనుదీయ‌డం లేద‌ని ఆవేద‌న‌, ఆక్రోశం ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయ‌క‌త్వంలో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. తాజాగా ఎంపీపీ, వైస్ ఎంపీపీ అభ్య‌ర్థుల ఎంపిక‌లో వైసీపీ ఓ మెలిక పెట్టింద‌న్న స‌మాచారం గుప్పుమంటోంది.

మండ‌ల ప్ర‌జాప‌రిష‌త్ అధ్య‌క్ష (ఎంపీపీ), ఉపాధ్య‌క్ష (వైస్ ఎంపీపీ) ప‌దవుల‌ను ఏ సామాజిక వ‌ర్గాల‌కు కేటాయించాల‌నే దానిపై అధికార వైసీపీ త‌మ పార్టీ ఎమ్మెల్యేల‌కు దిశానిర్దేశం చేసింద‌ని చెబుతున్నారు. ఎమ్మెల్యే సామాజిక వ‌ర్గానికి చెందిన వారికి ఎంపీపీ ప‌ద‌వి ఇవ్వ‌కూడ‌ద‌నేది అధిష్టానం ఆదేశమ‌ని అంటున్నారు. 

సంబంధిత మండ‌లంలో ఎమ్మెల్యే సామాజిక వ‌ర్గం త‌ర్వాత అత్యధికంగా ఉండే సామాజిక వ‌ర్గం వారికి ఎంపీపీ ప‌ద‌వి, ఆ త‌ర్వాత మూడో ప్ర‌భావిత సామాజిక వ‌ర్గం వారికి ఉపాధ్య‌క్ష ప‌ద‌వి కేటాయించాల‌ని ఎమ్మెల్యేల‌కు అధిష్టానం స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇచ్చిన‌ట్టు స‌మాచారం. ఇప్ప‌టికే పుర‌పాల‌క ఎన్నిక‌ల్లో ఈ విధానాన్ని అమ‌లు చేశామ‌ని, ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో కూడా ఫాలో కావాల‌ని ఆదేశించిన‌ట్టు స‌మాచారం.

ఈ ఆదేశాల‌పై ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఆశావ‌హులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఆల్రెడీ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో రిజ‌ర్వేష‌న్ ప్ర‌కార‌మే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, వైస్ ఎంపీపీ, జెడ్పీ చైర్మ‌న్‌, వైస్ చైర్మ‌న్ సీట్ల‌ను కేటాయించిన విష‌యాన్ని గుర్తు చేస్తున్నారు. చ‌ట్ట ప్ర‌కారం రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేస్తే చాల‌ని, అంత‌కు మించి వెళ్ల‌డం అంటే ఇత‌రుల హ‌క్కుల‌ను కాల‌రాయ‌డ‌మే అన్న అభిప్రాయాలు బ‌ల‌ప‌డుతున్నాయి.

పుర‌పాల‌క అధ్య‌క్ష ప‌ద‌వుల్లో మ‌హిళ‌ల‌కు రికార్డు స్థాయిలో 60.46 శాతం క‌ల్పించారు. అలాగే ఏపీ చ‌రిత్ర‌లోనే తొలిసారిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వ‌ర్గాల‌కు 78 శాతం ప‌ద‌వులు ద‌క్కాయి.  
 
11 మేయర్, 75 మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పదవులతో కలిపి మొత్తం 86కిగానూ చట్ట ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 45 కేటాయించాల్సి ఉంది. కానీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏకంగా 67 పదవులను వారికి కేటాయించింది. అలాగే 86 పదవుల్లో మైనార్టీలతో సహా బీసీలకు 30 పదవులు కేటాయించాల్సి ఉండగా 52 ఇచ్చిన‌ట్టు వైసీపీ నేత‌లు చెబుతున్నారు. బీసీలకు కేటాయించాల్సిన పదవులకన్నా ఏకంగా 70.3 శాతం పదవులను అదనంగా ఇచ్చినట్టు వైసీపీ ప్ర‌భుత్వం లెక్క‌లేసి మ‌రీ ప్ర‌క‌టిస్తోంది.

మహిళలకు సంబంధించి… మేయర్లు, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు కలిపి మొత్తం మీద 86 పదవుల్లో మహిళలకు 50 శాతం కేటాయించాలి. ఆ ప్రకారం 44 పదవులు కేటాయించాల్సి ఉండగా ముఖ్యమంత్రి ఏకంగా 52 మంది మహిళలకు పదవులు క‌ట్ట బెట్టారు. దీంతో మహిళలకు 60.46 శాతం పదవులు ఇచ్చి మ‌హిళా సాధికార‌త‌కు త‌మ ప్ర‌భుత్వం పెట్ట పీట వేసిన‌ట్టు జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఘ‌నంగా చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఇందులో జనరల్, బీసీ జనరల్, ఎస్సీ జనరల్‌గా రిజర్వ్‌ అయిన స్థానాల్లో కూడా చాలా చోట్ల మహిళలకే అవకాశం కల్పించారు.

ఈ క్ర‌మంలో అగ్ర‌కులాల వారి హ‌క్కుల‌కు భంగం వాటిల్ల‌డాన్ని విస్మ‌రించ‌కూడ‌దు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వ‌ర్గాల హ‌క్కుల‌ను కాపాడ‌డంతో పాటు వారిని అంద‌లం ఎక్కించ‌డం అంటే, మిగిలిన సామాజిక వ‌ర్గాల హ‌క్కుల‌ను కాల‌రాయ‌డంతో పాటు అథఃపాతాళానికి తొక్క‌డం కాద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ముఖ్యంగా రాజ్యాధికారంలో జ‌నాభా ప్రాతిప‌దిక‌న భాగ‌స్వామ్యం కావాల‌ని ఆయా వ‌ర్గాలు బ‌ల‌మైన డిమాండ్ చేస్తున్నాయి.

నిజానికి వారి జ‌నాభాకు త‌గ్గ‌ట్టు టికెట్లు, ప‌ద‌వులు ఇవ్వాల్సి వ‌స్తే… స్థానిక సంస్థ‌ల‌తో పాటు ఆపై ఉన్న వాటిలో భాగ‌స్వామ్యం క‌ల్పిస్తే అద్భుత‌మే. ఎందుకంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల‌తో పాటు మ‌హిళ‌లు కోరుకుంటున్న‌ది ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్య‌మంత్రి, మంత్రులు, ఇత‌ర ముఖ్య‌మైన ప‌ద‌వుల‌ను కాబ‌ట్టి. 

కావున త‌మ ప‌ద‌వుల‌ను స్థిర‌ప‌రుచుకునేందుకు కింది వాళ్ల‌ను తొక్క‌డం మానేసి, చ‌ట్ట క‌ల్పించిన రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేస్తే స‌రిపోతుంది. అలా కాకుండా అధికార వైసీపీ తానొక రిజ‌ర్వేష‌న్ సిస్టంను ప్ర‌త్యేకంగా తీసుకొస్తే మాత్రం… భ‌విష్య‌త్‌లో ముప్పు త‌ప్ప‌ద‌ని గ్ర‌హిస్తే మంచిది. “అతి సర్వత్ర వర్జయేత్‌”. దీని అర్థం… ఏ విషయంలోను అతిగా ఉండకూడదు అని.